అతడిపై రివార్డ్ పదిరెట్లు పెంచేశారు!
న్యూఢిల్లీ: గత అక్టోబర్‌లో అదృశ్యమైన జేఎన్‌యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ విషయంపై ఢిల్లీ పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. అతడు కనిపించకుండాపోయి 50 రోజులు గడిచిపోతున్నా పోలీసులు కనీసం ఒక ఆధారం కూడా తెలుసుకోలేకపోయారని, అంత సడన్‌గా విద్యార్థి ఎందుకు అదృశ్యమయ్యాడో చెప్పాలని జస్టిస్ జీఎస్ సిస్టానీ, జస్టిస్ వినోద్ గోయల్ లతో కూడిన ధర్మాసనం ఢిల్లీ పోలీసుశాఖను వివరణ కోరింది.
మరోవైపు నజీబ్ ఆచూకీ తెలిపిన వారికి ఢిల్లీ పోలీసులు ప్రకటించిన రివార్డును రూ.50 వేల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచేశారు. జెఎన్‌యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ తల్లి ఫాతిమా నఫీజ్ నవంబర్ 26న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కుమారుడి అదృశ్యం విషయంలో అంతకుముందు కేంద్రహోం మంత్రిని ఆమె కలిశారు. నజీబ్‌ను వెతికేందుకు రాజ్‌నాథ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత కేసు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు బదిలీ చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ ప్రాంతానికి చెందిన నజీబ్ బయో టెక్నాలజీ కోర్సు చేస్తున్నాడు. అయితే గత అక్టోబర్ 15న హాస్టల్ నుంచి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. ఈ ఘటనకు ముందురోజు ఏబీవీపీ వర్గానికి, నజీబ్‌కు మధ్య స్పల్ప ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం.