నక్సలిజంపై అభివృద్ధి అస్త్రం
క్యాటో సమన్వయ భేటీలో డీజీపీల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్/భోగాపురం: మావోయిస్టులను అణచివేసేందుకు అభివృద్ధి అస్త్రాన్ని ప్రయోగించాలని క్యాటో సమావేశం నిర్ణయిం చింది. మెరుగైన వైద్య సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించడం, ఉపాధి కల్పించడం, రవాణా, సమాచార వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలను పెంచడానికి ప్రణాళిక రూపొంచింది. మావోయిస్టులకు గిరిజనులు సహాయ నిరాకరణ చేసేలా చర్యలు తీసుకుంటే.. నక్సలిజాన్ని కూకటివేళ్లతో పెకలించి వేయవచ్చునని తీర్మానించింది. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని సన్‌రే విలేజ్ రిసార్ట్స్‌లో శుక్రవారం ‘క్యాటో’(చత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణ, ఒడిశా) సమన్వయ సమావేశం ప్రారంభమైంది.
రెండు రోజుల ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, ఒడిశా డీజీపీలు జేవీ రాముడు, అనురాగ్ శర్మ, కేబీ సింగ్, ఛత్తీస్‌గఢ్ అదనపు డీజీపీ టీజే లాంగ్ కుమేర్, ఆయా రాష్ట్రాల నిఘా అధికారులు, సీఆర్పీఎఫ్ డెరైక్టర్ జనరల్, బీఎస్ఎఫ్, కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులు, మెరైన్ పోలీసు విభాగం అధికారులు పాల్గొన్నారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దులోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోరాపుట్, మల్కన్‌గిరి తదితర జిల్లాల ఎస్పీలు, డీఐజీలు, ఐజీలు పాల్గొన్నారు.
దేశ అంతర్గత భద్రతను పరిరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజులపాటు సాగే క్యాటో సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణ, ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో రహదారి, సమాచార వ్యవస్థను అభివృద్ధి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎవరిపై ఆధారపడకుండా జీవించే వాతావరణాన్ని గిరిజనులకు కల్పిస్తే నక్సల్స్‌కు వారు సహకరించే పరిస్థితి ఉండదని సమావేశం అభిప్రాయపడింది. నాలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య సమన్వయం, సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా నక్సల్స్‌తోపాటు మాదక ద్రవ్యాల స్మగ్లర్లు వంటి సంఘ విద్రోహక శక్తులను నియంత్రించవచ్చని సమావేశం అభిప్రాయపడింది.