Jagaddhatri
-
ప్రముఖ రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్య
సాక్షి, విశాఖపట్నం: ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యురాలు జగద్ధాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గతంలో లెక్చరర్‌గా ఆమె పనిచేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో జగద్ధాత్రి పలు రచనలు చేశారు. కవితలు రాశారు. ప్రముఖ రచయిత, సన్నిహితుడు రామతీర్థ ఆకస్మికంగా మృతి చెందడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనైనట్టు తెలుస్తోంది. మానసిక క్షోభతోనే ఆమె తీవ్ర నిర్ణయం తీసుకున్నారని పోలీసులు చెప్తున్నారు. జగద్ధాత్రి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తోటి కవులతో స్నేహంగా ఉండేవారు. ఆమె మృతి పట్ల సాహిత్యలోకం, సోషల్ మీడియాలో సంతాపాలు వ్యక్తమవుతున్నాయి. ‘జగద్దాత్రి అక్కా .. ఎంత పని చేశావ్ ..నిన్ను చూస్తుంటే ఎంత ధైర్యంగా ఉండేది.. దుఃఖం ఆగట్లేదక్కా’ అని ప్రముఖ కవయిత్రి మెర్సీ మార్గరేట్.. జగద్ధాత్రి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. -
ఉత్తరాంధ్ర కొత్త కలం
పురస్కారం డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు రెండు దశాబ్దాలకు పైగా పత్రికారంగంలో పని చేస్తున్నారు. స్త్రీల జీవన సాఫల్యాలను ‘అలివేణీ ఆణిముత్యమా’ పుస్తకంగా వెలువరించారు. ఆచార్య ఎన్.గోపి ఆధ్వర్యంలో ‘నానీ’లపై సమగ్ర పరిశోధనా గ్రంథాన్ని ప్రచురించారు. ఆయన కథాసంపుటి పేరు ‘దాలప్ప తీర్థం’. దీనికి చాసో పురస్కారం వెలువరించడం గొప్ప గుర్తింపు. ‘దాలప్ప తీర్థం’ పదునాలుగు కథల సమాహారం. ఈ కథలను పరిశీలిస్తే చింతకింది శ్రీనివాసరావు తన స్వస్థలం అయిన చోడవరం చుట్టూ ఉన్న అనేకానేక విషయాలను, మానవతామూర్తులను, గ్రామస్వరూపాన్ని మార్చిన వారిని ఇలా అనేక మందిని తన అక్షరాలలో ప్రాణం పోసినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ‘దాలప్ప తీర్థం’ కథ. నేటికీ ఎన్నో పల్లెల్లో సెప్టిక్ లావెటరీలు లేక ఇసుక పోసిన మరుగుదొడ్ల వాడకం జరుగుతూనే ఉంది. సచ్చరివాళ్లు శుభ్రం చేస్తుంటారు. ఇలాంటి ఒక సచ్చరి వ్యక్తి దాలప్ప. కేవలం ఒక మామూలు వ్యక్తిగా తన పని తాను చేసుకుని పోతే అతని పేరు మీద తీర్థం ఎందుకూ? కామందు చేతిలో చావుదెబ్బ తిన్న దాలప్ప అకాలమరణం చెందుతాడు. కాని చనిపోతూ తన వారి దగ్గర మాట తీసుకుంటాడు- నాలుగు వారాల పాటు పనిలోకి ఎవరూ వెళ్లకూడదని. అదీ దాలప్ప మెలిక. వారం తిరిగేసరికల్లా ఊరు ఊరంతా అట్టుడికి ఎవరు చెప్పినా వినని ఈ కార్మికుల వద్దకు ప్రభుత్వ యంత్రాంగం కదిలి వస్తుంది. ఊల్లో అందరిళ్లకూ సెప్టిక్ దొడ్లు శాంక్షన్ చేస్తుంది. ఫలితంగా సచ్చరివాళ్లు అంతవరకూ చేస్తున్న అమానవీయమైన చాకిరీ నుంచి విముక్తం అయ్యారు. అందుకే నేటికీ ఆ పల్లెలో ప్రతి ఏటా ‘దాలప్ప తీర్థం’ జరుగుతుంది. మంచి కథ. సామాన్యుడు త్రినేత్రుడైతే ఏమవుతుందో చెప్పే కథ. చాసోగారి ‘పరబ్రహ్మం’ కథతో పోల్చగలిగిన కథ ‘పులి కంటే డేంజర్’. పులి కంటే డేంజర్ ఏమిటి? ఆకలే. దాని విశ్వరూపాన్ని ఈ కథలో చూపుతాడు రచయిత. అలాగే ఆకలి గురించి రాసిన మరో కథ ‘చల్దన్నం చోరీ’. ఇవే కాదు చింతకింది అన్ని కథలూ ఆర్ద్రమైన కథావస్తువును స్వీకరిస్తాయి. చాసో కథలు క్లుప్తంగా సూటిగా ఉంటాయని మనకు తెలుసు. అలా తక్కువ నిడివిలో కథ చెప్పే నేర్పు చింతకిందికి కూడా ఉండటం గమనార్హం. ఇక భాష కూడా. చాసో తన మాండలికాన్ని పాత్రలకే పరిమితం చేస్తే చింతకింది కథంతా ఉత్తరాంధ్ర మాండలికంలో రాసి ఆకట్టుకుంటాడు. వీలైతే అతడి చేతనే ఆ కథలు చదివించుకుంటే ఓహ్... అద్భుతం అనిపిస్తాయి. జీవితం తనకు అందించిన అనుభవాల నుంచి ప్రేరణ పొందినవారే చాసోగాని.. చింతకిందిగాని. అందుకే చాసో స్ఫూర్తిని నిలపగలిగేవాడు ఖచ్చితంగా చింతకింది శ్రీనివాసరావు. - జగద్ధాత్రి