విచ్ఛిన్నమైన రోజు ఆవిర్భావ దినమా!
ఖండించిన జన చైతన్య వేదిక
సాక్షి, హైదరాబాద్: తెలుగు జాతి విచ్ఛిన్నమైన రోజును ఏపీ రాష్ట్ర అవతరణ దినంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని జన చైతన్య వేదిక ఖండించింది. ఆదివారం ఎన్ఎస్ఎస్లో జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు, పంచాయితీరాజ్ ఉద్యోగుల నేతలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తుంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా 1956 నవంబర్ 1న తొలి రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ నవంబర్ 1నే అవతరణ దినంగా జరుపుకోవాలని డిమాండ్ చేశారు. జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి, విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి చేగొండి రామజోగయ్య మాట్లాడుతూ జూన్ 2ను అవతరణ దినంగా ప్రకటించటం చారి త్రక తప్పిదమన్నారు.