మేమిద్దరం... మాకు పది!
‘బంగారు దంపతులు’ టైటిల్ ఈ జంటకు సరిగ్గా సరిపోతుందేమో! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది ఒలింపిక్ స్వర్ణాలు వారి నట్టింట్లోకి వచ్చాయి మరి...‘సైకిల్’పై మొదలైన వారి ప్రేమ యాత్ర నాలుగేళ్లుగా జోరుగా సాగుతోంది. రియోలో మంగళవారం గంటన్నర వ్యవధిలో వీరిద్దరు స్వర్ణం గెలిచాక ఒలింపిక్ వెలోడ్రోమ్ మొత్తం ఈ జంటను మరిన్ని స్వర్ణాలతో వర్ధిల్లమని దీవించేసింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న బ్రిటన్‌కు చెందిన లారా ట్రాట్, జేసన్ కెన్నీ ప్రణయ గాథ ఇది.
సాక్షి క్రీడా విభాగం: ట్రాట్, కెన్నీ బ్రిటన్‌కు చెందిన అగ్రశ్రేణి సైక్లిస్ట్‌లు. ఆమె ఎసెక్స్నుంచి వస్తే... అతను మాంచెస్టర్ ప్రాంతానికి చెందినవాడు. 2012 లండన్ ఒలింపిక్స్ ప్రారంభమైనప్పుడు ఒకే దేశంనుంచి ఒకే క్రీడలో పాల్గొంటున్న సహచరుల్లాగే వారి పరిచయం కూడా ఉంది. అయితే ఇద్దరూ విజయాలు సాధించిన తర్వాత పరస్పర అభినందనలతో మొదలైన ప్రయాణం... గేరు మార్చుకొని వేగంగా దూసుకుపోయింది. ఇదే పోటీల్లో బీచ్‌వాలీబాల్ మ్యాచ్ చూస్తూ ప్రేక్షకుల మధ్య వీరిద్దరు తన్మయత్వంతో ముద్దులు పెట్టుకుంటూ తమ ప్రేమను బయటపెట్టారు. రెండేళ్ల తర్వాత క్రిస్మస్‌నాడు వీరు ఎంగేజ్మెంట్తో ఒకటయ్యారు. ఇద్దరి ఆట, ఆలోచన, అభిరుచులు ఒక్కటిగా సాగిన వీరు రియో ఒలింపిక్స్ సమయానికి ‘స్పెషల్ కపుల్’గా బరిలో నిలిచారు.
బంగారు కాంతులు
సైక్లింగ్ కీరిన్ విభాగంలో కెన్నీ, ఓమ్నియంలో ట్రాట్ స్వర్ణం గెలుచుకోవడంతో వారి సంతోషానికి పట్టపగ్గాల్లేవు. ఒకరినొకరు కౌగిలించుకొని వేదికపైనే ఆనందంతో కన్నీళ్లు పెట్టిన ఆ దృశ్యం అభిమానులందరినీ ఆనందపెట్టింది. ఆటలో లారా ఎన్నో గొప్ప ప్రదర్శనలు ఇచ్చింది. ఆరు వారాల ముందుగా, ఊపిరితిత్తుల్లో సమస్యతోనే పుట్టిన ఆమె సైక్లిస్ట్‌గా ఎదగడంలో చూపిన పోరాట స్ఫూర్తి అసమానం.
ఒక ప్లేయర్‌గానే కాకుండా మేకప్, అందమైన దుస్తుల గురించే మాట్లాడే అచ్చమైన ఆడపిల్లలా ఆమె కనిపించడంతోనే తాను ప్రేమలో పడ్డట్లు కెన్నీ చెప్పుకొచ్చాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో కెన్నీ ఆరు స్వర్ణాలు గెలుచుకోగా, ట్రాట్ నాలుగు స్వర్ణాలతో సత్తా చాటింది. విజయం తర్వాత ‘ఇదో అద్భుతంగా అనిపిస్తోంది. మా పిల్లలకు సైక్లింగ్ జీన్స్ వస్తాయని ఆశించడం తప్పు కాదేమో’ అని లారా ట్వీట్ చేసింది. ‘బ్రేకుల్లేని’ ఒకే సైకిల్‌పై దూసుకుపోతున్న ఈ ప్రేమ ప్రయాణం టోక్యో వరకు సాగించాలని వారు ఆశిస్తున్నారు.