నిరంకుశ పాలనను అడ్డుకుందాం
– అభివృద్ధి మరిచి ఫిరాయింపులు
– కేసీఆర్ నిరంకుశ పాలనను అడ్డుకుందాం
– జలసాధన సమితి బహిరంగ సభలో విపక్ష నేతలు ధ్వజం
– ముగిసిన పాదయాత్ర
పాలమూరు : కేసీఆర్ నిరంకుశ పాలనకు రోజులు దగ్గరపడ్డాయి.. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు.. తెలంగాణను అభివృద్ధి చేస్తామంటూ పార్టీ ఫిరాయింపులెందుకే ప్రాధాన్యమిస్తున్నారు.. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం దోచుకోవడానికి, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ప్రాజెక్టులు తెచ్చి రైతులకు ఉపాధి లేకుండా చేస్తున్నారు.. అంటూ వివిధ పార్టీల నేతలు ముఖ్యమంత్రిపై ఫైర్ అయ్యారు. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం సాధనకై జలసాధన సమితి ఆధ్వర్యంలో ఈనెల 22న చేపట్టిన మహా పాదయాత్ర సోమవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ యాత్రకు అధికార పార్టీ మినహా అన్ని పార్టీల నాయకులు మద్ధతు తెలిపి కదం తొక్కారు. జిల్లా కళాకారుల డప్పుదరువుల మధ్య పాదయాత్ర ఉత్సాహంగా ముందుకు సాగింది.
అడ్డుకున్న పోలీసులు
పాదయాత్రగా ప్రధాన రహదారి వెంట వస్తుండగా కలెక్టరేట్ ఎదుట పోలీసులు అడ్డగించారు. ప్రధాన రోడ్డుపై వెళ్లేందుకు అనుమతి లేదని, తెలంగాణ చౌరస్తా మీదుగా వెళ్లాలని టూటౌన్ సీఐ రాజు నాయకులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పాదయాత్రగా వెళ్తే తప్పేందని, తాము ఈ దారినే వెళ్తామని పోలీసులను తోసుకుంటూ ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ముగింపు సభలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ) అధ్యక్షులు, జేఏసీ, ప్రజాసంఘాల నేతలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పాల్గొని ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సభ ప్రారంభంలోనే పెద్ద ఎత్తున వర్షం వచ్చినప్పటì కీ తడుస్తూనే ప్రసంగించారు. జలసాధన సమితి అధ్యక్షుడు అనంతరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి, డీసీసీ అ«ధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్, జేఏసీ ఛైర్మన్ రాజేందర్‌రెడ్డి, పాలమూరు అధ్యయన వేధిక కన్వీనర్ రాఘవాచారి, సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, సీపీఐఎంల్ న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, వెంకటేష్, వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్, ఎస్సీసెల్ అధ్యక్షుడు మిట్టమీది నాగరాజు, జలసాధన సమితి నాయకులు అంబదాస్, బోయిన్పల్లి రాము, నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రాజెక్టు సాధించేవరకు పోరాడండి : కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి
మక్తల్, నారాయణపేట– కొడంగల్ ప్రాజెక్టు సాధించేవరకు పోరాటం సాగించాలి. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ కూడా ఎప్పుడు అధికారంలో ఉండదు. తెలంగాణ ఉద్యమంలో రైతుల పాత్ర గొప్పది. కానీ ప్రభుత్వం రైతులనే విస్మరిస్తోంది. రుణ మాఫీ చేస్తానని ఇప్పటికి నాన్చుతోంది. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నా నిధులు కేటాయించకుండా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు వేలకోట్లు కేటాయించడం ఎంతవరకు సమంజసం.
ప్రజలే బుద్ధిచెప్పాలి
ప్రాజెక్టు కోసం అన్ని పార్టీలు ఏకమై ఉద్యమిస్తుంటే ముఖ్యమంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్పందించకపోవడం దారుణం. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లోని ఐదున్నరకోట్ల కుటుంబాలకు తాగునీరు, లక్ష ఎకరాలకు సాగునీరందించే మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని విస్మరిస్తే భవిష్యత్‌లో ప్రజలే కేసీఆర్‌కు బుద్ధి చెబుతారు.
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
ప్రజలు కదలిరావాలి
గవర్నర్ పాలనలో పార్టీలకతీతంగా తీసుకొచ్చిన జీఓ నెం.69ను ప్రభుత్వం విస్మరిస్తోంది. కేసీఆర్ దయ ఉంటేనే పనులు అవుతున్నాయి. రాష్ట్రంలోని మంత్రులు కేసీఆర్ బానిసలుగా మారారు. రాజకీయాల కోసం పాదయాత్రలో పాల్గొనడం లేదు. దగ్గరనుంచి నీళ్లొచ్చే అవకాశమున్నా చుట్టూ తిప్పాల్సిన అవసరం ఏముంది. హరీష్‌రావు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నరు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమి కోల్పోయిన రైతులకు పరిహారం అందేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ప్రజలు కదలిరావాలి.
– సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
మెడలు వంచి ప్రాజెక్టు సాధిస్తాం
ప్రభుత్వం మెడలు వంచైనా నారాయణపేట– కొడంగల్ ప్రాజెక్టును సాధిద్దాం. లక్ష ఎకరాలకు సాగునీరందించే ఎత్తిపోతల పథకాన్ని ఆపి ప్రజల పొట్టకొట్టేందుకు టీఆర్ఎస్ కుట్రపన్నింది. ప్రాజెక్టుల కోసం పాటుపడకుండా పార్టీ ఫిరాయింపులకే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎవరికి పవర్ శాశ్వతం కాదు. కేసీఆర్ పాలన నిజాంను తలపిస్తోంది.
– టీ–టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ
మెడమీద తలకాయ లేదు :
కేసీఆర్‌కు మెడ మీద తలకాయ లేదు. ఉంటే కూతవేటు దూరంలో ఉన్న జూరాల నుంచి మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నీరందించేవారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం నుంచి నీరు తీసుకురావాలంటే నార్లాపూర్ వద్ద 100 మీటర్లు, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్ వద్ద మొత్తం నాలుగుసార్లు లిఫ్టు చేయాల్సి ఉంటుంది. చివరలో ఉన్న ఈ మూడు నియోజకవర్గాలకు సాగునీరందించడం సాధ్యంకాదు. డబ్బుల కోసమే పెద్దపెద్ద రిజర్వాయర్లు చేపడుతున్నారు. ఏ ప్రజలు ఎంపీగా గెలిపించి రాజకీయ జీవితమిచ్చారో ఆ ప్రజలను విస్మరిస్తే పతనం తప్పదు.
– బీజేపీ జాతీయ నాయకుడు నాగం జనార్ధన్‌రెడ్డి
దోచుకోవడానికే ప్రాజెక్టులు
ప్రాజెక్టుల పేరుతో దోచుకోవడానికే ప్రాజెక్టులు కడుతున్నట్టుంది. వెనకబడ్డ మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజక వర్గాలకు భీమా ప్రాజెక్టు ద్వారా నారాయణపేట జయమ్మ చెరువుకు నీళ్లు ఇవ్వాలని దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి విన్నవించారు. అందులో భాగంగానే జీఓ నెం.69 ఏర్పడింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును రెండు భాగాలుగా చేసి నారాయణపేట, మక్తల్, కొడంగల్ ప్రజలకు ప్రత్యేక ఎత్తిపోతల పథకం నిర్మించాలి. కేసీఆర్ వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రాజెక్టు కడితే ఎక్కువ పైసలు వస్తాయని అవసరం లేకున్నా వ్యయాన్ని పెంచుతున్నారు. సొంత ప్రయోజనాలకోసం పార్టీ మారిన వారిని ప్రజలు క్షమించరు.
– డీకే అరుణ, గద్వాల ఎమ్మెల్యే
అన్నీ మాయమాటలే
రాష్ట్ర ప్రభుత్వం రైతులను, ప్రజలను మభ్యపెడుతుంది. ప్రాజెక్టుకోసం అన్ని పార్టీలు ఏకమైనా కనువిప్పు కలగడంలేదు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి స్వలాభం చూసుకుంటున్నారు. భూ నిర్వాసితులకు చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించకుండా ప్రభుత్వ జీఓ ప్రకారం చెల్లించడం దుర్మార్గం. జీఓ 69కోసం పోరాడుతున్న ప్రజలకు అండగా ఉంటాం.
– చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే