Jet Airways Plane
-
విమాన ప్రయాణికుల ముక్కు నుంచి రక్తం
ముంబై : సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జెట్ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. జెట్ ఎయిర్వేస్ 9డబ్ల్యూ 0696 నెంబర్ విమానం గురువారం ఉదయం ముంబై నుంచి జైపూర్ బయలుదేరింది. అయితే విమానం ల్యాండ్ అయ్యే సమయంలో కొందరు ప్రయాణికులకు తీవ్ర తల, చెవినొప్పి రావడమే కాకుండా అకస్మాత్తుగా ముక్కు నుంచి రక్తం రావడంతో భయబ్రాంతులకు గురయ్యారు. విమాన క్యాబిన్లో ఎయిర్ ప్రెజర్‌ను నియంత్రించడం సిబ్బంది మర్చిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దీంతో వెంటనే అత్యవసర ఆక్సిజన్ మాస్క్‌లను ప్రయాణికులు ధరించాల్సివచ్చింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 166 మంది ప్రయాణికులు ఉన్నారు. సిబ్బంది చేసిన తప్పిదం వల్ల ముంబై నుంచి జైపూర్ వెళ్లాల్సిన విమానం కాస్తా, తిరిగి ముంబై వెళ్లాల్సివచ్చింది. ముంబై విమానాశ్రయంలో బాధిత ప్రయాణికులకు చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా.. వ్యవహరించిన కారణంగా ఇప్పటికే పైలట్‌ని సస్పెండ్ చేసి, ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్టు సమాచారం. Panic situation due to technical fault in @jetairways 9W 0697 going from Mumbai to Jaipur. Flt return back to Mumbai after 45 mts. All passengers are safe including me. pic.twitter.com/lnOaFbcaps — Darshak Hathi (@DarshakHathi) 20 September 2018 -
విమానంలో కింగ్స్ సందడి
సాక్షి, చెన్నై : ఐపీఎల్ –2018 సుల్తాన్‌గా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించిన విషయం తెలిసిందే. అద్భుతమైన ఫీల్డింగ్, బౌలింగ్ , బ్యాటింగ్‌తో ధోని సేన అభిమానుల మన్ననల్ని అందుకుంది. చెన్నైకి చేరుకున్న కింగ్స్ సేనకు బ్రహ్మరథం పట్టే రీతిలో అభిమాన లోకం ఆహ్వానం పలికింది. చెన్నైలోని ఓ హోటళ్లో ప్రముఖులు, కింగ్స్ ప్రతినిధులతో సంబరాలు చేసుకున్నారు. అయితే, ముంబై నుంచి చెన్నైకు వచ్చే సమయంలో విమానంలో కింగ్స్ సేన సంబరాల్లో మునిగాయి. ముంబైలో మ్యాచ్ ముగించుకుని సోమవారం జట్టు సభ్యులు చెన్నైకు తిరుగు పయనం అయ్యారు. వాట్సన్‌తో పైలట్ , ఐపీఎల్ కప్‌తో ఆనందం వీరంతా జెట్ ఎయిర్ వేస్‌లో పయనించారు. క్రికెటర్లు తమ విమానంలో పయనిస్తుండడంతో ముందుగానే జెట్ ఎయిర్వేస్ విమాన సిబ్బంది ఏర్పాట్లు చేసుకున్నారు. సొంత గడ్డ చెన్నైలో అడుగు పెట్టనున్న ధోని సేనతో కలిసి విమానంలో విజయోత్సవ ఆనందాన్ని పంచుకున్నారు. కేక్ కట్ చేశారు. కప్‌ను విమాన పైలట్, ఎయిర్ హోస్టస్‌లు చేత బట్టి ఆనందంలో ఉబ్బితబ్బిబ్బ య్యారు. క్రికెటర్లతో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సంబరాల్ని హోరెత్తించారు. కేక్ తినిపిస్తున్న బ్రేవో ,కేక్ కట్ చేస్తున్న వాట్సన్ -
విమానంలో పైలట్ల ఫైటింగ్.. తలకిందులైన ఫేట్
సాక్షి, న్యూఢిల్లీ : విమానంలో తన్నుకున్న ఇద్దరు సీనియర్ పైలట్లపై వేటు పడింది. వారిని ఉన్నఫలంగా విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు జెట్ ఎయిర్వేస్ మంగళవారం ఓ ప్రకటన చేసింది. ఈ విషయాన్ని తాము సీరియస్‌గా పరిగణిస్తున్నామని, మరోసారి ఇలాంటి సంఘటనలకు అవకాశం ఇవ్వొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఏడాది(2018) కొత్త సంవత్సరం ప్రారంభం రోజున (జనవరి 1) లండన్ నుంచి ముంబయికి బయలు దేరిన జెట్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ విమానం 777 (9డబ్ల్యూ 119)లో ఓ సీనియర్ పైలట్, మరో సీనియర్ కోపైలట్ ఘర్షణకు దిగారు. ఇద్దరు కాక్‌పీట్‌ను వదిలేసి తన్నుకుని ప్రయాణీకులను భయబ్రాంతులకు గురిచేశారు. చివరకు సిబ్బంది జోక్యంతో పైలట్లు శాంతించి విమానాన్ని ఎట్టకేలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే, ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన జెట్ ఎయిర్వేస్ ఆదేశించింది. అదే సమయంలో ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు తీవ్రంగా స్పందించి ఆ ఇద్దరు పైలెట్ల లైసెన్స్‌లు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక నుంచి వారు పైలట్లుగా కాకుండా ప్రయాణీకులుగా మాత్రమే విమానాల్లో వెళ్లేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. -
అవాక్కు.. ఫ్లైట్ ఉద్యోగిని బ్యాగులో రూ.3.21కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్ మహిళా ఉద్యోగినిని ఢిల్లీ అధికారులు అరెస్టు చేశారు. అక్రమంగా రూ.మూడు కోట్ల విలువైన అమెరికా డాలర్లను పట్టుకెళుతున్న ఆమెను ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హాంకాంగ్‌కు చెందిన జెట్ ఎయిర్వేస్ విమానం సోమవారం రాత్రి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. డీఆర్ఐ అధికారులు ఆ సమయంలో తనిఖీ చేయగా జెట్ ఎయిర్వేస్ సిబ్బందిలోని ఒకరి వద్ద ఉన్న సూట్ కేసులో రూ.3.21కోట్ల విలువైన అమెరికన్ డాలర్లు లభించాయి. దీంతో ఆమెను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసుపై లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. -
విమానం వదిలేసి చెంపలు వాయించుకున్నారు
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్ వేస్ విమానం ఒకటి పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. విమానం నడుపుతున్న ఇద్దరు సీనియర్ పైలట్లు విమానం గాల్లో ఉండగానే తన్నుకోవడం మొదలుపెట్టారు. కాక్‌పీట్‌లోనే వారు ఒకరితో ఒకరు గొడవపడి దెబ్బలాడుకున్నారు. అయితే, ఎలాంటి ప్రమాదం జరగకుండానే చివరకు విమానాన్ని జాగ్రత్తగా కిందికి దించారు. ఈ సంఘటన జనవరి 1న లండన్ నుంచి ముంబయి మధ్య నడిచే జెట్ ఎయిర్ వేస్ విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోయింగ్ 777 విమానం 324మంది ప్రయాణీకులు, 14మంది సిబ్బందితో బ్రిటన్ కాలమానం ప్రకారం జనవరి 1న ఉదయం పదిగంటలకు నూతన సంవత్సరం రోజే ముంబయికి బయలు దేరింది. మొత్తం తొమ్మిదిగంటలపాటు సాగే ఈ ప్రయాణం మధ్యలో విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత ఇద్దరు పైలట్లకు గొడవ అయింది. కాక్‌పీట్ కెప్టెన్ కోపైలట్‌ను చెంపచెల్లుమనిపించాడు. దీంతో ఆమె ఏడుస్తూ కాక్‌పీట్ నుంచి బయటకొచ్చింది. కిచెన్‌లోకి వెళ్లి బోరుమని ఏడ్వడం ప్రారంభించింది. అయితే, ఇతర సిబ్బంది ఆమెను ఓదార్చి తిరిగి కాక్‌పీట్‌లోకి పంపించారు. అప్పటికే కెప్లెన్ కూడా ఆమెను కాక్‌పీట్‌లోకి పంపించాలని సిబ్బందిని పదేపదే కోరినట్లు సమాచారం. అనంతరం కూడా వారిద్దరు తీవ్రంగా మరోసారి గొడవపడటం అసలు కాక్‌పీట్‌ను ఇద్దరు వదిలేయడం జరిగింది. దీంతో కోపైలెట్ మరోసారి అందులోకి వెళ్లేందుకు నిరాకరించగా ప్రయాణీకులను సురక్షితంగా చేర్చాలన్న సిబ్బంది వేడుకోలు మేరకు ఆమె అంగీకరించింది. ఎట్టకేలకు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ గొడవను జెట్ ఎయిర్ వేస్ అధికారులు కూడా ధ్రువీకరించారు. వారిద్దరి మధ్య సమాచార బదిలీ లోపం కారణంగా ఈ సమస్య ఏర్పడినట్లు ప్రాథమికంగా తెలిపారు. -
శాంసంగ్‌ను వీడని పేలుడు కష్టాలు
సాక్షి, న్యూఢిల్లీ: కొరియా మొబైల్‌దిగ్గజం శాంసంగ్‌ను స్మార్ట్‌ఫోన్ పేలుడు కష్టాలు వీడడం లేదు. తాజాగా ఢిల్లీనుంచి ఇండోర్‌కు బయలుదేరిన జెట్ ఎయిర్వేస్ విమానంలో పేలిన మొబైల్ శాంసంగ్ గెలాక్సీ జె 7 గా తేలింది. శాంసంగ్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించింది. హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, శాంసంగ్ గెలాక్సీ జె7 డివైస్ ఢిల్లీ- ఇండోర్ జెట్ ఎయిర్వేస్ విమానంలో పేలిపోయింది. ఈ ప్రమాదంపై శాంసంగ్ ఇండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ మరింత సమాచారం కోసం సంబంధిత అధికారులతో చర్చిస్తున్నామనీ, కస్టమర్ భద్రతే తమ ప్రధాన ప్రాధాన్యత అని ప్రకటించారు. 120 మంది ప్రయాణీకులతో విమానం బయలుదేరిన 15 నిమిషాలకే ఈ పేలుడు సంభవించింది. ఒక ప్రయాణికురాలి హ్యాండ్‌బ్యాగులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా అకస్మాత్తుగా మంటలంటుకొని, పొగలు వ్యాపించడంతో ప్రయాణీకులు భయాందోళనలకు లోనయ్యారు. అయితే సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు విమానంలో ఉన్న అగ్నిమాపక పరికరం చేయకపోవడంతో.. నీళ్లు చల్లి మంటల్ని అదుపు చేయడం మరో వివాదానికి దారి తీసింది. అటు డీజీసీఎస్ మార్గదర్శకాలన్నింటినీ తాము పాటిస్తున్నామని ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. కాగా గత ఏడాది శాంసంగ్ నోట్ 7 పేలుళ్లతో కంపెనీ తీవ్ర నష్టాలను మూటగట్టుకుంది. ఈ క్రమంలో చాలా గ్యాప్ తరువాత ఇటీవల శాంసంగ్ ఎస్ 8, గెలాక్సీ్ నోట్ 8 ను లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ విమానంలో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ పేలడం కలకలం రేపింది. -
పేలిన స్మార్ట్‌ఫోన్..బెంబేలెత్తిన ప్రయాణికులు
న్యూడిల్లీ: ఢిల్లీనుంచి బయలుదేరిన జెట్ ఎయిర్వేస్ విమానంలో సడెన్‌గా కలకలం రేగింది. 80 మంది ప్రయాణికులతో ఇండోర్ వెళుతున్న విమానంలో ఉన్నట్టుండి దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రయాణీకుల పై ప్రాణాలు పైనే పోయాయి. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది,కారణాలను కనుక్కొని ప్రయాణికులను శాంతింప చేశారు. ఒక ప్రయాణీకురాలి హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న మొబైల్ ఫోన్ పేలడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ నుంచి ఇండోర్ వెడుతున్న జెట్ ఎయిర్ వేస్ విమానంలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలో ప్యాకేజింగ్ బిజినెస్ చేస్తున్న , ఢిల్లీలో మాయూర్ విహార్-ఐకి చెందిన అతుల్ ధాల్ , భార్య అర్పితా ధాల్, 18 నెలల వయసున్న కుమారుడు , తండ్రితో కలిసి దీపావళి పండుగకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. స్నాక్స్ ఇస్తుండగా పొగ అలుముకోవడాన్ని విమాన సిబ్బంది గమనించారు. వెంటనే సీటు కిందనుంచి బ్యాగును బయటకుతీసి, ఇతర ప్రయాణీకుల సాయంతో మంటల్ని ఆర్పారు. తమ సీటు కిందనుంచి శబ్దం రావడంతోపాటు, బాగా పొగరావడాన్ని గమనించామని అతుల్ ధాల్ తెలిపారు. బ్యాగులో ఉన్న మొత్తం మూడు సెల్ఫోన్లు ఉండగా, అందులో ఒకటి పేలిదంటూ వివరించారు. ఈ సంఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు నివేదించామని జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. డీజీసీఏ సూచించిన మార్గదర్శకాల ప్రకారం అన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నామనీ, మొబైల్ పరికరాన్ని తదుపరి దర్యాప్తు కోసం కస్టడీలోకి తీసుకున్నామని . మరోవైపు పేలిన స్మార్ట్‌ఫోన్ ఏ కంపెనీది తదితర వివరాలను మాత్రం వెల్లడించలేదు. -
పక్షి ఢీ.. దెబ్బతిన్న విమాన ఇంజిన్
కోల్‌కతా: బెంగళూరు నుంచి బయలుదేరిన విమానానికి ప్రమాదం తప్పింది. కోల్‌కతాలోని ఎన్ఎస్సీ బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుండగా దానికి ఓ పక్షి తగిలింది. తొలుత కంగారుపడిన పైలెట్ అనంతరం సురక్షితంగా దించివేశాడు. దీనిపై ఎయిర్పోర్ట్ అధికారులు స్పందిస్తూ జెట్ ఎయిర్వేస్కు చెందిన విమానం బెంగళూరు నుంచి వచ్చి కోల్‌కతాలో దిగుతుండగా పక్షి ఢీకొందని, దీంతో దాని కుడివైపు ఉన్న ఇంజిన్ దెబ్బతిందని, సురక్షితంగానే విమానం దిగిందని చెప్పారు. ప్రస్తుతం ఇంజిన్‌కు మరమ్మత్తులు నిర్వహిస్తున్నామని, తిరిగి వెళ్లేందుకు టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు వేరే విమానం ఏర్పాటుచేసినట్లు చెప్పారు. -
గగనతలంలో తప్పిన పెను ప్రమాదం
-
గగనతలంలో తప్పిన పెను ప్రమాదం
లండన్ : జర్మనీ గగనతలంలో జెట్‌ఎయిర్‌వేస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి లండన్ బయలుదేరిన బోయింగ్777 విమానానికి ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన జర్మనీ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన రెండు ఫైటర్ జెట్లు బోయింగ్777 విమానానికి ఎస్కార్ట్‌గా వచ్చాయి. అనంతరం కొద్దిసేపటికి ఏటీసీతో సంబంధాలు పునరుద్ధరించారు. చివరకు క్షేమంగా లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. అయితే మూడు రోజుల కిందట జరిగిన ఈ సంఘటనకు సంబధించి వీడియో ఫూటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రెండు జర్మనీకి చెందిన ఫైటర్ జెట్లు బోయింగ్777 విమానానికి ఎస్కార్టుగా వచ్చిన దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 335 మంది ప్రయాణికులతో పాటూ 15 మంది సిబ్బంది ఉన్నారు. -
రన్‌వే నుంచి పక్కకు జారిపోయిన విమానం..
ఇండోర్: ల్యాండ్ అవుతోన్న విమానం ఒక్కసారిగా రన్ వే నుంచి పక్కకు జరిపోయింది. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్న 66 మంది ప్రయాణికులు చివరకు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇండోర్ విమానాశ్రయంలో శనివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. జెట్ ఎయిర్ వేస్ కు చెందిన 9డబ్ల్యూ 2793 విమానం 66 మంది ప్యాసింజర్లతో ఢిల్లీ నుంచి ఇండోర్ కు వచ్చింది. సిమెంట్ సర్ఫేస్ రన్ వేపై ల్యాండ్ అవుతుండగా పక్కకు జారిపోయిందని, నలుగురు సిబ్బంది సహా 66 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. వాహనాల ద్వారా ప్రయాణికులను టెర్మినల్ కు తరలించామని, తుప్పల్లోకి జారిపోయిన విమానాన్ని ఇంజనీర్లు పరీక్షిస్తున్నారని పేర్కొంది. -
జెట్ విమానం అత్యవసర లాండింగ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జెట్ ఎయిర్వేస్కు చెందిన డెహ్రడూన్- ఢిల్లీ విమానం అత్యవసరంగా దింపేయాల్సి వచ్చింది. 45 మంది ప్రయాణికులతో డెహ్రడూన్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన విమానంలో ఇందనం కొరత సమస్య తలెత్తింది. అప్రమత్తమైన పైలట్.. జెట్ ఎయిర్వేస్ అధికారులకు సమాచారం అందించాడు. అధికారుల సూచన మేరకు చౌదరి చారణ్ సింగ్(సీసీఎస్) విమానశ్రయంలో జెట్ విమానాన్ని అత్యవసర పరిస్థితిలో దింపేశారు. అయితే విమానంలో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారంటూ సీసీఎస్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ విలేకరులతో చెప్పారు. -
ఏడు హెవీ బ్యాగులతో ఎగిరిపోయారు!
న్యూఢిల్లీ: బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత బుధవారం(మార్చి 2)న ఆయన విదేశాలకు పారిపోయినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ-లండన్ జెట్ ఎయిర్ వేస్ విమానం 9డబ్ల్యూ 122లో బ్రిటన్ కు వెళ్లిపోయినట్టు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఆయన వెంట ఒక మహిళ ఉన్నారని, ఫస్ట్ క్లాస్ లో ఆయన ప్రయాణించినట్టు తెలిపారు. మాల్యా భారీగా లగేజీ తీసుకెళ్లారని చెప్పారు. 'మాల్యా తనకు చెందిన ఏడు బ్యాగులను తనిఖీ చేయించుకున్నారు. మాల్యా, ఆయనతో పాటు విమానంలో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించివారికి సహాయ సేవలు అందించడం జరిగింద'ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఉత్తర లండన్ లోని హెర్త్ ఫోర్ షైర్ లో ఉన్న తన నివాసంలో మాల్యాను స్థానికులు గుర్తించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి పబ్ లకు వెళ్లే మాల్యా ఈసారి గడప దాటి బయటకు రాలేదని చెబుతున్నారు. ఆయనను భారత్ కు రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. -
విమానం దిగుతుండగా.. గేర్ ఫెయిలైంది!
ముంబై: 127 మంది ప్రయాణికులతో బయలుదేరిన జెట్ ఎయిర్వేస్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ముంబైలో గురువారం విమానం దిగుతుండగా.. ఒక్కసారిగా ల్యాండింగ్ గేర్ బద్దలైంది. దీంతో ముంబై విమానాశ్రయంలోని ప్రధాన రన్‌వే పూర్తిగా బ్లాక్ అయింది. అదృష్టంకొద్దీ ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి హాని జరుగలేదు. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దింపినట్టు జెట్ ఎయిర్వేస్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీ నుంచి వచ్చిన విమానం ముంబైలోని ప్రధాన రన్‌వేపై దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విమానాశ్రయ అధికారులు సెంకడరీ రన్‌వే మీదుగా ఫ్లయిట్ ఆపరేషన్స్ చేపట్టారు. బోయింగ్ 737 విమానమైన 9డబ్ల్యూ 354లో సాంకేతిక లోపం తలెత్తిందని, ఈ లోపాన్ని సరిచేయడానికి ఇంజినీర్ల బృందం తనిఖీలు జరుపుతున్నదని జెట్ ఎయిర్వేస్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాన రన్‌వేపై ఆగిపోయిన విమానాన్ని తరలించేందుకు అవసరమైన చర్యలను ఇంజినీర్ బృందం తీసుకుంటున్నదని గురువారం నాటి ప్రకటనలో పేర్కొంది. విమానం ల్యాండింగ్ గేర్ చెడిపోయినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని, దానిని సరిచేసి.. విమానాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. -
భారత విమానానికి బాంబు బెదిరింపు.. దించివేత
మస్కట్: విమానాలకు వరుసగా వస్తున్న బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. మొన్న టర్కీష్ ఎయిర్ వేస్ కు చెందిన విమానంలో బాంబు ఉందని హెచ్చరికలు రావడంతో ఢిల్లీలో ల్యాండింగ్ చేసి తనిఖీలు చేయగా.. తాజాగా భారత్‌కు చెందిన విమానానికి కూడా అలాంటి బెదిరింపే వచ్చింది. దీంతో ముంబయి నుంచి దుబాయ్ వెళుతున్న భారత జెట్ ఎయిర్ వేస్ 9డబ్ల్యూ 536 విమానాన్ని అనూహ్యంగా మస్కట్‌లో దించివేశారు. విమానంలో బాంబు ఉన్నట్లు హెచ్చరికలు రావడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇందులో 54మంది ప్రయాణీకులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. వీరంతా క్షేమంగా బయటపడ్డారు.