ఇక ఏడాది పొడవునా రవాణా
జమ్మూ కశ్మీర్ సొరంగ మార్గంతో తప్పనున్న కొండచరియల ముప్పు
జమ్మూ నుంచి శ్రీనగర్‌కు 295 కిలో మీటర్ల దూరం. కశ్మీర్లో ప్రయాణం హిమాలయ పర్వతశ్రేణుల గుండా సాగుతుంది. పట్నిటాప్–కుడ్–బటోటే పర్వత శ్రేణుల గుండా ప్రయాణం అత్యంత కఠినమైనది. మంచు కురవడం, కొండచరియలు విరిగిపడటం కారణంగా ఇక్కడ రోజుల తరబడి ట్రక్కులు నిలిచిపోతుంటాయి. దీనిని నివారించి, ఏడాది పొడవునా అంతరాయం లేకుండా రవాణా సాగాలనే ఉద్దేశంతో నిర్మించినదే చెనాని–నాష్రి సొరంగమార్గం. ఏప్రిల్ 2న ప్రధాని నరేంద్ర మోదీ ఈ మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సొరంగమార్గం ప్రత్యేకతలు...
► 9.2 కిలోమీటర్ల చెనాని–నాష్రి సొరంగ మార్గం దేశంలోనే అత్యంత పొడవైనది. ప్రపంచంలో అత్యంత పొడవైన సొరంగమార్గం నార్వేలో (24.51 కిలోమీటర్లు) ఉంది.
► దిగువ హిమాలయ పర్వతశ్రేణుల్లో... సముద్ర మట్టా నికి 1,200 మీటర్ల ఎత్తులో సొరంగమార్గం తొలిచారు.
► ఈ సొరంగమార్గంతో జమ్మూ– శ్రీనగర్‌ల మధ్య దూరం 30 కి.మీ, ప్రయాణ సమయం రెండు గంటలు తగ్గుతుంది.
► రోజుకు రూ. 27 లక్షల రూపాయల విలువైన ఇంధనం ఆదా అవుతుందని అంచనా.
► 2011 మే 23న పనులు ప్రారంభ మయ్యాయి.
► ప్రారంభంలో అంచనా వ్యయం రూ.2,519 కోట్లు కాగా దీని నిర్మాణానికి మొత్తం రూ. 3,720 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి.
► 13 మీటర్ల వ్యాసార్ధం కలిగిన ప్రధాన సొరంగ మార్గానికి సమాంతరంగా ఆరు మీటర్ల వ్యాసార్ధంతో అత్యవసర మార్గాన్ని కూడా నిర్మించారు. ఏదైనా ప్రమాదాలు జరిగినపుడు ప్రధాన మార్గం నుంచి అత్యవసర మార్గానికి మళ్లడానికి ప్రతి 300 మీటర్ల దూరానికి ఒకటి చొప్పున మొత్తం 29 పాసేజ్‌లు ఉన్నాయి.
► ఈ సొరంగంలో 124 సీసీ కెమెరాలను అమర్చారు. నిరంతరం లైట్లు వెలుగుతూ ఉంటాయి. తాజా గాలిని లోపలికి పంపే ఏర్పాట్లున్నాయి.
► ఎయిర్టెల్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ సంస్థలు సొరంగం లోపల తమ సిగ్నల్స్ అందే ఏర్పాట్లు చేశాయి. అలాగే ఎఫ్ఎం రేడియో సిగ్నల్స్‌ను ప్రసారం చేసే రిపీటర్స్ కూడా ఉన్నాయి.
► గరిష్ట వేగపరిమితి 50 కిలోమీటర్లు. హెడ్‌లైట్స్ లోబీమ్‌లో ఉంచి ప్రయాణించాలి.
► శ్రీనగర్‌లో ప్రారంభమై కన్యాకుమారి దాకా సాగే జాతీయ రహదారి 44పై ఈ టన్నెల్ ఉంది. మొత్తం 3,745 కిలోమీటర్ల పొడవుండే ఈ రహదారి తెలం గాణ, ఆంధ్రప్రదేశ్‌లు సహా 11 రాష్ట్రాల గుండా వెళ్తుం ది. భారత్‌లో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఇదే. – సాక్షి నాలెడ్జ్ సెంటర్