Jayashanker Bhupalapalli
-
డ్వాక్రా మహిళల బ్యాంక్ లింకేజీ రుణాలు.. రూ. 22 లక్షల నిధులు స్వాహా
సాక్షి, మరిపెడ ( జయశంకర్ భూపాలపల్లి): డ్వాక్రా మహిళలకు చెందాల్సిన బ్యాంక్ లింకేజీ రుణాలు రూ.లక్షల్లో స్వాహా గురయ్యాయి. పోగు చేసుకున్న పొదుపు డబ్బులో ఏకంగా రూ.22లక్షలను ఐకేపీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్(వీఓఏ) భర్త కాజేశాడు. ఈ విషయం బయటపడడంతో మహిళలు ఆయనను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి ఆందోళనకు దిగిన ఘటన మరిపెడ మండలం ఉల్లెపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఉమ్మడి ఉల్లెపల్లిలో 38 పొదుపు సంఘాలు ఉండగా, ఇదే గ్రామానికి చెందిన వీఓఏ గోరెంట్ల రాణి బదులు ఆమె భర్త విష్ణు విధులు నిర్వర్తిస్తున్నారు. తొలుత అందరితో నమ్మకంగా మెదిలిన ఆయన బ్యాంకు లింకేజీ రుణాల్లోని కొంత మొత్తాన్ని తన ఖాతాల్లో వేసుకున్నాడు. ఈ విషయంపై అనుమానంతో సర్పంచ్ చిర్రబోయిన ప్రభాకర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా 17 సంఘాలకు చెందిన రూ.22 లక్షలు వీఓఏ భర్త మాయం చేసినట్లు తేలడంతో గురువారం ఆయనను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి ఆందోళనక చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకుని మహిళలను సముదాయించి విష్ణును పోలీస్ స్టేషన్ తరలించారు. చదవండి: దేశంలో పెరిగిన కరోనా కేసుల రికవరీలు.. తగ్గిన మరణాలు -
Photo Feature: రైలు బోగీలు కాదు... ఇసుక లారీలే!
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో గోదావరి నుంచి ఇసుక తరలించేందుకు వందలాది సంఖ్యలో లారీలు వస్తాయి. కరోనా కారణంగా ఇంతకాలం వీటి సంఖ్య తక్కువగానే ఉండగా.. లాక్డౌన్ సడలింపులతో రెండు రోజులుగా సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో కాళేశ్వరంలోని ఇప్పలబోరు వద్ద లారీలు శనివారం ఇలా మూడు కిలోమీటర్ల మేర నిలిచాయి. ఇవి రైలు బోగీలను తలపించేలా ఉండటంతో అటుగా వెళుతున్న వాహనదారులు చూసేందుకు ఆసక్తి కనబరిచారు. చదవండి: ఈ ‘కాక్టెయిల్’తో కరోనాకు చెక్ -
ఆన్లైన్ మోసం.. బ్లూటూత్ బుక్ చేస్తే...
సాక్షి, కురవి (జయశంకర్ భూపాలపల్లి): ఓ ఆన్లైన్ సంస్థలో బ్లూటూత్ హెడ్సెట్ బుక్ చేస్తే ఖాళీ డబ్బా వచ్చిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(సీ) గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొమ్మగాని మల్సూర్‌గౌడ్ బోట్ కంపెనీ బ్లూ టూత్ కోసం ఆర్డర్ చేశాడు. మంగళవారం కొరియర్ సంస్థ నుంచి వచ్చిన వ్యక్తి ఇచ్చిన బాక్స్ తీసుకుని రూ.1,670 చెల్లించాడు. ఆ తర్వాత డబ్బాలో ఏమీ లేకపోవడంతో డెలివరీ బాయ్‌ను నిలదీశాడు. తన చేతిలో ఏమీ ఉండదని ఆయన చెప్పగా, వాదనకు దిగడంతో చివరకు డెలివరీ బాయ్ డబ్బు ఇచ్చేసి వెళ్లిపోయాడు. -
ఉప్పొంగిన ప్రాణహిత, గోదావరి
కాళేశ్వరం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత వరద కలుస్తోంది. ఎగువన అన్నారం (సరస్వతీ) బ్యారేజీ గేట్లు ఎత్తడంతో దిగువకు వచ్చే గోదావరి జలాలు కూడా కాళేశ్వరం వద్ద కలుస్తున్నాయి. దీంతో కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదుల వరద పుష్కర ఘాట్లను తాకుతూ 8.3 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీకి వరద తాకిడి పెరుగుతోంది. దీంతో శుక్రవారం బ్యారేజీలో ని 85 గేట్లకు గాను 57 గేట్లు ఎత్తి వరదను దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. ఎగువన గోదావరి, ప్రాణహిత నదుల ద్వారా 2,91,200 క్యూసెక్కుల వరద వస్తుండగా, గేట్లు ఎత్తడంతో దిగువకు 2.42,500 క్యూసెక్కుల నీరు తరలుతోందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. అలాగే.. అన్నారంలోని సరస్వతీ బ్యారేజీలోకి స్థానిక వాగుల ద్వారా భారీగా నీరు వచ్చి చేరుతోంది. కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోతలను నిలిపివేశారు. బ్యారేజీలో మొత్తం 66 గేట్లకు గాను 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా 9.20 టీఎంసీలతో నిండుకుండలా మారింది. ఈ బ్యారేజీకి సుమారు 30కి పైగా వాగుల ద్వారా ఇన్‌ఫ్లో 36,480 క్యూసెక్కులు వస్తుండగా, గేట్లు ఎత్తడంతో 29,700 క్యూసెక్కుల వరద దిగువ కాళేశ్వరం వైపునకు వెళ్తోంది. సాయంత్రంగా ఐదు గేట్లను మూసివేశారు. భద్రాచలం వద్ద పోటెత్తిన గోదారమ్మ కాగా, భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తింది. శుక్రవారం రాత్రి 10 గంటలకు గోదావరి నీటి మట్టం 40.3 అడుగులకు చేరింది. గంట గంటకూ పెరుగుతున్న గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద వచ్చి చేరుతుండటంతో గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఉదయం 10 గంటలకు 7.13 మీటర్ల నీటి మట్టం నమోదు కాగా, మధ్యాహ్నం 12 గంటలకు 7.26 మీటర్లు, సాయంత్రం 4 గంటలకు 7.34 మీటర్లు, సాయంత్రం 5 గంటలకు 7.40 మీటర్లకు చేరింది. ఇలా గంటగంటకు వరద ఉధృతి పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులతో కలసి ఏటీడీఏ పీఓ హనుమంత్, ఏఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించి సహాయక చర్యలపై చర్చించారు. అలాగే, వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు ఏటూరునాగారం తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు పనిచేసే ఈ కంట్రోల్ రూంను 80080 60434 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
కూరగాయల వ్యాపారుల ఘర్షణ: కత్తిపోట్లు
పరకాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరకాలలోని కూరగాయల మార్కెట్లో ఇద్దరు వ్యాపారస్తుల మధ్య పాత కక్షలు భగ్గుమన్నాయి. దీంతో ఓ వ్యాపారి కత్తిపోట్లకు గురయ్యాడు. ఆదివారం సంత జరుగుతుండగానే మార్కెట్లో కక్కు శ్రీను, వనం రాజు అనే వ్యాపారులు గొడవపడ్డారు. రాజుపై శ్రీను కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. కుప్పకూలిపోయిన రాజును ఇతర వ్యాపారులు పరకాల సివిల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. శ్రీను పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని పరకాల సీఐ జాన్ నర్సింహులు, ఎస్ఐ సుధాకర్‌లు సందర్శించి వివరాలు సేకరించి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో ఎదురెదురుగా దుకాణాలు నిర్వహిస్తున్న వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో వారం క్రితమే పెద్దలు పంచాయితీ చేసి మరోసారి గొడవలు పడవద్దని ఇద్దరి కుటుంబ సభ్యులకు సూచించినట్లు తెలిసింది. అయినా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని ఇతర వ్యాపారులు తెలిపారు. సంతలో జరిగిన ఈ సంఘటన వ్యాపారులను, కొనుగోలుదారులను భయభ్రాంతులకు గురిచేసింది.