లక్ష తగ్గిన జేఈఈ దరఖాస్తులు
రేపటి నుంచి దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణ
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్-2016 పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. దరఖాస్తుల సంఖ్య దేశవ్యాప్తంగా లక్ష వరకు తగ్గినట్లు జేఈఈ మెయిన్ వర్గాలు వెల్లడించాయి. 2015లో 13.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి అది 12.07 లక్షలకు తగ్గింది. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 1.8 లక్షల మంది దరఖాస్తు చే సుకున్నట్టు అంచనా. జేఈఈ మెయిన్ పరీక్ష విధానం ప్రారంభమైన 2012లో 12.2 లక్షలు, 2013లో 12.82 లక్షలు, 2014లో 13.56 లక్షల విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
సవరణకు 31 వరకు అవకాశం
జేఈఈ మెయిన్ దరఖాస్తు ఫారాల్లో పొరపాట్లను సవరించుకునేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అవకాశం కల్పించింది. ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు విద్యార్థులు తమ ఆన్లైన్ దరఖాస్తుల్లో వివరాల్లో పొరపాట్లను www.jeemain.nic.in వెబ్సైట్ ఇచ్చే ప్రత్యేక లింకు ద్వారా సవరించుకోవచ్చని సూచించింది. 31వ తేదీ తరవాత సవరణకు అవకాశం ఇవ్వబోమని వెల్లడించింది. పరీక్ష కేంద్రం (పట్టణం) మార్పు, పరీక్ష విధానం (ఆన్లైన్ నుంచి ఆఫ్‌లైన్‌కు, ఆఫ్లైన్నుంచి ఆన్‌లైన్‌కు) మార్పు కుదరదని స్పష్టం చేసింది. ఫీజు చెల్లించిన వారిలో ఎవరైనా అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటే ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు చెల్లించవచ్చని వెల్లడించింది.
వెబ్సైట్లో మాక్ టెస్టు లింక్
జేఈఈ మెయిన్ రాత పరీక్ష (ఆఫ్‌లైన్)ను ఏప్రిల్ 3వ తేదీన నిర్వహించనుండగా, ఆన్లైన్ పరీక్షలను ఏప్రిల్ 9, 10 తేదీల్లో నిర్వహించేందుకు సీబీఎస్ఈ చర్యలు చేపడుతోంది. ఆన్లైన్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ప్రాక్టీస్ చేసేందుకు తమ వెబ్సైట్లో ప్రత్యేకంగా మాక్ టెస్టు లింకు ఇచ్చింది. ‘‘90 ప్రశ్నలకు 180 నిమిషాల్లో మాక్ టెస్టు రాయాలి. లింక్ ఓపెన్ చేయగానే సబ్జెక్టులవారీగా మాక్ టెస్టు విధానం ఉంటుంది. అభ్యర్థులు దీన్ని ఉపయోగించుకోవాలి’’ అని పేర్కొంది.