ఎమ్మెల్యే జేసీ అరెస్టు.. తీవ్ర ఉద్రిక్తత
ట్రావెల్స్ బస్సులకు సంబంధించిన వివాదంలో అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీయే కార్యాలయానికి వచ్చిన ఆయనను గేటువద్దే అడ్డుకుని అరెస్టుచేసి, స్టేషన్కు తరలించారు. అయితే తాను అన్ని ఆధారాలతో ఆర్టీయే కార్యాలయానికి వస్తే.. తనను అరెస్టు చేశారని, ఇది తగదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ ఘటనతో ఆర్టీయే కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనుమతి లేకుండా ట్రావెల్స్ నడుపుతున్నారని శ్రీనివాసగౌడ్ ఆరోపించగా, తమవద్ద అనుమతులన్నీ ఉన్నాయని, వాటిని చూపిస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు ఇద్దరూ ఒకరిపై ఒకరు సవాలు విసురుకున్నారు. ఇంతలో జేసీని పోలీసులు అరెస్టు చేశారు.
పలు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరగడం వల్ల తెలంగాణ ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ ఆరోపించారు. స్టేజి క్యారియర్ల పేరుతో ట్రావెల్స్ బస్సులు నడుపుతున్నారని ఆయన అన్నారు. ఈ విషయమై తేల్చుకోడానికి ఆయన మంగళవారం ఉదయం తన అనుచరులతో కలిసి ఆర్టీయే కార్యాలయానికి వచ్చారు. తర్వాత ప్రభాకర్ రెడ్డి రాగా, ఆయనను పోలీసులు గేటు బయటే అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ప్రైవేటు ట్రావెల్స్ అక్రమంగా తిరగడం వల్ల తెలంగాణ ఆర్టీసీకి నష్టం జరుగుతోందని శ్రీనివాసగౌడ్ అన్నారు. తాము ఎవరికీ భయపడి బతికేవాళ్లం కాదని, ఆరోపణ చేసినప్పుడు దాన్ని నిరూపించాల్సిన అవసరం తమకుందని, అందుకే అన్ని ఆధారాలతో వచ్చామని అన్నారు.
ఆయనే తప్పు చేసి, తమ మీద ఆరోపణలు చేస్తున్నాని మండిపడ్డారు. పాలెం బస్సు దుర్ఘటనలో కూడా ఆయనదే నేరమని ఆరోపించారు. బస్సు తనది కాదని చెప్పడానికి పాత తేదీతో అమ్మినట్లు కూడా పత్రం ఉందని, డిసెంబర్ నెలలో స్టాంప్ పేపర్ కొని, అక్టోబర్లో సంతకం చేసినట్లు చూపించారని తెలిపారు. అలాగే తక్కువ సీట్లకు పర్మిట్ తీసుకుని ఎక్కువ సీట్లతో నడిపిస్తున్నారని చెప్పారు. తాము తప్పు చేస్తే తమ బస్సులు సీజ్ చేయాలని అన్నారు. తనమీద ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని కూడా శ్రీనివాస గౌడ్ అన్నారు. తాము దివాకర్ ట్రావెల్స్ విషయాన్ని కూడా ప్రస్తావించలేదని, పలు ట్రావెల్స్ గురించి మాట్లాడితే ఈయనొక్కరే స్పందించారని అన్నారు. రాజకీయ నాయకులు.. గూండాల్లా వ్యవహరించకూడదని చెప్పారు. ఆయనతో పాటు ఈ వ్యాపారంలో 20-30 మంది ఉన్నారని, వాళ్లలో ఎవరు తప్పు చేసినా శిక్షించాలని కోరారు.