Jharkhand Vikas Morcha (Prajatantrik)
-
సోరేన్ సర్కారుకు మద్దతు ఉపసంహరణ
రాంచి: జార్ఖండ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దాదాపు నెల రోజుల క్రితం జేఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణ సర్కారులో చేరిన జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం) కూటమి నుంచి బయటకు వచ్చింది. హేమంత్ సోరేన్‌కు మద్దతు ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది. తమ పార్టీని చీల్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జేవీఎం అధ్యక్షుడు బాబులాల్ మారాండీ తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌కు ఆయన లేఖ రాశారు. ‘మీ నేతృత్వంలోని (హేమంత్ సోరేన్) ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇస్తూ మా పార్టీ జార్ఖండ్ వికాస్ మోర్చా డిసెంబర్ 24, 2019న లేఖ ఇచ్చింది. కానీ కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని జేవీఎంను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు దినపత్రికలు ఈరోజు ప్రముఖంగా ప్రచురించాయి. ఈ నేపథ్యంలో మీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించామ’ని లేఖలో బాబులాల్ మారాండీ పేర్కొన్నారు. జేవీఎం ఎమ్మెల్యేలు ప్రదీప్ యాదవ్, బంధు టిక్రీ.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసినట్టు వార్తలు రావడంతో వీరిద్దరూ కాంగ్రెస్‌లో చేరతారని ఊహాగానాలు రేగాయి. రాహుల్ గాంధీ, జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్చార్జి ఆర్పీఎన్ సింగ్‌లను కూడా వారు కలవడంతో ఊహాగానాలకు బలం చేకూరింది. ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేవీఎం మూడు స్థానాల్లో గెలిచింది. ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్లిపోతే ఒక్కరు మాత్రమే ఆ పార్టీలో మిగులుతారు. కాగా, జేవీఎం మద్దతు ఉపసంహరించుకున్నా హేమంత్ సోరేన్ సర్కారు ఎటువంటి ముప్పులేదు. -
బీజేపీలో జేవీపీ విలీనం
రాంచి: జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీపీ-ప్రజాతాంత్రిక్)లోని ఒక వర్గం బుధవారం లాంఛనంగా బీజేపీలో విలీనమైంది. కేపీ శర్మ అధ్యక్షతలోని జేవీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు- సర్మేశ్ సింగ్, చంద్రికా మహతా, జై ప్రకాశ్ భోక్తా, నిర్భయ్ సహవాది, పూల్‌చంద్ మండల్ బీజేపీలో చేరారు. రాంచీలోని పార్టీ కార్యాలయంవద్ద జరిగిన కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నేత అర్జున్ ముండా, పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్, జార్ఖండ్ శాఖ అధ్యక్షుడు రవీంద్ర రాయ్ వారిని పార్టీలోకి స్వాగతించారు. జేవీపీ-ప్రజాతాంత్రిక్ అధ్యక్షుడు బాబూలాల్ మారాండీ కూడా బీజేపీలో చేరాలని అర్జున్ ముండా విజ్ఞప్తి చేశారు.