javan killed
-
ఈద్ రోజూ హింసే!
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో రంజాన్ పండుగరోజైన శనివారం కూడా కాల్పుల మోత మోగింది. రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై పాకిస్తానీ సైనికులు జరిపిన కాల్పుల్లో మణిపూర్‌కు చెందిన వికాస్ గురుంగ్ (21) అనే ఆర్మీ జవాన్ మరణించాడు. నియంత్రణ రేఖకు 700 మీటర్ల దూరంలో నౌషెరా సెక్టార్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పాకిస్తాన్ సైన్యం విచక్షణా రహితంగా కాల్పులకు దిగింది. అనంతనాగ్ జిల్లాలోని బ్రకపొరా గ్రామంలో నిరసన కారులకు, భద్రతా దళాలకు మధ్య ఘర్షణ జరుగుతుండగా గ్రెనేడ్ పేలి ఓ వ్యక్తి చనిపోయాడు. శ్రీనగర్ శివారు ప్రాంతంలోనూ దుండగులు జరిపిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ దినేశ్ పాశ్వాన్ గాయపడగా సైనిక వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. శ్రీనగర్ నగరంలోని సఫకదల్ ప్రాంతంలో ఘర్షణల్లో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఉత్తర కశ్మీర్‌లోని సోపోర్, కుప్వారా ప్రాంతాల్లోనూ భద్రతా దళాలతో నిరసనకారులు ఘర్షణలకు దిగారనీ, అయితే కశ్మీర్ లోయ ప్రాంతంలో మాత్రం ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులూ లేవని ఓ పోలీస్ అధికారి చెప్పారు. మిఠాయిల కార్యక్రమం రద్దు సాధారణంగా పండుగ రోజున భారత సైనికులు, పాకిస్తాన్ జవాన్లు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకునేవారు. అయితే కాల్పుల ఘటనల కారణంగా శనివారం భారత సైనికులు ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. భారత్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలూ లేకపోయినప్పటికీ పండుగరోజున కూడా పాకిస్తానీ సైనికులు కాల్పులు జరపడం నీతిమాలిన చర్యని ఓ ఆర్మీ అధికారి వ్యాఖ్యానించారు. పాక్ జవాన్లు రెచ్చగొట్టే చర్యలకు దిగినప్పటికీ భారత సైనికులు సంయమనం పాటించి విసిగిపోయిన అనంతరం ఎదురుకాల్పులకు దిగారన్నారు. బయటకొచ్చిన ఔరంగజేబు వీడియో ఆర్మీ జవాను ఔరంగజేబును గురువారం ఉదయం ఉగ్రవాదులు అపహరించి చంపివేయడం తెలిసిందే. ఔరంగజేబును చంపేందుకు కొద్దిసేపటి ముందు తీసినట్లుగా చెబుతున్న వీడియో ఒకటి శనివారం బయటకు వచ్చింది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు ఔరంగజేబును చంపడానికి ముందు ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఔరంగజేబు విధులేంటి?, ఎక్కడెక్కడ పనిచేశాడు? తదితరాల గురించి ఉగ్రవాదులు ప్రశ్నించారు. -
గాయపడ్డ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
రాయ్‌పూర్:: పోలింగ్ స్టేషన్ పై మావోలు దాడి చేసిన ఘటనలో గాయపడిన సీఆర్పీఎఫ్ జవాను మృతి చెందాడు. మావోలు సోమవారం చత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో ఓ పోలింగ్ స్టేషన్ పై దాడి చేయగా, దాన్ని ప్రతిఘటించిన జవాను తీవ్రంగా గాయపడి అనంతరం ప్రాణాలు కోల్పోయాడు. నయనార్ గ్రామంలో పోలింగ్ జరుగుతుండగా మావోయిస్టులు పేట్రేగిపోయారు. ఒక్క ఉదుటున దూసుకొచ్చిన మావోలు పోలింగ్ సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మృతి చెందిన జవాను186 బెటాలియన్ చెందినవాడని పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఇదిలా ఉండగా మావోయిస్టులు రెండు గ్రామాల్లో ఈవీఎంలను ఎత్తుకెళ్లారు. ఈ రెండు సంఘటనలు నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉండే బస్తర్ ప్రాంతం కాన్కర్ జిల్లాలో జరిగాయి. చత్తీస్‌గఢ్, మావోయిస్టులు, ఈవీఎంలు, Chhattisgarh, Maoists, EVMs