JNU student missing
-
జెఎన్యూ అణువణువు శోధించండి: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: గత అక్టోబర్‌లో అదృశ్యమైన జేఎన్‌యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ విషయంపై ఢిల్లీ హైకోర్టు మరోసారి స్పందించింది. అతడు కనిపించకుండాపోయి రెండు నెలలు గడిచిపోతుంది. యూనివర్సిటీ ప్రాంగణం మొత్తాన్ని స్నిఫర్ డాగ్స్ తో తనిఖీలు చేయించాలని జస్టిస్ జీఎస్ సిస్టానీ, జస్టిస్ వినోద్ గోయల్ లతో కూడిన ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. వర్సిటీలో అనువణువు గాలించి ఏదో ఒక ఆధారాన్నయినా సంపాదించాలని సూచించింది. అదే విధంగా జెఎన్యూ తో పాటు విద్యార్థి సంఘాలు (జెన్యూఎస్యూ)లో సెర్చ్ చేసేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం పేర్కొంది. నజీబ్ అహ్మద్ కిడ్నాప్ (అదృశ్యం)అయ్యాడని మొదటి నుంచి ఆరోపలున్నా, సాక్ష్యాలు లభ్యం కాకపోవడంతో కేసు యూ టర్న్ తీసుకుంటుంది. ఇష్టం లేక అతడే జెఎన్యూ నుంచి పారిపోయాడని వదంతులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు నజీబ్ ఆచూకీ తెలిపిన వారికి ఢిల్లీ పోలీసులు ప్రకటించిన రివార్డును రూ.50 వేల నుంచి 5 లక్షలకు పెంచేసినా ప్రయోజనం లేకపోయింది. గత అక్టోబర్ 15న అదృశ్యమవ్వక ముందురోజు నజీబ్ తో గొడవపడ్డ నలుగురు విద్యార్థులకు లై డిటెక్టర్ తో టెస్ట్ చేస్తామని పోలీసు అధికారి రాహుల్ మెహ్రా తెలిపారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామని మరో 10 రోజుల్లో విషయం తెలుస్తుందన్నారు. నజీబ్ అహ్మద్ తల్లి ఫాతిమా నఫీజ్ నవంబర్ 26న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అప్పటినుంచీ ఈ కేసుపై ధర్మాసనం విచారిస్తుంది. కేసులో పురోగతి మాత్రం కనిపించడం లేదు. -
అతడిపై రివార్డ్ పదిరెట్లు పెంచేశారు!
న్యూఢిల్లీ: గత అక్టోబర్‌లో అదృశ్యమైన జేఎన్‌యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ విషయంపై ఢిల్లీ పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. అతడు కనిపించకుండాపోయి 50 రోజులు గడిచిపోతున్నా పోలీసులు కనీసం ఒక ఆధారం కూడా తెలుసుకోలేకపోయారని, అంత సడన్‌గా విద్యార్థి ఎందుకు అదృశ్యమయ్యాడో చెప్పాలని జస్టిస్ జీఎస్ సిస్టానీ, జస్టిస్ వినోద్ గోయల్ లతో కూడిన ధర్మాసనం ఢిల్లీ పోలీసుశాఖను వివరణ కోరింది. మరోవైపు నజీబ్ ఆచూకీ తెలిపిన వారికి ఢిల్లీ పోలీసులు ప్రకటించిన రివార్డును రూ.50 వేల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచేశారు. జెఎన్యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ తల్లి ఫాతిమా నఫీజ్ నవంబర్ 26న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కుమారుడి అదృశ్యం విషయంలో అంతకుముందు కేంద్రహోం మంత్రిని ఆమె కలిశారు. నజీబ్‌ను వెతికేందుకు రాజ్‌నాథ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత కేసు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు బదిలీ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ ప్రాంతానికి చెందిన నజీబ్ బయో టెక్నాలజీ కోర్సు చేస్తున్నాడు. అయితే గత అక్టోబర్ 15న హాస్టల్ నుంచి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. ఈ ఘటనకు ముందురోజు ఏబీవీపీ వర్గానికి, నజీబ్‌కు మధ్య స్పల్ప ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం.