వాళ్లకూ మనకూ తేడా....
జాక్ కొరియాక్ రాసిన ‘ఆన్ ది రోడ్’ నవల చాలా ప్రసిద్ధి. దీని గురించి కథలు కథలు చెప్పుకుంటారు. కారణం దీనిని జాక్- కేవలం మూడు వారాల్లో రాశాడు. ఈ అమెరికన్ నవలా రచయిత ఈ ఒక్క నవలతోనే అమెరికా మొత్తం తెలిసిపోయాడంటే ఆన్ ది రోడ్ సాధించిన పేరు అలాంటిది. ఇంతా చేసి దీనిలో గొప్పతనం ఏమీ లేదు. జాక్ తన స్నేహితులతో కలిసి అమెరికా మొత్తం తిరిగిన తిరుగుళ్ల గురించిన కథ. కాని అందులోనే ఉన్న వేగం, శిల్పం, శైలి, జీవం దానిని అమెరికన్లు అందరూ నెత్తిన పెట్టుకునేలా చేశాయి. ముఖ్యంగా 1950ల నాటి అమెరికన్ లైఫ్‌ని ఈ నవల యధాతథంగా పట్టుకుందని పేరు. 1951లో జాక్ ఈ నవల రాయాలనుకున్నప్పుడు తన మెదడులో తిరుగుతున్న అక్షరాల వేగానికి సాధారణ టైపింగ్ కాగితాలు పనికిరావని అనుకున్నాడు.
టైప్ మిషన్ మీద ఒక కాగితం నిండాక ఇంకో కాగితం ఎక్కించడానికి మధ్య ఆ విరామంలో ఎక్కడ తన ఫ్లో దెబ్బ తింటుందోనని ఏకంగా 120 అడుగుల పొడవున్న టైపింగ్ రోల్‌ని టైప్ మిషన్కి బిగించి ఒకేసారి చాలా వేగంగా నవల టైప్ చేశాడు. అందుకే అది 3 వారాల్లో ముగిసి 1957లో న్యూయార్క్ టైమ్స్‌లో మొదటిసారి అచ్చయ్యి సంచలనం రేపింది. అమెరికన్లు జాక్ టైప్ చేసిన ఆ కాగితాల రోల్స్‌ని దేవుని పటాల కంటే మిన్నగా దాచుకున్నారు. మాసచుసెట్స్‌లోని ఒక మ్యూజియంలో భద్రపరిచి ప్రదర్శనకు పెట్టారు. ఇది అక్కడ కథ. కాని మన దగ్గర? రాత ప్రతులను దాచే గౌరవించే సంస్కృతి తక్కువ. ఎన్నో విలువైన తాళపత్ర గ్రంథాలు శిథిలమై, జీర్ణమై నాశనమైపోవడం తెలుసు. సరే పాతకాలం అనుకుందాం. ఇటీవలి కాలంలోని రాతప్రతులైనా అందుబాటులో ఉన్నాయా? మల్లాది రామకృష్ణశాస్త్రి, శ్రీపాద, విశ్వనాథ, సురవరం, కాళోజి, అడవి బాపిరాజు, మునిమాణిక్యం, జాషువా, చలం, భండారు అచ్చమాంబ, ఇల్లిందుల సరస్వతీదేవి, పి.శ్రీదేవి... వీళ్లందరి చేతి రాతలూ ఆ రాతలు నిండిన కాగితాలు ఎటు పోయాయో. కథానిలయం పుణ్యాన కథలు పోగవుతున్నాయిగాని అందుబాటులో ఉన్న రాతప్రతులను సేకరించే ఈ కృషి చాలదు. భవిష్యత్ తరాల రాత బాగుండాలంటే ఈ రాత గురించి శ్రద్ధ పెట్టక తప్పదు.