అందరి సహకారంతోనే ‘లోక్ అదాలత్’ విజయవంతం
నిజామాబాద్ లీగల్, న్యూస్‌లైన్: ఈ నెల 23న నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించి నిజామాబాద్ జిల్లాను రాష్ట్రస్థాయిలోనే ప్రథమస్థానంలో నిలిచేందుకు న్యాయశాఖ ఉద్యోగులు, పోలీసులు కీలకపాత్ర పోషించారని జిల్లా జడ్జి, జిల్లా లీగల్‌సెల్ అథారిటీ అధ్యక్షుడు డాక్టర్ షమీం అక్తర్ అన్నారు. బుధవారం జిల్లా లీగల్‌సెల్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన న్యాయశాఖ ఉద్యోగులు, పోలీసుల స్నేహ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పోలీసులు, న్యాయశాఖ సిబ్బంది సేవలను ప్రశంసించారు. నిజామాబాద్ ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహించే తత్వం కలవారని ఈ మెగా అదాలత్‌తో నిరూపించారన్నారు. మొత్తం 13,287 కేసులను ఒక్కరోజే పరిష్కరించినట్లు జిల్లా లీగల్‌సెల్ అథారిటీ కార్యదర్శి బాందే అలీ తెలిపారు.
న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, పోలీసులు తనదైన శైలిలో సహకారాన్ని అందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జగ్జీవన్‌కుమార్, రవీందర్‌సింగ్, రమేష్‌బాబు, రాధాకృష్ణ చౌహాన్, కుమార్‌వివేక్, పి.లక్ష్మీకుమారి, అమరావతి, జిల్లా కోర్టు పరిపాలన అధికారి మేడి స్వామి, లీగల్‌సెల్ అథారిటీ సూపరింటెండెంట్ శ్రీధర్, న్యాయశాఖ ఉద్యోగ సంఘాల నాయకులు రాజశేఖర్‌రెడ్డి, ఎం.రాంగోపాల్, న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.