JEE- Mains
-
23 పట్టణాల్లో జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్ష
ఈసారి హైదరాబాద్‌లో కేవలం ఆఫ్‌లైన్ పరీక్ష మాత్రమే సాక్షి, హైదరాబాద్: జేఈఈ-మెయిన్స్ 2014 పరీక్ష ను ఈసారి రాష్ట్రంలోని 23 పట్టణాల్లో ఆన్లైన్లో రాసే సౌలభ్యం కల్పించారు. జేఈఈ-మెయిన్ 2013 పరీక్ష సందర్భంగా తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఆన్లైన్ పరీక్ష కోసం సీబీఎస్ఈ అనేక పట్టణాలను ఎంపిక చేసింది. మన రాష్ట్రంలో అనంతపురం, బాపట్ల, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, కడప, కాకినాడ, కంచకర్ల, కరీంనగర్, కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం పట్టణాల్లో ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. వరంగల్, ఖమ్మం, తిరుపతి, గుంటూరులతో పాటు హైదరాబాద్‌లో ఆఫ్‌లైన్ పరీక్ష రాసేందుకు కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. అయితే హైదరాబాద్‌లో గతంలో ఉన్న రీతిలో ఆన్లైన్లో పరీక్ష రాసేందుకు ఇప్పుడు అవకాశం లేకుండాపోయింది. సహాయక కేంద్రాల ఏర్పాటు: ఏప్రిల్ 6న ఆఫ్‌లైన్‌లో, ఏప్రిల్ 9, 11, 12, 19 తేదీల్లో ఆన్లైన్ విధానంలో జరగనున్న జేఈఈ-మెయిన్-2014 పరీక్షకు ఈ నెల 15న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. వీటిని ఆన్లైన్లో డిసెంబర్ 26 వరకు మాత్రమే స్వీకరిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తులు నింపే ప్రక్రియలో సహకరించేందుకు రాష్ట్రంలో 15 సహాయక కేంద్రాలను ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్, హిమాయత్‌నగర్‌లోని హోవర్డ్ పబ్లిక్ స్కూల్, సికింద్రాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, విజయవాడలోని వీపీ సిద్దార్థ పబ్లిక్ స్కూల్, ఎన్.సెయింట్ మాథ్యూస్ పబ్లిక్ స్కూల్, గుంటూరులోని శ్రీవెంకటేశ్వర బాలకుటీర్, తిరుపతిలో కేంద్రీయ విద్యాలయం నంబరు 1, భారతీయ విద్యాభవన్, అనంతపురంలో శ్రీసత్యసాయి స్కూల్, వరంగల్‌లో వరంగల్ పబ్లిక్ స్కూల్, విశాఖలో వికాస్ విద్యానికేతన్, రామనాథ్ సెకండరీ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఖమ్మంలో హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్లో ఈ సహాయక కేంద్రాలను ఏర్పాటుచేశారు. -
ఎంసెట్ అభ్యర్థులకు ‘జేఈఈ’ దెబ్బ!
యాజమాన్య కోటా సీట్ల భర్తీలో తీరని నష్టం జేఈఈ-మెయిన్స్ రాసినవారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వడంతో తిప్పలు అగ్రశ్రేణి కాలేజీల్లో ఎంసెట్ అభ్యర్థులకు మొండిచేయి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ యాజమాన్య కోటాలో అడ్మిషన్ల భర్తీకి తొలి ప్రాధాన్యత జేఈఈ-మెయిన్స్ ర్యాంకర్లకే ఇవ్వాలన్న నిబంధనతో కేవలం ఎంసెట్ మాత్రమే రాసిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. తాజాగా ఈ విద్యాసంవత్సరంలో అగ్రశ్రేణి కళాశాలలు భర్తీ చేసిన యాజమాన్య కోటా జాబితాలను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్న సీట్లలో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో, 30 శాతం సీట్లు యాజమాన్య కోటా(బీ-కేటగిరీ)లో భర్తీ చేస్తున్నారు. జీవో 74 ప్రకారం గత ఏడాది వరకు బీ-కేటగిరీలో తొలుత 5 శాతం ఎన్నారై కోటా భర్తీ చేసేవారు. మిగిలిన సీట్లలో ముందుగా ఇతర రాష్ట్రాల ఏఐఈఈఈ ర్యాంకర్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, వీరు లేనిపక్షంలో ఎంసెట్ ర్యాంకర్లతో భర్తీ చేయాలని, వీరు కూడా లేనిపక్షంలో ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా ప్రతిభా క్రమంలో భర్తీచేయాలని ఈ జీవో స్పష్టం చేస్తోంది. అయితే ఈ ప్రాధాన్య్ర క్రమంలో తొలి ప్రాధాన్యత కింద కేవలం ఇతర రాష్ట్రాల ఏఐఈఈఈ ర్యాంకర్లకు ప్రాధాన్యం ఇస్తే మనరాష్ట్ర విద్యార్థులు నష్టపోతారన్న వాదనలు తెరపైకి వచ్చాయి. మన రాష్ట్ర విద్యార్థుల్లో ఏఐఈఈఈ రాసేవారు పరిమితంగా ఉంటున్నారన్న ఆందోళన వ్యక్తమవడంతో ఉన్నత విద్యాశాఖ ప్రాధాన్యతలను మార్చింది. 2012-13 ఆగస్టు 28న జీవో 60, 61లను జారీచేసింది. ఇందులో తొలి ప్రాధాన్యం అన్ని రాష్ట్రాల ఏఐఈఈఈ ర్యాంకర్లకు ఇవ్వాలని, పారదర్శకత పాటించాలని నిర్దేశించింది. అయితే కేవలం పారదర్శకత అంటూ ప్రభుత్వం మభ్యపెట్టిందని, బీ-కేటగిరీ సీట్లను కూడా ఆన్లైన్లో భర్తీ చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. దీంతో ప్రభుత్వం సెప్టెంబర్ 3న మళ్లీ 66, 67 జీవోలు విడుదల చేసింది. 2012-13లో ముందుగా విడుదల చేసిన జీవోలు 60, 61 ప్రకారం యాజమాన్య కోటా సీట్లను భర్తీచేసిన యాజమాన్యాలు.. అడ్మిషన్ల ప్రక్రియ మొదలయ్యాక ప్రభుత్వం జీవో 66, 67లను విడుదల చేసిందంటూ హైకోర్టును ఆశ్రయించాయి. అడ్మిషన్ల మధ్యలో ఈ జీవోలు రావడం సబబు కాదంటూ హైకోర్టు 2012-13 విద్యాసంవత్సరానికి జీవో 66, 67ల అమలును నిలుపుదల చేసింది. 2012-13లో జీవో 60, 61 ప్రకారం సీట్లు భర్తీ అయ్యాయి. అయితే 2013-14కు జీవో 66, 67లను అమలు చేయాలనుకున్న సమయంలో యాజమాన్యాలు మళ్లీ హైకోర్టును ఆశ్రయించాయి. అడ్మిషన్ల ప్రక్రియను ఆన్లైన్లో చేపట్టడం సరికాదని వాదించాయి. దీనిపై హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువడకముందే సింగిల్ జడ్జి తీర్పును అనుసరించి ఉన్నత విద్యామండలి కన్వీనర్ కోటాకు నోటిఫికేషన్‌ను, యాజమాన్య కోటాకు మార్గదర్శకాలను జారీచేసింది. దీంతో మళ్లీ యాజమాన్యాలు జీవో 74, జీవో 60, 61 ప్రకారం సీట్ల భర్తీ ప్రక్రియను ఆరంభించాయి. ఆ తర్వాత హైకోర్టు జీవో 66, 67 ప్రకారం ఆన్లైన్లోనే భర్తీ చేయాలని తీర్పు ఇచ్చినప్పటికీ.. అప్పటికే ప్రక్రియ మొదలవడంతో ప్రభుత్వం ఏమీ చేయలేక మౌనం వహించింది. అగ్రశ్రేణి కళాశాలల్లో సీట్లన్నీ వారికే.. యాజమాన్యాలు ఈ ఏడాది జీవో 60, 61 ప్రకారం బీ-కేటగిరీ సీట్ల భర్తీ చేపట్టాయి. అంటే ‘అన్ని రాష్ట్రాల జేఈఈ-మెయిన్స్ ర్యాంకర్లకు తొలి ప్రాధాన్యత’ అనే నిబంధనను పాటించారు. ఇతర రాష్ట్రాల అభ్యర్థుల సంగతి పక్కనబెడితే.. మనరాష్ట్రం నుంచి ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో జేఈఈ-మెయిన్స్ రాసినందున వారిలో ఎంత పెద్ద ర్యాంకు ఉన్నా.. జేఈఈ-మెయిన్స్ రాసిన అభ్యర్థులకే సీటు దక్కింది. రెండో నిబంధన అయిన ‘ఎంసెట్ ర్యాంకర్లకు ప్రాధాన్యత’ అనే అంశం పరిగణనలోకి రాకముందే సీట్లన్నీ భర్తీ అయ్యాయి. అగ్రశ్రేణి కళాశాలలన్నింటిలో ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రేతరులకు ప్రాధాన్యత ఇస్తున్నామనుకున్న ప్రభుత్వం.. ఈ నిబంధన కారణంగా రాష్ట్రంలోని జేఈఈ-మెయిన్స్ రాసిన అభ్యర్థులకు మాత్రమే లబ్ధి చేకూరడాన్ని పట్టించుకోలేదు. దీంతో తాము అన్యాయానికి గురవుతున్నామని ఎంసెట్ అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జేఈఈ- మెయిన్స్ ర్యాంకర్లకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల.. జేఈఈ-మెయిన్స్‌లో 1 లక్ష ర్యాంకు వచ్చినా.. ఎంసెట్‌లో 1వ ర్యాంకు వచ్చినా.. తొలి ప్రాధాన్యం జేఈఈ-మెయిన్స్‌కే దక్కుతుంది. దీనివల్ల కేవలం ఎంసెట్ మాత్రమే రాసిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో అష్టకష్టాలు పడి ఎంసెట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకున్నా.. ప్రతిభా క్రమంలో మంచిసీట్లు కోల్పోతున్నామని ఎంసెట్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.