ఆర్టీసీలో ‘మానసిక’ టెన్షన్‌! | RTC Drivers Facing Several Troubles | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో ‘మానసిక’ టెన్షన్‌!

Published Sun, Nov 12 2023 2:14 AM | Last Updated on Sun, Nov 12 2023 9:03 AM

RTC Drivers Facing Several Troubles - Sakshi

ముందు రోజు రాత్రివిధులు నిర్వహించి వచ్చాడు ఆ డ్రైవర్‌.. మరుసటి రోజు రాత్రి విధులకు వెళ్లేలోపు కనీసం నాలుగు గంటలన్నా నిద్రపోవాలి.. కానీ దగ్గరి బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లాల్సి ఉంది, సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో పగటి పూట వేడుకలో గడిపి, 110 కి.మీ. దూరంలోని తానుంటున్న పట్టణం నుంచి సొంత వాహనం నడుపుకుంటూ హైదరాబాద్‌ వచ్చి విజయవాడ బస్సు తీసుకుని బయలుదేరాడు. దారిలో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనటంతో మృతి చెందాడు. మరో 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

ఆ డ్రైవర్‌ కొన్నేళ్లుగా కుటుంబ వివాదాలతో సతమతమవుతున్నాడు.. దాదాపు కుటుంబ సభ్యులు వెలివేసినంత పనిచేశారు.. దీంతో అతని మానసిక స్థితి అదుపు తప్పింది. దూరప్రాంత బస్సు కావటంతో ఇద్దరు డ్రైవర్లు విధుల్లో ఉంటున్నారు. మరో డ్రైవర్‌ నడుపుతున్నప్పుడు అతను మద్యం సేవిస్తున్నాడు. ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేయగా, ఆ రోజు అధికంగా మద్యం తాగి ఉన్నట్టు తేలి అధికారులు కంగుతిన్నారు. అప్పుడు కాని అతన్ని విధుల నుంచి తప్పించలేదు.


సాక్షి, హైదరాబాద్‌:  ఇది తెలంగాణ ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితి. సగటున ఒక్కో బస్సులో 60 మందికిపైగా ప్రయాణికులు ఉంటారు. వారిని క్షేమంగా గమ్యం చేర్చేది డ్రైవరే. కానీ, ఇప్పుడు ఆర్టీసీకి డ్రైవర్లపై పర్యవేక్షణే లేకుండా పోయింది. డ్రైవర్‌ భద్రంగా బస్సును గమ్యం చేర్చటమనేది డ్రైవింగ్‌ స్కిల్స్‌ పైనే కాకుండా, అతని మానసిక స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే గతంలో డ్రైవర్‌పై నిఘా, పర్యవేక్షణ ఉండేది. కానీ, క్రమంగా నష్టాలను అధిగమించేందుకు ఆదాయంపైనే దృష్టి కేంద్రీకరించటం మొదలయ్యాక ఇది గతి తప్పింది.

ఇప్పుడు డ్రైవర్ల కొరత కూడా ఉండటంతో, కచ్చి తంగా ఉన్నంత మంది విధులకు వచ్చేలా చూడ్డానికే అధికారులు పరిమితమవుతున్నారు. వారికి గతంలోలాగా సెలవులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో విధులు ముగిసిన తర్వాత నుంచి తిరిగి విధులకు వచ్చే వరకు ఆ డ్రైవర్‌ విషయాన్ని సంస్థ పట్టించుకోవటం లేదు. డ్యూటీకి వచ్చే సమయానికి అతని మానసిక స్థితి ఏంటో కూడా తెలుసుకోలేకపోతున్నారు. మద్యం తాగి ఉన్నాడా లేదా అన్న ఒక్క విషయాన్ని మాత్రమే తేల్చుకుని బస్సు అప్పగిస్తున్నారు. 

సెలవులు లేక.. 
ఒంట్లో కాస్త నలతగా ఉన్నా, విశ్రాంతి సమయంలో నిద్రపోలేని పరిస్థితిలో ఉన్నా, రకరకాల వివాదా లతో మానసికంగా ఆందోళనతో ఉన్నా.. డ్రైవింగ్‌ సరిగా చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో తనకు సెలవు కావాలంటూ డ్రైవర్లు అడుగుతారు. అయితే, సెలవు ఇస్తే డ్రైవర్ల కొరత వల్ల సరీ్వసునే రద్దు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో వా రికి సెలవుల్లేక విధులకు హాజరు కావాల్సి వస్తోంది.  విజయవాడ మార్గంలో జరిగిన యాక్సిడెంట్‌లో చనిపోయిన డ్రైవర్‌.. ఆ రోజు నిద్రలేమితో ఉండి కూడా సెలవుకు దరఖాస్తు చేయకుండా డ్యూటీకి హాజరయ్యాడని తెలిసింది. 

ఆ విధానమేమైంది..? 

  • గతంలో ప్రతి డిపోలో స్పేర్‌ డ్రైవర్లు ఉండేవారు. డ్యూటీ చేయలేని స్థితిలో డ్రైవర్‌ ఉంటే అతని స్థానంలో మరో డ్రైవర్‌ను పంపే వారు. కానీ 13 ఏళ్లుగా డ్రైవర్ల రిక్రూట్‌మెంట్‌ లేకపోవటం, రిటైర్మెంట్లు, మరణించడం, పదోన్నతులు.. వంటి కారణాల వల్ల డ్రైవర్లకు కొరత ఏర్పడింది. 
  • గతంలో డ్రైవర్ల మానసిక స్థితిని తెలుసుకునే విధానం ఉండేది. ఏవైనా కారణాలతో వారు మానసికంగా కుంగిపోతున్నారా అన్నది సంస్థకు తెలిసే ఏర్పాటు ఉండేది. ప్రతి సంవత్సరారంభంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేవారు. వాటికి డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా డ్రైవర్ల స్థితిగతులపై ఆర్టీసీకి సమాచారం చేరేది. డ్రైవర్లతోపాటు, వారి కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్‌ చేసేవారు. డ్యూటీకి–డ్యూటీకి మధ్య చాలినంత నిద్ర ఉండేలా చూడాలంటూ కుటుంబ సభ్యులకు సూచించేవారు. ఇప్పుడు ఆ వారోత్సవాలు సరిగా నిర్వహించటం లేదు. 
  • సంవత్సరంలో ఒకసారి ప్రమాదరహిత వారోత్సవాలు నిర్వహించేవారు. ఆ వారంలో ఒక్క బస్సు కూడా ప్రమాదానికి గురి కాకుండా డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలుండేవి. ఇది కూడా వారి నైపుణ్యం, మానసిక స్థితి తెలుసుకునేందుకు ఉపయోగపడేది. ఇప్పుడు దీన్ని నిర్వహించటం లేదు. 

వరుస ప్రమాదాలతో.. 
చాలా  విరామం  తర్వాత మళ్లీ ఆర్టీసీ డ్రైవర్ల కుటుంబ సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. ఇటీవలి వరుస ప్రమాదాలతో సంస్థలో టెన్షన్‌ నెలకొంది. డ్యూటీకి వచ్చేప్పుడు సరైన స్థితితో డ్రైవర్లు ఉండేలా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులది అని అధికారులు చెబుతున్నారు. వారు రెస్ట్‌ సమయంలో తగినంతగా నిద్రపోవటం, సెల్‌ఫోన్లతో ఎక్కువ సేపు గడపకుండా చూడటం, అనవసర వివాదాలతో ఒత్తిడికి గురికాకుండా చూడటం.. లాంటి అంశాలపై కుటుంబ సభ్యులు దృష్టి సారించాలని చెప్పనున్నారు.

కానీ, గతంలో ఉన్నట్టు పకడ్బందీ వ్యవస్థ  ఏర్పాటు  చేస్తే తప్ప ఇది ఫలించే సూచనలు కనిపించటం లేదు. డ్రైవర్లపై పని ఒత్తిడి తగ్గటంతోపాటు డ్రైవింగ్‌ చేయలేని పరిస్థితి ఉంటే సెలవు ఇచ్చే ఏర్పాటు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అది జరగాలంటే, తాత్కాలిక పద్ధతిలోనైనా డ్రైవర్ల రిక్రూట్‌మెంట్‌ ఉండాలని వారు పేర్కొంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement