విమానం దిగుతుండగా.. గేర్ ఫెయిలైంది!
ముంబై: 127 మంది ప్రయాణికులతో బయలుదేరిన జెట్ ఎయిర్‌వేస్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ముంబైలో గురువారం విమానం దిగుతుండగా.. ఒక్కసారిగా ల్యాండింగ్ గేర్ బద్దలైంది. దీంతో ముంబై విమానాశ్రయంలోని ప్రధాన రన్‌వే పూర్తిగా బ్లాక్ అయింది. అదృష్టంకొద్దీ ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి హాని జరుగలేదు. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దింపినట్టు జెట్ ఎయిర్‌వేస్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీ నుంచి వచ్చిన విమానం ముంబైలోని ప్రధాన రన్‌వేపై దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
దీంతో విమానాశ్రయ అధికారులు సెంకడరీ రన్‌వే మీదుగా ఫ్లయిట్ ఆపరేషన్స్ చేపట్టారు. బోయింగ్ 737 విమానమైన 9డబ్ల్యూ 354లో సాంకేతిక లోపం తలెత్తిందని, ఈ లోపాన్ని సరిచేయడానికి ఇంజినీర్ల బృందం తనిఖీలు జరుపుతున్నదని జెట్ ఎయిర్‌వేస్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాన రన్‌వేపై ఆగిపోయిన విమానాన్ని తరలించేందుకు అవసరమైన చర్యలను ఇంజినీర్ బృందం తీసుకుంటున్నదని గురువారం నాటి ప్రకటనలో పేర్కొంది. విమానం ల్యాండింగ్ గేర్ చెడిపోయినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని, దానిని సరిచేసి.. విమానాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది.