JMD ramana rao
-
మేడారానికి పోటెత్తిన లక్షలాది భక్తులు
మేడారం: వరంగల్ జిల్లా మేడారం పండుగ కళను సంతరించుకుంది. అతిపెద్ద గిరిజనోత్సవమైన సమ్మక్క సారలమ్మ వేడుక ప్రారంభమైన తొలిరోజున భారీ సంఖ్యలో తరలివచ్చారు. జాతర నేపథ్యంలో ప్రత్యేకంగా తెలంగాణ ఆర్టీసీ 2,745 బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం కల్పించిన బస్సు సర్వీసుల సాయంతో సాయంత్రం ఆరు గంటల వరకు 1,24,238 మంది భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారని టీఎస్ ఆర్టీసీ జేఎండీ జీవీ రమణారావు తెలిపారు. ఈ నెల 20 వరకు కన్నుల పండువగా ఈ జాతర కొనసాగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. -
‘సెస్’ వినియోగంపై ఆర్టీసీ దృష్టి
ఆర్టీసీ జేఎండీ రమణరావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల నుంచి ప్రతి టికెట్‌పై వసూలు చేసే సెస్‌ను నిర్దేశిత లక్ష్యం కోసం ఖర్చు పెట్టే విషయంపై ఆర్టీసీ దృష్టి సారించింది. బస్టాండ్ల వారీగా అవసరాలు, సమస్యలను గుర్తించి వాటి తక్షణ పరిష్కారం కోసం ఆ నిధులు విడుదల చేస్తోంది. ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందుల తక్షణ పరిష్కారం కోసం పల్లె వెలుగు మినహా మిగతా బస్సుల్లో ప్రతి టికెట్‌పై రూపాయి చొప్పున వసూలు చేసే సెస్ దారిమళ్లుతున్న తీరుపై మూడు రోజుల క్రితం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి ఆర్టీసీ జేఎండీ రమణారావు మంగళవారం వివరణ ఇచ్చారు. సెస్ మొత్తాన్ని ప్రయాణికులకు వసతులు కల్పించటం, సమస్యలు పరిష్కరించేందుకు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెస్ రూపంలో వసూలయ్యే మొత్తంలో రూ.21 కోట్లను తక్షణ సమస్యల పరిష్కారానికి కేటాయించినట్టు చెప్పారు. ఇందులో రూ.7 కోట్లు మరమ్మతులకు, పారిశుధ్య పనుల నిర్వహణకు, తాగునీటి వసతి మెరుగుకు, రూ.14 కోట్లను బస్సు స్టేషన్ల విస్తరణ, సీసీ పేవ్‌మెంట్స్‌కు కేటాయించినట్టు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఆర్టీసీ నష్టాలు పెరగడం, పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా అభివృద్ధి పనులు, వారి అవసరాలకు నిధులు కేటాయించలేకపోతున్నట్టు పేర్కొన్నారు. దీంతోనే సెస్‌ను అమల్లోకి తెచ్చినట్టు వివరించారు. -
ఆర్టీసీ రెండు ముక్కలు
* టీఎస్ ఆర్టీసీ - ఏపీఎస్ ఆర్టీసీ ఇక వేరువేరుగా * పరిపాలన సౌలభ్యం కోసం అధికారుల పంపిణీ * తేలని ఉమ్మడి ఆస్తులు, అప్పుల వ్యవహారం * షీలాభిడే కమిటీ పరిధిలో ఈ అంశం * మరో రెండు నెలల్లో పరిష్కారమయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఆర్టీసీ రెండుగా విడిపోయింది. పరిపాలన సౌలభ్యం కోసం ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీగా మారాయి. ఇక నుంచి ఏ కార్పొరేషన్ అధికారులు ఆ కార్పొరేషన్ పరిధిలోనే పనిచేస్తారు. దీనికి వీలుగా ఆర్టీసీలోని సీనియర్ స్కేల్ ఆఫీసర్లు, జూనియర్ స్కేల్ ఆఫీసర్లను రెంటి మధ్య పంపిణీ చేశారు. 4 నుంచి పదో తరగతి చదివిన ప్రాంతం ప్రకారం ‘స్థానికత’ ఆధారంగా ఈ పంపకాలు జరి గాయి. 2 నెలల క్రితం ఈ కసరత్తు ప్రారంభించిన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు స్థానికత ఆధారంగా ఈ పంపకాలు చేస్తూ ప్రొవిజినల్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఆప్షన్లకూ అవకాశం ఇవ్వటం వివాదాస్పదమైంది. ఎక్కడివారు అక్కడే పనిచేయాలని తెలంగాణ అధికారులు పట్టుపట్టడంతో... తొలుత జారీ చేసిన ప్రొవిజినల్ ఉత్తర్వులనే అమలు చేస్తూ బుధవారం నిర్ణయించారు. దీంతో ఆప్షన్ల ప్రమేయం లేకుండా స్థానికత ఆధారంగా ఎక్కడి వారు అక్కడే విధులు నిర్వహించేలా ఆదేశాలు వెలువడ్డాయి. ఆంధ్రాకి చెందినవారు ఏపీఎస్ ఆర్టీసీ పరిధిలో, తెలంగాణకు చెందినవారు టీఎస్ ఆర్టీసీ పరిధిలో విధులు నిర్వహిస్తారు. ఉమ్మడి ఆర్టీసీ ఎండీ సాంబ శివరావు ఇక ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా, టీఎస్ ఆర్టీసీ జేఎండీ రమణరావు టీఎస్ ఆర్టీసీ ఎండీగా (హోదా జేఎండీ)గా వ్యవహరిస్తారు. బస్‌భవన్‌లోని ‘ఎ’ బ్లాకును ఏపీఎస్ ఆర్టీసీకి, ‘బి’ బ్లాక్‌ను టీఎస్ఆర్టీసీకి ఇప్పటికే కేటాయించారు. ప్రస్తుత ఎండీ సాంబశివరావు తన చాంబర్ ఖాళీ చేసి ఆర్టీసీ చైర్మన్ పేరుతో ఉన్న చాంబర్ నుంచి విధులు నిర్వహిస్తారు. డిపోల వారీగా నమోదయ్యే ఆదాయ వ్యయాలను ఇప్పటికే ఏ రాష్ట్రానివి ఆ రాష్ట్రం ఖాతాలోనే జమ చేస్తున్నారు. నగరంలోని ఆర్టీసీ ఉమ్మడి ఆస్తులు, అప్పుల విభజన షీలాభిడే కమిటీ పరిధిలో ఉంది. మరో 2 నెలల్లో అది కూడా తేలిపోనుంది. బస్సుల పర్మిట్ల లెక్కలు కూడా తేలాలి. అప్పటివరకు బస్సు లు ఏపీఎస్ఆర్టీసీ పేరుతోనే కొనసాగుతాయి. ప్రపంచంలో ఎక్కువ బస్సులు నిర్వహిస్తున్న సంస్థగా ఏపీఎస్ఆర్టీసీ పేర ఉన్న గిన్నిస్ రికార్డు బస్సుల పంపకం జరిగితే మహారాష్ట్ర ఆర్టీసీ పరమవుతుంది. ఈడీల కేటాయింపు ఇలా... టీఎస్ ఆర్టీసీ జేఎండీ రమణరావు ఎండీ విధులతోపాటు ఆపరేషన్స్ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం బస్‌భవన్‌లో విధులు నిర్వహిస్తున్న ఈడీ రవీందర్‌ను అక్కడే కొనసాగించాలని నిర్ణయించారు. మరే అధికారికి హెడ్ ఆఫీసు ఈడీ పోస్టింగ్ ఇవ్వనందున ఈ ఇద్దరే ప్రధాన బాధ్యతలను పంచుకుని నిర్వహించే అవకాశం ఉంది. కరీంనగర్ జోన్, గ్రేటర్ హైదరాబాద్ జోన్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈడీ పురుషోత్తమ్ నాయక్ నుంచి కరీంనగర్ బాధ్యత తప్పించారు. సికింద్రాబాద్ ఆర్ఎంగా ఉన్న సత్యనారాయణకు ఈడీగా పదోన్నతి కల్పించి కరీంనగర్ జోన్ ఈడీ బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ జోన్ బాధ్యతను మరో ఈడీ నాగరాజు చూస్తారు. ఇక ఏపీఎస్ ఆర్టీసీలో ఈడీ వెంకటేశ్వరరావుకు పరిపాలన, ఈడీ జయరావు ఆపరేషన్స్, కోటేశ్వరరావు ఇంజనీరింగ్‌తో పాటు కడప జోన్ బాధ్యతలు చూస్తారు. బస్ చాసిస్, బాడీ యూనిట్ సీఎంఈగా ఉన్న రవీంద్రబాబుకు ఈడీగా పదోన్నతి కల్పించి విజయవాడ జోన్‌కు కేటాయించారు. -
కదిలారు.. వదిలారు..
టీఎస్ ఆర్టీసీలో 270 మంది అధికారుల బదిలీ సాక్షి, హైదరాబాద్: ఒకే డిపోలో చిన్న స్థాయి నుంచి వరస పదోన్నతులతో మేనేజర్లుగా ఉన్నత పదవుల్లో పాతుకుపోయిన అధికారులకు ఎట్టకేలకు స్థానచలనం కలిగింది. దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులందరినీ మారుస్తూ ఆర్టీసీ జేఎండీ రమణరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘కదలరు... వదలరు’ శీర్షికతో ఇటీవల ప్రచురించిన ‘సాక్షి’ కథనానికి స్పందనగా 270 మంది అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని 94 డిపోల్లో 67 డిపో మేనేజర్లను బదిలీ చేశారు. అదే ర్యాంకులో ఉన్న మరో 50 మందినీ మార్చారు. ఒకే డిపోలో దశాబ్దానికి పైగా పనిచేస్తున్న చాలా మంది అధికారుల్లో చురుకుదనం లేదని ఆర్టీసీ ఉన్నతాధికారులు గుర్తించారు. ఆయా డిపోలు మొక్కుబడిగా ముందుకు సాగుతున్నాయి. వాటి పరిధిలో ఆదాయం పెరగటం లేదు. దీన్ని వివరిస్తూ ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన రమణరావు అలాంటి అధికారుల బదిలీకి కసరత్తు మొదలుపెట్టి వేగంగా పూర్తి చేశారు. వారందరికీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారి బదిలీతో పాటు కొందరు అధికారులకు కూడా పదోన్నతులు కల్పించి పోస్టింగ్స్ ఇచ్చారు. కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్‌గా ఉన్న కృష్ణహరికి పదోన్నతి కల్పించి నల్లగొండ ఆర్ఎంగా నియమించారు. నల్లగొండ ఆర్ఎంగా ఉన్న రవీందర్‌ను మెదక్ ఆర్ఎంగా బదిలీ చేశారు. -
టీఎస్ఆర్టీసీ జోన్లకు టీ అధికారులే బాధ్యులు
* కీలక నిర్ణయం తీసుకున్న జేఎండీ రమణారావు * ఏపీకి చెందిన జయరావుకు ‘గ్రేటర్’ జోన్ బాధ్యతల తొలగింపు * విభజనను వాయిదా వేసిన ఎండీ చర్యకు కౌంటర్? సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో మళ్లీ విభజన చిచ్చు రాజుకుంది. స్థానికత ఆధారంగా ఏ రాష్ట్రానికి చెందిన అధికారులను ఆ రాష్ట్ర ఆర్టీసీకి కేటాయిస్తూ సిబ్బంది విభజన పూర్తి చేయాల్సిన తరుణంలో దాన్ని ఎండీ సాంబశివరావు వాయిదా వేయడాన్ని తెలంగాణ ఆర్టీసీ అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎండీ నిర్ణయానికి పరోక్షంగా కౌంటర్ ఇస్తూ ఆర్టీసీ జేఎండీ రమణారావు ఈడీలకు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో భౌగోళికంగా ఏపీకి చెంది ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ పరిధి లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)గా పనిచేస్తున్న జయరావు విధుల్లో కోత పెట్టారు. ఏపీఎస్ ఆర్టీసీ ఇంజనీరింగ్ విభాగం ఈడీగా పనిచేస్తున్న జయరావుకు అదనంగా గ్రేటర్ హైదరాబాద్ జోన్ బాధ్యత కూడా ఉంది. దాన్ని తొలగిస్తూ టీఎస్ ఆర్టీసీ జేఎండీ ఉత్తర్వు జారీ చేశారు. ప్రస్తుతం కరీంనగర్ ఈడీగా ఉన్న పురుషోత్తం నాయక్‌కు ఆ బాధ్యతను అదనంగా అప్పగించారు. ఇటీవలే విజయవాడ నుంచి టీఎస్ఆర్టీసీకి వచ్చిన ఈడీ నాగరాజుకు హైదరాబాద్ జోన్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఈ జోన్‌ను పురుషోత్తం నాయక్ పర్యవేక్షిస్తున్నారు. వెరసి తెలంగాణ ఆర్టీసీ పరిధిలోని జోన్లకు తెలంగాణ అధికారులే ఉండేలా రమణారావు వ్యవహరించ టం విశేషం. వాస్తవానికి గురువారం నాటికి అధికారుల కేటాయింపు పూర్తి కావాలి. ఈ తరుణంలో ఆప్షన్ల అంశాన్ని తెరపైకి తెస్తూ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు దాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. టీఎస్ఆర్టీసీకి జేఎండీగా ఉన్న రమణరావుకు ఎండీ అధికారాలను తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కట్టబెట్టింది. కానీ ఆయన ప్రమేయం లేకుండానే ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ మెమో జారీ చేయడాన్ని తెలంగాణ అధికారులు ఏకపక్ష నిర్ణయమంటున్నారు. ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలిసిన పోలవరం ముంపు ప్రాంతానికి చెందిన జయరావు తెలంగాణలోనే పనిచేస్తానని ఆప్షన్ ఇచ్చినా ఆయన్ని తెలంగాణ జోన్ బాధ్యతల నుంచి తప్పించడం విశేషం. ఈడీ నాగరాజు మస్టర్ రోల్ క్లోజ్ చేయడంపై ఆగ్రహం స్థానికత ఆధారంగా తెలంగాణకు చెందిన ఈడీ నాగరాజు విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తెలంగాణ అధికారులు భగ్గుమంటున్నారు. ఇటీవలి వరకు ఆయన విజయవాడ జోన్ ఈడీగా బాధ్యతలు నిర్వహించారు. పది రోజుల క్రితం ఆ పరిధిలో జరిగిన ఓ ప్రమాద బాధితులకు ఆసుపత్రిలో చికి త్స అందించే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అక్కడి రవాణామంత్రికి సమాచారం అందింది. దీనిపై ఈడీ నాగరాజును ప్రశ్నించగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాధానమిచ్చారు. కానీ ఉన్నట్టుండి ఆయన మస్టర్ రోల్‌ను క్లోజ్ చేసి టీఎస్ ఆర్టీసీకి పంపారు. ఆయన ఎలాగూ తెలంగాణకే రావాల్సి ఉంది. తాత్కాలిక విభజనలో దీన్ని ఎండీ ఖరారు చేశారు. ఆ రూపంలో పంపకుండా.. శాఖాపరమైన చర్య రూపంలో పంపటాన్ని తెలంగాణ అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. తాజాగా ఆయనకు హైదరాబాద్ జోన్ ఈడీ బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ జేఎండీ రమణరావు నిర్ణయం తీసుకోవటం విశేషం.