Jalalabad city
-
ఆఫ్ఘనిస్తాన్‌లో వరుస బాంబు దాడులు..
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్ వరుసగా రెండోరోజు బాంబుల మోతతో దద్దరిల్లింది. తాజాగా బుధవారం జలాలాబాద్ నగరంలో కారు బాంబు దాడి జరిగింది. మిలిటరీ కాన్వేను లక్ష్యంగా చేసుకొని జరిపిన ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందగా.. పది మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరనే దానిపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. కాగా ఇదే విషయమై అఫ్ఘన్ ప్రతినిధి అతాహుల్లా కోగియాని స్పందించారు. కారు బాంబు దాడి ఉదయం 10. 10 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. సాధారణంగానే బిజీగా ఉండే రోడ్డుపై ఆ సమయంలో మిలిటరీ కాన్వేకు చెందిన వాహనం వెళ్లింది. దీనిని లక్ష్యంగా చేసుకొని దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందనేది త్వరలోనే తేలుస్తాం. అని పేర్కొన్నారు. కాగా గాయపడిన వారిని జలాలాబాద్‌లోని రీజినల్ ఆసుపత్రికి తరలించారు. కాగా మంగళవారం రాత్రి ఇదే తరహాలో ప్రజలు ప్రయాణించే బస్సుల్లో బాంబులు పెట్టిన దుండగులు 8 మంది చావుకు కారణం కాగా.. ప్రమాదంలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
భారత ఎంబసీపై దాడిని ఖండించిన అమెరికా
అఫ్ఘానిస్థాన్లోని భారత రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. అమాయక పౌరులు, మహిళలు, చిన్నారులను పొట్టనపెట్టుకోవడాన్ని గర్హనీయమని అమెరికా స్టేట్ డిపార్టమెంట్ అధికార ప్రతినిధి జెన్ సాకి పేర్కొన్నారు. అఫ్ఘానిస్థాన్‌లో శాంతి స్థాపనకు, సుస్థిరత, అభివృద్ధికి భారత్, అమెరికా దేశాలు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలను సానుభూతి తెలిపారు. అఫ్ఘానిస్థాన్లోని జలాలాబాద్‌లో భారత రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు శనివారం ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎనిమిది మంది పిల్లలు సహా 12 మంది మరణించగా.. ముగ్గురు అఫ్ఘాన్ పోలీసులు సహా 24 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడిలో రాయబార కార్యాలయ సిబ్బంది ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. ఇటీవలే కాబూల్‌కు ఒక ప్రత్యేక భద్రతా బృందాన్ని భారత్ పంపింది. ఈ నేపథ్యంలోనే బాంబు దాడి జరగడం గమనార్హం.