జీవితమంటే సినిమా కాదురయ్యా : వెంకటేశ్
తన ముప్పై ఏళ్ల సినీ ప్రస్థానంలో తొలిసారి హీరో వెంకటేశ్ గురు చిత్రంలో సింగర్ అవతారం ఎత్తాడు. చిత్రంలో మద్యం సేవించిన తర్వాత హీరో ఈ పాట పాడుతాడు. సంతోష్ నారాయణన్ అందించిన బాణీలకు తగ్గట్టుగా వెంకీ ఈ పాటను అద్భుతంగా పాడారు. వెంకటేశ్ తన ఫేస్ బుక్ పేజీలో ఈ పాటను పోస్ట్ చేసిన కొద్ది సేపటికే లైకులు షేర్లతో అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నటనతోనే కాకుండా గాయకుడిగా కూడా వెంకీ అదరగొట్టారు అంటూ అభిమానులు తెగ సంబరపడుతున్నారు.
బాధలు మరిచిపోవడానికి పీతల్లా తాగుతున్నారు కానీ, హార్ట్, లివర్ దొబ్బుతుందని, ఆరోగ్యం షెడ్డుకెళుతుందని జిందగీ బర్బాస్ అవుతుందని తెలుసుకోరే...జీవితమంటే సినిమా కాదురయ్యా ప్రతీదీ సెన్సార్ బోర్డు చూసుకోవడానికి.. దూమపానం, మద్యపానం మహచెడ్డదిరా అబ్బాయ్ అని ఎంత చెప్పినా వినరే..మీలాంటి వాళ్లకోసమే యముడి పక్కసీటు రెడీగా ఉంది.. బయలుదేరండి బయలు దేరండి...అంటూ ఓ సందేశం ఇస్తూ వాయిస్ ఓవర్ పూర్తవ్వగానే పాట మొదలౌతుంది.
క్వాటరు బాటిలు జానెడున్న మ్యాటరు బోలెడున్నది.. అంటూ హీరో మందు తాగిన తర్వాత వచ్చే సాంగ్ కావడంతో అదే తరహాలో జింగిడి జింగిడి... అంటూ మ్యూజిక్కు తగ్గట్టుగా పాడి వెంకి మ్యాజిక్ చేశాడు.
‘గురు’ షూటింగ్‌ను వెంకటేశ్ ఎప్పుడో పూర్తి చేశారు. కానీ, విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తుందని చెబుతున్నారు. మధ్య మధ్యలో ఒక్కో సాంగ్‌ను విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల ఎందుకింత ఆలస్యమవుతోందనేది ప్రేక్షకులకు అంతుచిక్కని ఓ పజిల్లా తయారయింది. ఫిల్మ్‌నగర్‌లో మాత్రం ‘రెజ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఆమిర్‌ఖాన్ ‘దంగల్’ సూపర్ హిట్టయింది. వెంకీ ‘గురు’ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. అయితే... రెండూ స్పోర్ట్స్ మూవీస్ కాబట్టి ప్రేక్షకులు రెండిటి మధ్య ఎక్కడ పోలికలు వెతుకుతారోననే ఆలోచనతో ఈ చిత్రం విడుదల ఆలస్యం చేస్తున్నారు’ అనే గాసిప్ వినిపిస్తోంది. ‘గురు’ యూనిట్ ఈ గాసిప్‌ను ఖండించింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉందంటున్నారు. డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ థియేటర్ల నుంచి ప్రేక్షకులు చూసే థియేటర్లకు రావడానికి ఎంతో టైమ్ పట్టదని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకు సుధ కొంగర దర్శకత్వం వహిస్తుండగా నిర్మాతగా ఎస్. శశికాంత్ వ్యవహరిస్తున్నారు.