హెల్ప్‌లైన్‌కు కార్పొరేటర్ల మోకాలడ్డు
భివండీ, న్యూస్‌లైన్ : భివండీ కార్పొరేషన్ పట్టణ ప్రజల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ నంబర్ ప్రారంభించనుంది. వివిధ సమస్యలపై ప్రజలు నేరుగా ఆయా విభాగాల అధికారులకు ఫిర్యాదులు చేయడానికి కార్పొరేషన్ కమిషనర్ జీవన్ సోనావణే 997001312 అనే హెల్ప్ లైన్ నంబర్ ప్రాంభించాలని సంకల్పించారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కానీ, కొందరు కార్పొరేటర్ల నుండి వ్యతిరేకత రావడంతో ఇది అటకెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రజలకు ఇబ్బందిలేకుండా..
భివండీ మున్సిపల్ కార్పొరేషన్ 26 కి.మీ. మేర విస్తరించి ఉంది. ప్రజల ఫిర్యాదులు ఏమైనా చేయాలంటే కార్యాలయానికి వ్యయప్రయాసాలకు ఓర్చి రావల్సి వస్తోంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు హెల్ప్ లైన్ ప్రారంభించాలని కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. అందుకు ఆరోగ్య విభాగం-బి 01, విద్యుత్ శాఖ-02, నీటి పారుదల శాఖ-03, నిర్మాణ శాఖ-04, లెసైన్స్ శాఖ-05, టౌన్ ప్లానింగ్ శాఖ-06, పన్ను చెల్లింపు శాఖ-07, అగ్నిమాపక శాఖ-08, ఉద్యాన వన విభాగం-09, వైద్య ఆరోగ్య విభాగం-10 ఇలా ఇంటర్ కామ్ నంబర్లను కేటాయించారు.
కార్పొరేటర్ల వ్యతిరేకత
ప్రజల కోసం హెల్ప్‌లైన్ నంబర్ ప్రారంభించడాన్ని కొందరు కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నెంబర్ వల్ల ప్రజలతో ఉన్న సత్సంబంధాలు దెబ్బతింటాయని కొందరు ఇటీవల జరిగిన మహాసభలో కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. హెల్ప్‌లైన్ నెంబర్ ప్రారంభించడంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దీంతో ఇది ప్రారంభానికి నోచుకొంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేటర్ల తీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ప్రజలకు సౌకర్యం కల్పిస్తాం
కానీ కార్పొరేషన్ కమిషనర్ మాత్రం ప్రజల నుండి ఫిర్యాదులు చేయడానికి ఎలాగైనా సౌకర్యం కల్పిస్తామని అధికారులు అంటున్నారు. ఈ విషయమై జీవన్ సోనావణే‘ న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. ఒకవేళ కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తే ఎస్సెమ్మెస్ సేవలనుఅందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.