‘గుట్టు’గా వ్యాపారం
సాక్షి, హన్మకొండ : తెల్లవారుజామున పాల వ్యాపారుల హడావుడి అన్ని ప్రాంతాల్లో ఉంటుంది. ఇందుకు భిన్నంగా మహబూబాబాద్‌లో బెల్లం వ్యాపారుల హడావుడి కనిపిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన బెల్లం లోడును తెల్లవారు జామున బట్టీలకు తరలిస్తున్నారు. బెల్లం లోడింగ్ అన్ లోడింగ్‌కు మహబూబాబాద్ పట్టణ శివారు గుట్టలు అడ్డాగా మారాయి. గుట్టలే కేంద్రంగా గుట్టుగా పెద్ద ఎత్తున బెల్లం గుడుంబా బట్టీలకు చేరుతోంది.
గుట్టల మాటున వ్యాపారం..
మహబూబాబాద్ పట్టణంలో ఎక్సైజ్‌శాఖ దాడులు పెరిగిపోవడంతో బెల్లం అక్రమ వ్యాపారం పట్టణ శివార్లలో ఉన్న గుట్టలకు చేరుకుంది. బెల్లం లోడుతో వచ్చే లారీలు తెల్లవారుజామున ఆ ప్రాంతానికి చేరుకుంటాయి. అప్పటికే గుట్టల పక్కన ఉన్న బండలు, పొదలు, తోటల్లో వేచి ఉన్న ఆటోలు, టాటా మ్యాజిక్‌లు, ద్విచక్ర వాహనాలు రోడ్డుపైకి వస్తాయి. గుట్టల పక్కన ఉండే మూల మలుపుల వద్ద బెల్లం అన్ లోడింగ్ జరుగుతుంది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఈ తతంగం అంతా ముగుస్తుంది. మహబూబాబాద్ చుట్టూ ఉన్న మల్యాల, పర్వతగిరి, చిన్నపురం గుట్టలు బెల్లం అక్రమ రవాణా కేంద్రాలుగా మారాయి.
హద్దులు ఆసరాగా...
మహబూబాబాద్ మండలం పర్వతగిరి సమీపంలో ఉన్న పెద్దగుట్ట బెల్లం అక్రమ రవాణాకు అడ్డగా మారింది. ఇది మహబూబాబాద్, మరిపెడ, కురవి పోలీస్ స్టేషన్లకు సరిహద్దుగా ఉంటుంది. దీంతో ఇక్కడ పోలీసుల గస్తీ తక్కువగా ఉంటోంది. దీన్ని ఆసరాగా తీసుకున్న వ్యాపారులు ఈ గుట్ట కేంద్రంగా పెద్ద ఎత్తున బెల్లం వ్యాపారం నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి బెల్లం లోడుతో వచ్చే లారీలను గుట్ట సమీపంలో నిలిపి ఉంచుతున్నారు. నల్లబెల్లాన్ని తీసుకొచ్చి ఆ గుట్ట వద్ద గుట్టుగా అన్ లోడ్ చేస్తారు. బెల్లం స్టాక్ రాగానే అక్రమ వ్యాపారులకు సెల్‌ఫోన్ ల ద్వారా సమాచారం అందుతుంది. తండాలు, ఊర్లలో నల్లబెల్లం విక్రయించే దుకాణాల వ్యాపారులు టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాలు, ఆటోలలో గుట్టుగా గుట్ట వద్దకు చేరుకుంటారు. గంటల వ్యవదిలోనే లారీలనుంచి దింపిన బెల్లం బస్తాలను చకాచకా వాహనాల్లో ఎక్కించుకుని ఎవరి మార్గంలో వారు వెళ్లిపోతుంటారు. మహబూబాబాద్ మండలం మల్యాల సమీపంలో ఉన్న తండాలు కేంద్రంగా బెల్లం అక్రమ రవాణా జరుగుతోంది. ఈ ప్రాంతానికి చెందిన వ్యాపారికి ఎక్సైజ్‌శాఖ సిబ్బందితో మంచి సంబంధాలు ఉన్నట్లు ప్రచారం ఉంది. మహబూబాబాద్ పట్టణానికి చెందిన మరో వ్యాపారిపై కేసులు నమోదైనా బెల్లం వ్యాపారం తగ్గుముఖం పట్టలేదు. ఎక్సైజ్‌శాఖలో కొందరు సిబ్బందితో బెల్లం వ్యాపారులకు ఉన్న సఖ్యత కారణంగా తూతూ మంత్రంగానే కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాకే అపఖ్యాతి..
తెలంగాణలో గుడుంబా ఆనవాళ్లు ఉన్న ఏకైక జిల్లాగా వరంగల్ అపఖ్యాతిని మూటగట్టుకుంది. మహబూబాబాద్ సబ్‌డివిజన్ లో గుడుంబా అమ్మకాలు అరికట్టడంలో ఎక్సైజ్‌శాఖ విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. గుడుంబా తయారీకి వినియోగించే బెల్లం, పటిక అమ్మకాలు అడ్డుకోవడంలో ఎక్సైజ్ అధికారులు విఫలమవుతున్నారు. బెల్లం, పటిక అక్రమ వ్యాపారం సాగిస్తున్న వ్యక్తులతో ఎక్సైజ్‌శాఖలో కొందరు సిబ్బంది మధ్య ఉన్న అపవిత్ర పొత్తులు ఇందుకు కారణమనే ఆరోపణలు ఉన్నాయి. బెల్లం అక్రమ వ్యాపారం గుట్టుమట్టులు తెలిసినా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యాపారంలో కాకలుతీరిన వారిని వదిలిపెట్టి సాధారణ వ్యాపారులపై ఎక్సైజ్‌శాఖ, పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.