నేడు జనగామ జనగర్జన | Today janagama jana garjana | Sakshi
Sakshi News home page

నేడు జనగామ జనగర్జన

Published Tue, Sep 20 2016 12:33 AM | Last Updated on Fri, Aug 31 2018 8:53 PM

ప్రిస్టన్‌ కళాశాలలో పనులను పర్యవేక్షిస్తున్న జేఏసీ నాయకులు - Sakshi

ప్రిస్టన్‌ కళాశాలలో పనులను పర్యవేక్షిస్తున్న జేఏసీ నాయకులు

  • అనుమతి ఇచ్చిన హైకోర్టు  
  • ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభ
  • కోదండరాం, చుక్కా రామయ్య, సీపీఎం, సీపీఐ నాయకుల రాక 
  • ఏర్పాట్లు పూర్తిచేసిన జేఏసీ 
  •  
    జనగామ : జనగామ జిల్లా సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం  జనగర్జన సభ జరగనుంది. సభ నిర్వహించుకోవడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇంతకుముందు జనగర్జన సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో జేఏసీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు కొన్ని షరతులు విధిస్తూ సభకు అనుమతి ఇచ్చింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించుకోవాలని సూచించింది. సభ నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో సోమవారం జేఏసీ నాయకులు జనగామలో బాణాసంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు. జనగామ,  బచ్చన్నపేట, నర్మెట, మద్దూరు, చేర్యాల, లింగాలఘనపురం, రఘునాథపల్లి, దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్లతో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సభకు జనాన్ని తరలించేందుకు జేఏసీ సన్నాహాలు పూర్తి చేసింది. సభను విజయవంతం చేయడం ద్వారా జనగామ జిల్లా ఆకాంక్ష ఎంత బలంగా ఉందో ప్రభుత్వానికి తెలియ జేసేందుకు నాయకులు శ్రమిస్తున్నారు. 
     
    గర్జనకు తరలిరండి : జేఏసీ చైర్మన్‌
    మంగళవారం జనగామ పట్టణంలోని ప్రిస్టన్‌ మైదానంలో ఉదయం 11 గంటలకు నిర్వహించే జనగామ జిల్లా జనగర్జన సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని జేఏసీ చైర్మన్‌ ఆరుట్ల దశమంతరెడ్డి పిలుపునిచ్చారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ జనగర్జన సభకు తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ కోదండరాం, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌, విద్యావేత్త చుక్కా రామయ్య, సీపీఎం శాసన సభాపక్ష నేత సున్నం రాజయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తదితరులు హాజరు కానున్నారని చెప్పారు. ఉదయం 9 గంటలకు నెహ్రూ పార్కు నుంచి కళాకారుల విన్యాసాలు, ఒగ్గు కళాకారుల డప్పుచప్పుళ్లతో ర్యాలీగా ప్రిస్టన్‌ మైదానం అమరవీరుల ప్రాంగణంలోకి చేరుకుంటామన్నారు. 
     
    ఏర్పాట్లు పూర్తి
    ప్రిస్టన్‌ మైదానం(అమరవీరుల)లో సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక జేఏసీ చైర్మన్‌ దశమంతరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్‌.రాజారెడ్డి, నాయకులు మేడ శ్రీనివాస్‌, ఆకుల సతీష్‌, ఆకుల వేణుగోపాల్‌, డాక్టర్లు లక్ష్మినారాయణ నాయక్‌, రాజమౌళి, పజ్జూరి గోపయ్య, పోకల లింగయ్య, బొట్ల చిన శ్రీను, దస్తగిరి, మంగళ్లపల్లి రాజు, తిప్పారపు విజయ్‌, మాజీద్‌లు పనులను పర్యవేక్షించారు. కోర్టు తీర్పు సభకు అనుకూలంగా రాగానే పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టారు. సభకు తరలివచ్చే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా మైదానంలోని వేదిక వెనకాల వాహనాలను పార్కింగ్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చిన ప్రజలకు తాగునీటిని అందించేందుకు 50వేల వాటర్ ప్యాకెట్లను సిద్దం చేశారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులకు ప్రజలను తరలించే బాధ్యతను అప్పగించారు. సభను భారీ స్థాయిలో నిర్వహించేలా జేఏసీ కసరత్తు చేస్తోంది. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement