Jeevan daan
-
చనిపోయినా.. మరో ఎనిమిది మందిని బతికించొచ్చు!
World Organ Donation Day 2021: బతికున్నప్పుడే కాదు.. చనిపోతూ నలుగురికి ప్రాణం పోయడం మనిషికి దక్కిన ఏకైక వరం. ఆ లెక్కన అవయవదానం గొప్ప కార్యం. కానీ, సమాజంలో పూర్తి స్థాయిలో దీనిపై అవగాహన చాలామందికి కలగట్లేదు. అవయవాలు దానం చేయడం వల్ల దాత ఆరోగ్యం చెడిపోతుందనే అపోహ ఉంది. అదేవిధంగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులకు సంబంధించి కూడా అవయవదానం చేసేందుకు వారి కుటుంబ సభ్యులు అంత సులువుగా అంగీకరించరు. అందుకే అందరిలో అవగాహన కల్పించేందుకే ప్రతీ ఏడు ఆగస్టు 13న ‘ప్రపంచ అవయవ దాన దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. తొలి అవయవదానం ప్రపంచంలో మొట్టమొదటి అవయవదానం.. 1954లో అమెరికాలోని బోస్టన్లోని పీటర్ బెంట్ బ్రీగమ్ ఆస్పత్రిలో జరిగింది. రోనాల్డ్ లీ హెర్రిక్ అనే వ్యక్తి తన కవల సోదరుడైన రోనాల్డ్ జే హెర్రిక్‌కి కిడ్నీని దానం చేశాడు. సోదరుడి మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతుంటే లీ హెర్రిక్ తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. 1954లో జరిగిన ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యింది. కిడ్నీ మార్పిడి తర్వాత ఎనిమిదేళ్ల పాటు జే హెర్రిక్ జీవించాడు. ఇక కిడ్నీ దానం చేసిన లీ హెర్రిక్ మరో 56 ఏళ్ల పాటు జీవించి 2010లో చనిపోయాడు(వృద్ధాప్య సంబంధిత సమస్యలతో). ఇక ఆపరేషన్ని సక్సెక్స్ చేసిన డాక్టర్ జోసెఫ్ ముర్రే.. తర్వాత కాలంలో నోబెల్ బహుమతి పొందాడు. ప్రమాదం లేదు హెర్రిక్ సోదరుల అవయవమార్పిడి శస్త్ర చికిత్స వైద్య రంగంలో ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. అవయవదానం చేస్తే ఎటువంటి ప్రమాదం లేదనే విషయాన్ని లోకానికి చాటి చెప్పింది. అప్పటి ప్రపంచ వ్యాప్తంగా అవయవదానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క అమెరికాలోనే నలభై మూడు వేలకు పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. ఎనిమిది మంది ప్రాణాలు ఒక వ్యక్తి నుంచి ఎనిమిది రకాల అవయవాలను ఇతరులకు దానం చేసే వీలుంది. గుండె, మూత్రపిండాలు, పాంక్రియాస్, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, చర్మపు టిష్యు, ఎముకల్లోని మజ్జ, చేతులు, ముఖం, స్టెమ్‌సెల్స్, కళ్లని ఇతరులకు మార్పిడి చేసే అవకాశం ఉంది. కిడ్నీ, కాలేయ మార్పిడి, ఎముక మజ్జ బతికుండగానే దగ్గరి వాళ్ల కోసం దానం చేస్తుంటారు. ఇక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి వారి కుటుంబ సభ్యుల సమ్మతితో ఇతర అవయవాలను సేకరిస్తుంటారు. వీటి సాయంతో మరో ఎనిమిది మందికి ప్రాణాలను కాపాడే వీలుంది. జీవన్‌దాన్ ట్రస్ట్ అవయవమార్పడి కోసం కేంద్రం జీవన్‌దాన్ ట్రస్ట్‌ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బ్రయిన్‌డెడ్ అయిన వ్యక్తుల సమాచారం ఈ ట్రస్ట్‌కి అందిస్తే వారు అవయవాలు సేకరించి అవసరం ఉన్న రోగులకు కేటాయిస్తుంటారు. ప్రస్తుతం జీవన్‌దాన్ ట్రస్టు దగ్గర వివిధ అవయవాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 2,467గా ఉంది. ఇందులో అత్యధికంగా కిడ్నీలు 1,733, కాలేయం 631, గుండె 35, ఊపిరిత్తులు 60, క్లోమం 8గా ఉన్నాయి. సర్కారు దవాఖానాలు భేష్ కార్పోరేట్ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు ఎక్కువ హడావుడి కనిపిస్తుంది. కానీ ఈ ఆపరేషన్లు చేయడంలో ప్రభుత్వ ఆస్పత్రులు కూడా మెరుగైన పనితీరే కనబరుస్తున్నాయి. హైదరాబాద్‌లోని నిజామ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ఇప్పటి వరకు 2013 నుంచి ఇప్పటి వరకు 283 అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. ఇందులో 267 కిడ్నీలు, 11 కాలేయ, 5 గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. బ్రెయిన్ డెడ్ అయిన 31 మంది చేసిన అవయదానం వల్ల ఇక్కడ 283 మందికి లైఫ్ లభించింది. ఇక ఉస్మానియాలో 62, గాంధీలో 9 ఆపరేషన్లు జరిగాయి. బ్రెయిన్ డెడ్ మెదడులో రక్తనాళాలు చిట్లి అంతర్గతంగా రక్తస్రావం జరిగినప్పుడు మెదడు పని చేయడం ఆగిపోతుంది. ఇటువంటి కేసులను బ్రెయిన్ డెడ్‌గా వ్యవహరిస్తారు. రోడ్డు ప్రమాదం, బీపీ వల్ల కూడా ఇటువంటి మరణాలు జరుతుంటాయి. వైద్యుల బృందం బ్రయిన్డెడ్గా నిర్థారించిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో అవయవాలను సేకరిస్తారు. కొన్ని సార్లు బతికుండగానే తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం కిడ్నీలు, కాలేయం దానాలు కూడా జరుగుతుంటాయి. - సాక్షి, వెబ్‌డెస్క్ -
కిమ్స్‌లో మహారాష్ట్ర యువకుడికి కాలేయ మార్పిడి
హైదరాబాద్: తను కన్నుమూస్తూ మరో ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపాడు ఓ యువకుడు. నెల్లూరుకు చెందిన దినేష్‌రెడ్డి (31) కొంత కాలంగా తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం వారం క్రితం నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చేరాడు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో శుక్రవారం రాత్రి బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అవయవదానానికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో జీవన్‌దాన్‌కు సమాచారమిచ్చారు. జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసుకుని హైదరాబాద్ కిమ్స్‌లో కాలేయ, గుండె మార్పిడి చికిత్సకు ఎదురు చూస్తున్న ఇద్దరు బాధితులకు సమాచారం ఇచ్చారు. అవయవమార్పిడి చికిత్సకు వారు అంగీకరించడంతో వారికి చికిత్స చేస్తున్న వైద్య బృందం వెంటనే ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరు చేరుకుంది. దాత నుంచి గుండె, కాలేయం, కిడ్నీలను సేకరించింది. రెండు కిడ్నీలను నెల్లూరు కిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులకు అమర్చగా, గుండె, కాలేయాన్ని ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచి ఉదయం 6.30 గంటలకు నెల్లూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 7.30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అటు నుంచి ట్రాఫిక్ పోలీసుల సహాయం (గ్రీన్ చానల్)తో కిమ్స్‌కు తరలించారు. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన 36 ఏళ్ల యువకునికి కాలేయాన్ని విజయవంతంగా అమర్చారు. దాత నుంచి సేకరించిన గుండె స్వీకర్తకు మ్యాచ్ కాలేదు. దాత హైబీపీతో బాధపడుతుండటం, సాధారణంగా 1 సెంటీమీటర్ల మందంలో ఉండాల్సిన గుండె రక్త నాళాలు 1.5 సెంటిమీటర్ల మందంలో ఉండటం వల్ల అవయవమార్పిడికి పనికి రాలేదు. దీంతో గుండె మార్పిడి చికిత్సను విరమించుకున్నట్లు కిమ్స్ సీఈవో భాస్కర్‌రావు వెల్లడించారు. -
‘గుండె’ గోడు పట్టదా?
• జీవన్‌దాన్ కింద 256 గుండె దాతల నుంచి 26 మాత్రమే స్వీకరణ • మిగిలినవన్నీ వృథా... బాధితుల వివరాలు నమోదు చేయని ఫలితం • గుండె మార్పిడి చేసే అత్యాధునిక వసతులు కూడా కరువు సాక్షి, హైదరాబాద్: ‘అవయవ దానాలు చేయండి... బాధితుల జీవితాల్లో వెలుగు నింపండి... పునర్జన్మ ఎత్తండి’ అంటూ చేసే నినాదాలు దాతలకు ‘ఆత్మ’ఘోషను మిగిలిస్తున్నాయి. అత్యాధునిక మౌలిక వసతులు లేక దాతల హృదయాలు కకావికలమవుతున్నాయి. రాష్ట్రంలో అవయవ దానంపై చైతన్యం పెరుగుతోంది. దాతల వివరాలనూ జీవన్‌దాన్ వెబ్సైట్లో పెడుతున్నారు. ఇప్పటివరకు 8 వేల మంది తాము అవయవదానాలు చేస్తామని వాగ్దానం కూడా చేశారు. కానీ దాతల నుంచి గుండెలను తీసుకొని మార్పిడి చేసే పరిస్థితి, అత్యాధునిక వైద్య సదుపాయాల లేమి రాష్ట్రంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటివరకు 256 మంది దాతల నుంచి అవయవాలు స్వీకరించడానికి వీలు కలిగింది. అందులో 444 కిడ్నీలు, 248 కాలేయాలు, 166 గుండె వాల్వులు, 193 కళ్లు, 5 ఊపిరితిత్తులు బాధితులకు మార్పిడి చేశారు. కానీ బ్రెయిన్ డెడ్ అయిన దాతలు 256 మంది ఉన్నా గుండె మార్పిడి మాత్రం కేవలం 26 మందికే చేయడం గమనార్హం. మరోవైపు ఇదేకాలంలో అనేకమంది గుండె అవసరమైనవారు సకాలంలో గుండె మార్పిడి లేక మృత్యువాత పడ్డారు. ఐదు గంటల్లోగా.. బ్రెయిన్ డెడ్ అయిన దాత నుంచి స్వీకరించే గుండెను ప్రత్యేకమైన అత్యాధునిక నిల్వ సాంకేతిక పరిజ్ఞానంతో తరలించాలి. దాన్ని బాధిత వ్యక్తికి ఐదు గంటల్లోగా అమర్చాలి. అప్పుడే అది విజయవంతం అవుతుంది. దాతల నుంచి వచ్చే గుండెలను బాధితులకు చేరవేయడం ఒక పద్ధతైతే డిమాండ్ మేరకు మార్పిడి చేసే ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు, అత్యాధునిక వైద్యపరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండాలి. కానీ రాష్ట్ర రాజధానిలోనే అటువంటి పరిస్థితి లేదు. నగరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిమ్స్, గాంధీ, మరో నాలుగైదు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. కానీ దాతల నుంచి వచ్చే స్పందనతో పోలిస్తే బాధితులకు గుండె మార్పిడి చేసే సంఖ్య అత్యంత తక్కువ ఉండటం గమనార్హం. ఉదాహరణకు నిమ్స్‌లో గుండెమార్పిడి చేసే ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్లు అవసరం మేరకు లేవు. నిమ్స్‌లో ఇప్పటివరకు కేవలం ఐదు గుండె మార్పిడులు జరిగాయంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఇవన్నీ కొరవడటం వల్లే.. గుండె అవసరమైన బాధితుల రిజిస్టర్‌ను పక్కాగా నిర్వహించాలి. వారిని అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. సీరియల్ ప్రకారం బ్రెయిన్‌డెడ్ అయినవారి నుంచి గుండె తీసుకోవాల్సి వస్తే తక్షణమే సమాచారం ఇచ్చి ఆగమేఘాల మీద బాధితులను పిలిపించి వారికి అమర్చే ప్రక్రియ, పరిజ్ఞానం ఉండాలి. ఇవన్నీ కొరవడటం వల్లే దాతలు, బాధితులున్నా గుండెలు వృథాగా పోతున్నాయి. డిమాండ్‌ను, స్వీకరించే డిమాండ్‌నూ రెండింటినీ ఉపయోగించుకునే వ్యవస్థ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. నిమ్స్‌లో రూ.10.50 లక్షలకు గుండె మార్పిడి చేస్తుండగా, ప్రైవేటులో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు చేస్తున్నారు.