రామచంద్రపురం ఎమ్మెల్యేకు సమైక్య సెగ
జంగారెడ్డిగూడెం రూరల్, న్యూస్‌లైన్ : తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు సమైక్య సెగ తగిలింది. మంగళవారం ఆయన రామచంద్రాపురం నుంచి జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలోని మద్ది ఆంజనేయ స్వా మిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులతో బయలుదేరారు. ఆయన ప్రయూణిస్తున్న కారు దేవులపల్లి చేరుకోగా, బంద్ చేస్తున్న సమైక్యవాదులు, ఎన్జీవోలు ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే కారు దిగి సమైక్యవాదుల వద్దకు వచ్చారు.
ఎమ్మెల్యే పదవికి రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ర్ట విభజన విషయం తెలియగానే తాను స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపించానని, కావాలంటే దానికి సంబంధించిన కాపీలు కారులోనే ఉన్నాయని ఎమ్మెల్యే ఆందోళనకారులకు తెలియజేశారు. వాటిని చూపిస్తానని, తాను కూడా సమైక్యవాదినేనని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అందోళనలో కొద్దిసేపు పాల్గొన్నారు. సమైక్యవాదులు రెండు మోటారు సైకిళ్లు సమకూర్చడంతో వాటిపై అక్కడ నుంచి కొద్దిదూరం వెళ్లి, తరువాత మరో వాహనం ఎక్కి మద్ది ఆంజనే యస్వామి ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు.