జంషెట్జీ టాటా స్మారక నాణేలు విడుదల
న్యూఢిల్లీ: జంషెట్జీ టాటా గౌరవార్థం స్మారక నాణేలను(రూ.100, రూ.5) ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విడుదల చేశారు. ఆధునిక భారత పరిశ్రమ పితామహుడిగాప్రాచుర్యం పొందిన జంషెట్జీ టాటా 175 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నాణేలను రూపొందించారు. భారత ప్రభుత్వం ఒక పారిశ్రామికవేత్త జ్ఞాపకార్థం స్మారక నాణేలను విడుదల చేయడం ఇదే మొదటిసారి. జంషెట్జీ ఎలాంటి అధికారం లేకుండానే చరిత్ర సృష్టించారని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ప్రశంసించారు.
పర్యావరణ అనుకూల ఇంధనాల కోసం ఆయన ప్రయత్నాలు చేశారని, టాటా గ్రూపు ఉద్యోగుల సంక్షేమం కోసం ఇతోధికంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టాటా సన్స్ చైర్మన్ సైరస్ పి. మిస్త్రీ తదితరులు పాల్గొన్నారు. గుజరాత్‌లోని నవసారిలో 1839, మార్చి 3న జన్మించిన జంషెట్జీ 1868లో టాటా గ్రూప్‌ను స్థాపించారు.