‘2జీ’ని పట్టించుకోం!
దేశాన్ని కుదిపేసిన రూ. 1.76 లక్షల కోట్ల 2జీ స్పెక్ట్రం కుంభకోణాన్ని తమిళనాడులోని నీలగిరి నియోజకవర్గ ప్రజలు పట్టించుకోవడం లేదు. ‘అది మాకు అసలు విషయమే కాదు. తాగునీరు లేకపోవడం, నిరుద్యోగం లాంటి మా స్థానిక సమస్యలే మాకు ముఖ్యం’ అని వారు కుండబద్ధలు కొడ్తున్నారు.
ఆ నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి, 2జీ స్కామ్లో 15 నెలల పాటు తీహార్ జైలు పాలయిన ఏ రాజా డీఎంకే పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. స్థానిక ప్రజలు పట్టించుకోకపోయినా అక్కడి ఎన్నికల్లో 2జీ కుంభకోణమే ప్రధాన ప్రచారాంశమైంది. ఒకవైపు, ఏఐఏడీఎంకే 2జీ స్కామ్ అవినీతిని, అందులో రాజా పాత్రను ప్రచారం చేస్తుండగా.. మరోవైపు 2జీ స్కామ్లో తనను బలిపశువును చేశారంటూ సానుభూతి ఓట్లకు రాజా గాలమేస్తున్నారు. టెలికాం విప్లవం ఫలితాలను ప్రజలందరికీ అందించేందుకు తాను కృషి చేశానని, అది నచ్చకే కొందరు తనను స్కామ్లో ఇరికించారని చెబుతున్నారు.
‘కోర్టు తీర్పు నాకు అనుకూలంగా వస్తుందన్న నమ్మకం ఉంది. అయితే, అంతకన్నా ముందు మీ తీర్పు నాక్కావాలి’ అంటూ ఓటర్లను వేడుకుంటున్నారు. నియోజకవర్గంలో భారీగా ఉన్న దళిత ఓట్లపై రాజా ఆశలు పెట్టుకున్నారు. అయితే, నీలగిరి లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడింట ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలే ఉన్నారు.