‘చిన్నమ్మ’కు పదవి ఖాయం!
చెన్నై: తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు దివంగత సీఎం జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళ నటరాజన్ కు అప్పగించేందుకు రంగం సిద్ధమైన్నట్టు తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఆమెకు కట్టబెట్టనున్నారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా ‘చిన్నమ్మ’కు మద్దతు పలకడంతో ఆమె చేతుల్లోకి పార్టీ పగ్గాలు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. శశికళతో తనకు ఎటువంటి విభేదాలు లేవని పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. ‘చిన్నమ్మ’ పార్టీ ప్రధాన కార్యదర్శి కావడం ఎవరికీ అభ్యంతరం లేదని, ఆమె పార్టీ పగ్గాలు చేపట్టాలని అందరూ కోరుకుంటున్నారని చెప్పారు.
అమ్మ తర్వాత అంతటి సమర్థురాలు శశికళేనని, వేరే ప్రత్యామ్నాయం లేదని అన్నాడీఎంకే నేతలు అంటున్నారు. ఈ మేరకు అన్నా డీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు శనివారం పోయెస్ గార్డెన్స్‌లో శశికళను కలసి విన్నవించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టే అర్హత శశికళకు లేదని జయలలిత మేనకోడలు దీప జయకుమార్ గట్టిగా వాదిస్తున్నారు.