JDA office
-
వ్యవసాయం లాభసాటిగా మార్చాలి
అధికారులు కష్టపడి పనిచేయాలి జేడీఏ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నెల్లూరు రూరల్ : వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయాధికారులు కష్టపడి పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. స్థానిక తాహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రూ.85 లక్షలతో నూతనంగా నిర్మించిన జేడీఏ కార్యాలయాన్ని ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి, ఇరిగేషన్ తగిన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లాలో కరువు పరిస్థితుల్లో నష్టపోయిన రైతులకు, భారీ వర్షాల పంట నష్టం పరిహారం మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భూసార పరీక్షలు, రాయితీపై విత్తనాలు, ఎరువులు, యంత్రాలను రైతులకు అందజేస్తూ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. జిల్లాలో కృష్ణపట్నం, కోడూరు ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, కావలి ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రమణ్యంయాదవ్, వ్యవసాయ శాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి, జేడీఏ హేమమహేశ్వరరావు, ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పోచారం.. చూడండీ మా గాచారం!
⇒ వ్యవసాయశాఖ.. సమస్యల తడాఖా! ⇒ అద్దె ఇంటిలోనే జేడీఏ కార్యాలయం ⇒ పోస్టులు ఖాళీ.. ఇన్‌చార్జీలే దిక్కు.. ⇒ రైతులకు సేవలందించలేని దుస్థితి ⇒ కొత్త సర్కారుపైనే గంపెడాశలు ⇒ నేడు మంత్రి పోచారం రాక వరంగల్ : జిల్లా వ్యవసాయ శాఖ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. అద్దె భవనాలే వ్యవసాయ కార్యాలయాలకు దిక్కుగా మారాయి. ప్రధానమైన వ్యవసాయ సంయుక్త సంచాలకుల(జేడీఏ) కార్యాలయం ఇరుకుగా ఉన్న అద్దె ఇంటిలో కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా ఏడీఏ, ఏఓలకూడా సరైన కార్యాలయాలు లేవు. కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో పాలన అస్తవ్యస్తంగా తయూరైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని రైతాంగం గంపెడాశలు పెట్టుకుంది. మురుగుతున్న రూ.45 లక్షలు హన్మకొండలోని అదాలత్ వెనుక జేడీఏ కార్యాలయం ఉంది. సర్క్యూట్ గెస్ట్‌హౌస్ సమీపంలో ఏడీఏ కార్యాలయం కొనసాగుతోంది. కీలక కార్యాలయాలన్నీ ఒకే చోట ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దకాలంగా పెండింగ్‌లోనే ఉంది. 2005లో జేడీఏ కార్యాలయ నిర్మాణం కోసం రూ.45 లక్షలు విడుదలయ్యూయి. అవి అతీగతి లేకుండా అక్కడే మురిగిపోతున్నాయి. బంధం చెరువు సమీపంలో జేడీఏ కార్యాలయానికి స్థలం కేటాయించినా.. కోర్టు కేసుల కారణంగా ముందుకు సాగడం లేదు. నూతన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ కార్యాలయాల నిర్మాణానికి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్చార్జలతోనే కాలం వెళ్లదీత జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయ శాఖలో అధికారుల కొరత పీడిస్తోంది. ఖాళీ పోస్టుల్లో తాత్కాలికంగా ఇతర అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించి కాలం వెళ్లదీస్తున్నారు. కొంతకాలంగా జిల్లాలో 10 స్థానాల్లో అధికారులు లేకుండానే కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఫలితంగా ఉన్న అధికారులపై పని ఒత్తిడి పెరిగింది. జిల్లా వ్యవసాయ శాఖలో అత్యంత ప్రధానమైన జాయింట్ డెరైక్టర్ ఆఫ్ అగ్రికల్చర్(జేడీఏ) స్థానంలో పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో డీడీఏగా జి.రామారావు విధులు నిర్వర్తిస్తున్నారు. నూతన రాష్ట్రంలో చేర్పులు, మార్పులు జరిగితే కొత్త జేడీఏను నియమించే అవకాశం ఉంది. అదేవిధంగా.. ప్లాంట్ ప్రొడక్షన్, రైతు శిక్షణ కేంద్రం, భూసార కేంద్రం, జేడీఏ కార్యాలయంలో నాలుగు డిప్యూటీ డెరైక్టర్ అఫ్ అగ్రికల్చర్(డీడీఏ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మండల స్థాయిలో రైతులతో ప్రత్యక్ష సంబంధాలుండే ఆరు వ్యవసాయ అధికారుల (ఏఓ) స్థానాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తాడ్వాయి, వరంగల్ ఏడీఏ కార్యాలయం, రైతు శిక్షణ కేంద్రం, కేసముద్రం, ఏటూరునాగారంలోని భూసార పరీక్ష కేంద్రం, పాలంపేటలోని విత్తన ఫామ్‌లలో ఒక్కో ఏఓ పోస్టు ఖాళీగా ఉంది. వీటితోపాటు ఏఈఓ స్థానా లు పలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖకు నివేదించారు. ఈ దఫా భర్తీ చేస్తారనే.. ఈ ఖాళీల వల్ల సంబంధిత విభాగాలు, మండలాల్లో రైతులకు వ్యవసాయ అధికారులు, సిబ్బంది సరైన సమయంలో సూచనలు అందించలేకపోతున్నారు. కార్యాలయాల్లో ఏఓల కొరత వల్ల పనులు సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది. నూతన ప్రభుత్వం వ్యవసాయ శాఖకు అత్యంత ప్రాధాన్యమినిస్తున్నట్లు ప్రకటిస్తున్నందున ఈ దఫా ఈ ఖాళీలు భర్తీ చేస్తారనే ఆశాభావంతో జిల్లా రైతులు ఉన్నారు. ఈ దిశగా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సత్వర చర్యలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నారు.