JNNURM Buses
-
ఢిల్లీ బస్సు వచ్చింది.. వంద కోట్లు మింగింది!
ఆ బస్సు ఖరీదు రూ.20 లక్షలు.. సగం ధరకే ఆర్టీసీకి అందింది. అంటే రూ.10 లక్షలే చెల్లించాలి. కానీ ఆర్టీసీ దానికి చేసిన ఖర్చు దాదాపు రూ.34 లక్షలు. దీనికితోడు అది అడ్డగోలుగా తాగే డీజిల్‌తో మరో ఏడెనిమిది లక్షలకు ఎసరు.. ఇదంతా జేఎన్ఎన్యూఆర్ఎం కింద రాష్ట్రానికి అందిన బస్సుల కథ. కేంద్ర ప్రభుత్వ అధికారుల అడ్డగోలు నిర్ణయాలు, అవినీతి కారణంగా తలెత్తిన దుస్థితి ఇది. ఒకటీ రెండు కాదు ఆర్టీసీపై వంద కోట్లకుపైగా దెబ్బపడి, నష్టాలను మరింత పెంచిన ఈ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. గుదిబండగా మారిన ఆ బస్సులను వదిలించుకోలేక ఆర్టీసీ మల్లగుల్లాలు పడుతూనే ఉంది. సాక్షి, హైదరాబాద్: 2005 చివర్లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ‘జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం)’పథకాన్ని అమల్లోకి తెచ్చింది. పట్టణ ప్రాంతాల పురోగతికి చేయూత ఇవ్వడం దాని లక్ష్యం. ఈ మేరకు హైదరాబాద్‌లో సిటీ బస్సుల వ్యవస్థను పటిష్టం చేసేందుకు కేంద్రం 50 శాతం రాయితీపై 750 బస్సులు మంజూరు చేసింది. సగం రేటుకే అన్ని బస్సులు వస్తుండటంతో ప్రజా రవాణాకు మరింతగా ఊతం వస్తుందని ఆర్టీసీ భావించింది. తన వంతు వాటా చెల్లించింది. విడతల వారీగా బస్సు లు వచ్చాయి. కానీ అక్కడే ఆర్టీసీకి షాక్ తగిలింది. ఛాసిస్‌తో మొదలై.. ఆర్టీసీ సాధారణంగా బస్సులను మొత్తంగా కొనదు. కేవలం ఛాసిస్ (బాడీ మినహా ప్రధాన భాగం)ను మాత్రమే కంపెనీల నుంచి కొని.. సొంత వర్క్‌షాపులో దాని బస్ బాడీని ఏర్పాటు చేసుకుంటుంది. దీనివల్ల ఆర్టీసీ అవసరానికి అనుగుణంగా బస్సు ఉండటంతోపాటు ఖర్చు చాలా ఆదా అవుతుంది. జేఎన్ఎన్యూఆర్ఎం కింద వచ్చే బస్సులనూ అలాగే సిద్ధం చేసుకోవాలని ఆర్టీసీ భావించింది. కానీ బాడీతో కలిపి పూర్తిస్థాయి బస్సులనే సరఫరా చేస్తామని ఢిల్లీ అధికారులు తేల్చి చెప్పారు. ఇక్కడే అవినీతికి తెరలేపారు. టాటా, అశోక్ లేలాండ్ కంపెనీల నుంచి ఛాసిస్లు కొని.. బయట ప్రైవేటు సంస్థల వద్ద బాడీలు చేయించారు. వ్యయాన్ని బాగా పెంచేసి, కమీషన్లు వెనకేసుకున్నారు. ఎక్కువ రేటుతో రాష్ట్రానికి అంటగట్టారు. ఒక్కో బస్సు ధరను రూ.36 లక్షలుగా చూపినట్టు తెలిసింది. అయితే బస్సు ఛాసిస్లు, బాడీ ఏర్పాటుపై మంచి పట్టున్న ఆర్టీసీ.. కేంద్రం నుంచి అంత రేటుతో వచ్చిన బస్సులను చూసి నోరెళ్లబెట్టింది. ఒక్కో బస్సుకు రూ.20 లక్షలే ఖర్చవుతుందని తేల్చింది. అయినా రాయితీపై వచ్చాయి కదాని సర్దిచెప్పుకుంది. బస్సులకు బాడీలే భారమై.. ఢిల్లీ అధికారులు జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులకు ఏర్పాటు చేయించిన బాడీలు డొల్లవేనని ఆర్టీసీకి కొద్దిరోజుల్లోనే తెలిసొచ్చింది. బస్సులకు ఆ బాడీలే భారంగా మారి మొరాయించటం మొదలైంది. సరిగా నడవక, ఎక్కడ ఏ భాగం ఊడి పడుతుందో తెలియక, అడ్డగోలుగా డీజిల్ తాగుతున్న ఆ బస్సులను నడపటం డ్రైవర్లకు కష్టంగా మారింది. ఓవైపు ప్రమాదాలకు గురికావటం, మరోవైపు ఉన్నట్టుండి రోడ్లపై ఆగిపోవడం జరిగాయి. చివరికి వాటికి ఉన్న ఎంఎస్ స్టీల్ బాడీలు తొలగించి.. ఆర్టీసీ వాడే అల్యూమినియం బాడీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మియాపూర్‌లోని ఆర్టీసీ బస్‌బాడీ యూనిట్లో కొత్త బాడీలు తయారు చేసి, అమర్చడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు దాదాపు 700 బస్సులకు కొత్త బాడీలు ఏర్పాటు చేశారని, 80 కోట్ల వరకు ఖర్చు చేశారని తెలిసింది. బస్‌బాడీ యూనిట్ బలహీనపడి.. గతంలో ఆర్టీసీ బస్‌బాడీ యూనిట్ 600 మంది కార్మికులతో కళకళలాడేది. ప్రొడక్షన్ సామర్ధ్యం ఎక్కువగా ఉండేది. ఏడెనిమిదేళ్లుగా బలహీనపడుతూ వచ్చింది. జీతాల భారంతో నియామకాలు చేపట్టకపోవటంతో సిబ్బంది సంఖ్య తగ్గి చిన్న యూనిట్‌గా మారింది. దీంతో బస్ బాడీల పని ఆలస్యమైంది. అంతా నష్టమే.. ► ఆర్టీసీ సొంతంగా తయారు చేసుకున్న బాడీలతో బస్సులను 12 లక్షల కిలోమీటర్లకుపైగా తిప్పుతుంది. తర్వాత ఆ బస్సులను తక్కువ కేటగిరీకి మార్చి సంబంధిత బాడీలను ఏర్పా టు చేస్తుంది. కానీ జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు లక్ష కిలోమీటర్లు కూడా తిరగకుండానే బాడీలు మార్చాల్సి వచ్చింది. ఇందుకు రూ.80 కోట్ల వరకు వృథా ఖర్చు అయింది. ► ఆర్టీసీ బస్సులు హైదరాబాద్ నగరంలో లీటర్ డీజిల్‌కు 4–5 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తాయి. కానీ ఢిల్లీ నుంచి వచ్చి బస్సులు 3.5 కిలోమీటర్ల మైలేజీ మాత్రమే ఇచ్చాయి. ఒక్కో బస్సు రోజుకు సగటున ఏడు లీటర్ల డీజిల్ అదనంగా తాగిందనేది ఆర్టీసీ లెక్క. ఇన్నేళ్లలో ఒక్కో బస్సుపై రూ.ఏడెనిమిది లక్షల మేర అదనపు భారం పడిందని అంచనా. ఇందులో కొత్త బాడీలు పెట్టిన బస్సుల మైలేజీ ఒక కిలోమీటర్ మేర పెరిగింది. ► జేఎన్ఎన్యూఆర్ఎం బస్సుల్లో ఆర్టీసీ చెల్లించాల్సింది 50 శాతమే. రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం, కేంద్రం 35 శాతం భరించాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా ఆర్టీసీనే చెల్లించాల్సి వచ్చింది. ఆర్టీసీకి ప్రయోజనం లేకుండా పోయింది. ( చదవండి: ఐఎంఎస్ స్కాంలో దర్యాప్తు ముమ్మరం ) -
ఆర్టీసీని ఆదరించాలి
రవాణా వ్యవస్థను పటిష్టం చేయాలి జిల్లాకు మరిన్ని కొత్త బస్సులు డిప్యూటీ సీఎం కడియం, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి హన్మకొండ : ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించి లాభాల బాటలో పయనించేలా చూడాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. రవాణా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరముందని అన్నారు. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు మంజూరైన 24 జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులను రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి బుదవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జిల్లాకు 24 కొత్త బస్సులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం, చరిత్ర, వారసత్వ నగరం వరంగల్ అని అన్నారు. వరంగల్ మహానగరంలో ప్రజల రవాణ వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఆర్టీసీ యాజమాన్యం జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు మంజూరు చేసిందన్నారు. జిల్లాకు మరిన్ని బస్సులు అవసరమని అన్నారు. చిన్న బస్సులు ప్రవేశ పెడితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని, కార్మికులకు లబ్ధి చేకూర్చేందుకు 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని అన్నారు. కార్మికులు కూడా సంస్థ పరిర క్షణకు పాటుపడాలన్నారు. రాష్ట్ర రవాణ శాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వరంగల్ రీజియన్‌కు రూ.9 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 24 బస్సులను ఇచ్చామన్నారు. ఆర్టీసీ బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరమని, అందుకే ఈ జిల్లాకు మరిన్ని బస్సులు కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు వెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పల్లెవెలుగు బస్సులతో నష్టాలు వస్తున్నా గ్రామీణ ప్రజలకు రవాణ సౌకర్యం కల్పించేందుకు ఈ సర్వీసులు నడుపుతున్నామన్నారు. దూరప్రాంతాలకు, పుణ్యక్షేత్రాలకు ఏసీ బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ఆర్టీసీ ఆర్ఎం తోట సూర్యకిరణ్ మాట్లాడుతూ వరంగల్ రీజియన్‌కు ఒకేసారి 24 కొత్త బస్సులు రావడం ఇదే ప్రథమమని అన్నారు. కొత్త బస్సులను వరంగల్ మహా నగరంలో తిప్పుతామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, గ్రేటర్ నగర మేయర్ నన్నపనేని నరేందర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌బాస్కర్, డాక్టర్ తాటికొండ రాజయ్య, జిల్లా రవాణ శాఖ అధికారి రాంచందర్, ఆర్టీసీ కరీంనగర్ ఈడీ గరిమిల్ల సత్యనారాయణ, డిప్యూటీ సీటీఎం జి.ఎస్.ఎస్.సురేష్, డిప్యూటీ సీఎంఈ జి.రాములు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, జెడ్పీ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, డిపో మేనేజర్లు అర్పిత, ఎస్.భూపతిరెడ్డి, భానుకిరణ్, శ్రీనివాస్, యేసు, మధుసూదన్, చంద్రయ్య, ఆయా యూనియన్ల నాయకులు పీఆర్ రెడ్డి, సి.హెచ్.జితేందర్‌రెడ్డి, ఈఎస్ బాబు, రాతిపల్లి సాంబయ్య, ఎం.డీ.గౌస్, ఈదురు వెంకన్న, జనార్దన్, సీహెచ్.రాంచందర్, ఎస్.యాదగిరి, రాజయ్య, యాకస్వామి, వడ్డాలపు కుమారస్వామి, జి.సారంగపాణి, మోహన్, ఎన్.వీ.రెడ్డి పాల్గొన్నారు.