ఆర్టీసీని ఆదరించాలి
-
రవాణా వ్యవస్థను పటిష్టం చేయాలి
-
జిల్లాకు మరిన్ని కొత్త బస్సులు
-
డిప్యూటీ సీఎం కడియం, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి
హన్మకొండ : ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించి లాభాల బాటలో పయనించేలా చూడాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. రవాణా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరముందని అన్నారు. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు మంజూరైన 24 జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులను రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి బుదవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జిల్లాకు 24 కొత్త బస్సులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం, చరిత్ర, వారసత్వ నగరం వరంగల్ అని అన్నారు. వరంగల్ మహానగరంలో ప్రజల రవాణ వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఆర్టీసీ యాజమాన్యం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులు మంజూరు చేసిందన్నారు. జిల్లాకు మరిన్ని బస్సులు అవసరమని అన్నారు. చిన్న బస్సులు ప్రవేశ పెడితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని, కార్మికులకు లబ్ధి చేకూర్చేందుకు 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారని అన్నారు. కార్మికులు కూడా సంస్థ పరిర క్షణకు పాటుపడాలన్నారు.
రాష్ట్ర రవాణ శాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వరంగల్ రీజియన్‌కు రూ.9 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 24 బస్సులను ఇచ్చామన్నారు. ఆర్టీసీ బస్ స్టేషన్‌లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరమని, అందుకే ఈ జిల్లాకు మరిన్ని బస్సులు కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు వెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పల్లెవెలుగు బస్సులతో నష్టాలు వస్తున్నా గ్రామీణ ప్రజలకు రవాణ సౌకర్యం కల్పించేందుకు ఈ సర్వీసులు నడుపుతున్నామన్నారు. దూరప్రాంతాలకు, పుణ్యక్షేత్రాలకు ఏసీ బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ఆర్టీసీ ఆర్‌ఎం తోట సూర్యకిరణ్ మాట్లాడుతూ వరంగల్ రీజియన్‌కు ఒకేసారి 24 కొత్త బస్సులు రావడం ఇదే ప్రథమమని అన్నారు. కొత్త బస్సులను వరంగల్ మహా నగరంలో తిప్పుతామని చెప్పారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, గ్రేటర్ నగర మేయర్ నన్నపనేని నరేందర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌బాస్కర్, డాక్టర్ తాటికొండ రాజయ్య, జిల్లా రవాణ శాఖ అధికారి రాంచందర్, ఆర్టీసీ కరీంనగర్ ఈడీ గరిమిల్ల సత్యనారాయణ, డిప్యూటీ సీటీఎం జి.ఎస్.ఎస్.సురేష్, డిప్యూటీ సీఎంఈ జి.రాములు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, జెడ్పీ టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, డిపో మేనేజర్లు అర్పిత, ఎస్.భూపతిరెడ్డి, భానుకిరణ్, శ్రీనివాస్, యేసు, మధుసూదన్, చంద్రయ్య, ఆయా యూనియన్ల నాయకులు పీఆర్ రెడ్డి, సి.హెచ్.జితేందర్‌రెడ్డి, ఈఎస్ బాబు, రాతిపల్లి సాంబయ్య, ఎం.డీ.గౌస్, ఈదురు వెంకన్న, జనార్దన్, సీహెచ్.రాంచందర్, ఎస్.యాదగిరి, రాజయ్య, యాకస్వామి, వడ్డాలపు కుమారస్వామి, జి.సారంగపాణి, మోహన్, ఎన్.వీ.రెడ్డి పాల్గొన్నారు.