jana garjana
-
అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం.. పోలీసులపై ఎంపీ కోమటిరెడ్డి ఫైర్
సాక్షి, నల్లగొండ జిల్లా: తెలంగాణ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ఖమ్మం సభ విజయవంతం అవుతుందని వాహనాలను అడ్డుకుంటున్నారని, బారీకేడ్లు పెట్టిన తొక్కుకుంటూ వెళ్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు. అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారని, పోడు భూముల సమస్య చెప్పుకోవడానికి వస్తున్న వారిని ప్రభుత్వాధికారులు ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. ‘‘రాహుల్ గాంధీ సభకు అడుగడుగునా ఆంక్షలు విధించడమేంటి?. 4 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఖమ్మంలో కాంగ్రెస్ సభకు నిన్న రాత్రి నుంచి ఆంక్షలు పెట్టారు.. అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఆర్టీసీ వాహనాలను డబ్బులు కడతామన్నా ఇవ్వలేదు. ప్రైవేట్ వాహనాల్లో జనం సభకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ సభకు భయపడి ప్రభుత్వం బస్సులను ఇవ్వలేదు’’ అని మండిపడ్డారు. ‘‘జనాన్ని కాంగ్రెస్ సభకు రాకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. పోలీసులు న్యాయంగా డ్యూటీ చేయాలి. సభా ప్రాంగణానికి 15, 20 కిలోమీటర్ల దూరంలో ఆపేయడం కరెక్ట్ కాదు. 35 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు’’ అంటూ ఎంపీ కోమటిరెడ్డి నిప్పులు చెరిగారు. చదవండి: జన గర్జన సభ.. బీఆర్ఎస్పై రేవంత్‌రెడ్డి ట్వీట్ -
జన గర్జన సభ.. బీఆర్ఎస్పై రేవంత్‌రెడ్డి ట్వీట్
సాక్షి, ఖమ్మం: ఖమ్మం రాహుల్ గాంధీ జనగర్జన బహిరంగ సభతో తెలంగాణ పాలిటిక్స్ వేడెక్కాయి.. జనగర్జన సభ బహిరంగ సభ వేదిక ద్వారా రాహుల్ ఏం చెప్పబోతున్నారని పొలిటికల్‌గా సర్వత్ర ఆసక్తి మొదలైంది.. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఆ స్థాయిలోనే భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభలో రాహుల్ సమక్షంలో పొంగులేటి ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండగా.. మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా సభలో భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ ఘనంగా సన్మానించనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ జన గర్జన సభ బీఆర్ఎస్ వెన్నులో వణుకు పుట్టిస్తోందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. సభకు వచ్చే అశేష జన వాహినికి ట్రాన్స్ పోర్టు అడ్డంకులు సృష్టించి, సంక్షేమం కట్ చేస్తామని బెదిరించి ప్రభంజనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తురన్నారని మండిపడ్డారు. అధికారులు పద్దతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రేవంత్ హెచ్చరించారు. అర చెయ్యిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరన్న సత్యాన్ని ప్రభుత్వం గ్రహిస్తే మంచిదంటూ ఆయన వ్యాఖ్యానించారు. 🔥నేడు ఖమ్మంలో కాంగ్రెస్ తలపెట్టిన ‘తెలంగాణ జన గర్జన’ బీఆర్ఎస్ వెన్నులో వణుకుపుట్టిస్తోంది. 🔥సభకు వచ్చే అశేష జనవాహినికి ట్రాన్స్ పోర్టు అడ్డంకులు సృష్టించి, సంక్షేమం కట్ చేస్తామని బెదిరించి ప్రభంజనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. 🔥అర చెయ్యిని అడ్డు పెట్టి సూర్య… pic.twitter.com/oGp67NbSd8 — Revanth Reddy (@revanth_anumula) July 2, 2023 చదవండి: కాంగ్రెస్‌లో నేను చేరగలను.. కానీ.. గద్దర్ కామెంట్స్ -
నేడు జనగామ జనగర్జన
అనుమతి ఇచ్చిన హైకోర్టు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభ కోదండరాం, చుక్కా రామయ్య, సీపీఎం, సీపీఐ నాయకుల రాక ఏర్పాట్లు పూర్తిచేసిన జేఏసీ జనగామ : జనగామ జిల్లా సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం జనగర్జన సభ జరగనుంది. సభ నిర్వహించుకోవడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇంతకుముందు జనగర్జన సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో జేఏసీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు కొన్ని షరతులు విధిస్తూ సభకు అనుమతి ఇచ్చింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించుకోవాలని సూచించింది. సభ నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో సోమవారం జేఏసీ నాయకులు జనగామలో బాణాసంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు. జనగామ, బచ్చన్నపేట, నర్మెట, మద్దూరు, చేర్యాల, లింగాలఘనపురం, రఘునాథపల్లి, దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్లతో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సభకు జనాన్ని తరలించేందుకు జేఏసీ సన్నాహాలు పూర్తి చేసింది. సభను విజయవంతం చేయడం ద్వారా జనగామ జిల్లా ఆకాంక్ష ఎంత బలంగా ఉందో ప్రభుత్వానికి తెలియ జేసేందుకు నాయకులు శ్రమిస్తున్నారు. గర్జనకు తరలిరండి : జేఏసీ చైర్మన్ మంగళవారం జనగామ పట్టణంలోని ప్రిస్టన్ మైదానంలో ఉదయం 11 గంటలకు నిర్వహించే జనగామ జిల్లా జనగర్జన సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి పిలుపునిచ్చారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ జనగర్జన సభకు తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, విద్యావేత్త చుక్కా రామయ్య, సీపీఎం శాసన సభాపక్ష నేత సున్నం రాజయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తదితరులు హాజరు కానున్నారని చెప్పారు. ఉదయం 9 గంటలకు నెహ్రూ పార్కు నుంచి కళాకారుల విన్యాసాలు, ఒగ్గు కళాకారుల డప్పుచప్పుళ్లతో ర్యాలీగా ప్రిస్టన్ మైదానం అమరవీరుల ప్రాంగణంలోకి చేరుకుంటామన్నారు. ఏర్పాట్లు పూర్తి ప్రిస్టన్ మైదానం(అమరవీరుల)లో సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, నాయకులు మేడ శ్రీనివాస్, ఆకుల సతీష్, ఆకుల వేణుగోపాల్, డాక్టర్లు లక్ష్మినారాయణ నాయక్, రాజమౌళి, పజ్జూరి గోపయ్య, పోకల లింగయ్య, బొట్ల చిన శ్రీను, దస్తగిరి, మంగళ్లపల్లి రాజు, తిప్పారపు విజయ్, మాజీద్‌లు పనులను పర్యవేక్షించారు. కోర్టు తీర్పు సభకు అనుకూలంగా రాగానే పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టారు. సభకు తరలివచ్చే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా మైదానంలోని వేదిక వెనకాల వాహనాలను పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చిన ప్రజలకు తాగునీటిని అందించేందుకు 50వేల వాటర్ ప్యాకెట్లను సిద్దం చేశారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులకు ప్రజలను తరలించే బాధ్యతను అప్పగించారు. సభను భారీ స్థాయిలో నిర్వహించేలా జేఏసీ కసరత్తు చేస్తోంది.