సినిమాలోనూ అన్నదమ్ములే!
తమిళసినిమా: జేకే,జయకాంత్ సోదరద్వయం తిరుపతిస్వామి కుటుంబం అనే చిత్రం ద్వారా కథానాయకులుగా పరిచయం అవుతున్నారు. విశేషం ఏమిటంటే వీరు చిత్రంలోనూ అన్నదమ్ములుగా నటించారు. ఐశ్వర్యలక్ష్మి కథానాయకిగా, జయన్ ప్రధాన పాత్రలో నటించిన ఇందులో దేవదర్శిని, మయిల్‌స్వామి, ముత్తురామన్, కే.అమీర్, కవిరాజ్, సిజర్‌మనోహర్ ముఖ్యపాత్రలను పోషించారు.
జేకే.గుడ్ ఫిలింస్ బాబూరాజ్, జేమ్స్ ఫిలింస్ మురుగానంద్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి సురేశ్ షణ్ముగం దర్శకత్వం వహించారు. ఈయన ఇంతకు ముందు అరసు, గంభీరం చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. ఈ చిత్రాన్ని బాబురాజ్, జాఫర్ఆష్రాఫ్ నిర్మించారు. చిత్ర వివరాలను నిర్మాతల్లో ఒకరైన బాబూరాజ్ తెలుపుతూ తాను సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థలో 25 ఏళ్లగా నిర్మాణ నిర్వాహకుడిగా బాధ్యతలు నిర్వహించానని తెలిపారు.
కాగా ఈ తిరుపతిస్వామి చిత్రాన్ని తన ఇద్దరు కొడుకులు జేకే, జయకాంత్లను కథానాయకులుగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్నానని తెలిపారు.మన పక్కింటిలోనో, ఎదురింటిలోనో కనిపించే సగటు మనిషిలాంటి పాత్ర తిరుపతిస్వామిలో ఉంటుందన్నారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వెళ్లి సాయం చేసే ఆయనకు ఒక అధికారం, రాజకీయ బలం ఉన్న వ్యక్తితో సమస్య ఎదురవుతుందన్నారు.
దాన్ని ఆయన కొడుకులు బుద్ధిబలంతో ఎలా ఎదుర్కొన్నారన్నదే తిరుపతిస్వామి చిత్రం అన్నారు. చిత్రం పూర్తి అయ్యిందని, సెన్సార్ సభ్యులు ‘యూ’ సర్టిఫికెట్ అందించడంతో పాటు మంచి కుటుంబ కథా చిత్రం అంటూ ప్రశంసించారని తెలిపారు. తిరుపతిస్వామి చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.