Job Recruitment examination
-
సెప్టెంబర్‌లో ఉమ్మడి అర్హత పరీక్ష!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి అర్హత పరీక్ష(సెట్)ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ శనివారం వెల్లడించారు. ఈ పరీక్షను నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ(ఎన్ఆర్ఏ) నిర్వహిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకొనే యువతకు మంచి అవకాశమన్నారు. గ్రూప్–బి, గ్రూప్–సి(నాన్ టెక్నికల్) ఉద్యోగాల భర్తీకి ‘సెట్’ను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్షా కేంద్రం ఉంటుందన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువతకు ఇది ఉపయోగకరమని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, దివ్యాంగులు పరీక్ష కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదని తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢ సంకల్పంతోనే ఈ ఏడాది నుంచి ‘సెట్’ అమల్లోకి వస్తోందని పేర్కొన్నారు. ఇదొక గొప్ప సంస్కరణ అని అభివర్ణించారు. ‘సెట్’ ఉన్నప్పటికీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) వంటి సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీలు కొనసాగుతాయని జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. -
ఏ పరీక్ష రాయాలి దేవుడా?
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల కోసం నిరుద్యోగులు ఏళ్లతరబడి చకోర పక్షుల్లా ఎదురు చూస్తుంటారు. కోచింగ్ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొడుతూ పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు. ఉద్యోగం వచ్చేవరకూ ఒకదానివెంట మరొకటి పోటీ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతుంటారు. అటువంటి సమయంలో రెండుమూడు ఉద్యోగ నియామక పరీక్షలు ఒకే రోజు జరిగితే వారి ఆందోళన వర్ణణాతీతం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నియామకాలకు పూనుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్, డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేశాయి. మూడింటిలో ఏదో ఒకటి సాధించకపోమా అన్న ఆశతో ఉన్న అభ్యర్థుల ఆశలను ఆడియాసలు చేస్తూ అభ్యర్థులకు హాల్‌టికెట్లు అందాయి. ఒకే రోజు(జనవరి 6న) మూడు పరీక్షలు ఉన్నట్టు తేలడంతో ఏ పరీక్ష రాయాలిరా దేవుడా...అంటూ తలలు పట్టుకుంటున్నారు. మూడు పరీక్షలు ఒకే రోజే.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐ నియామకాలకు వచ్చే ఏడాది జనవరి 6న దేశ వ్యాప్తంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు పరీక్షలు నిర్వహిస్తోంది. ఒకటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్, మరొకటి డీఎస్సీ పీఈటీ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్ష. ఇలా ఒకే రోజు మూడు నియామక పరీక్షలు ఉండటంతో అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహిస్తున్న రోజు రాష్ట్ర ప్రభుత్వాలు మరే పరీక్షను నిర్వహించకూడదు. కానీ టీడీపీ ప్రభుత్వం అదేరోజు ఏకంగా రెండు పరీక్షలు నిర్వహిస్తోంది. ఎన్నికల హడావిడే కారణం.. ఎన్నికలు సమీపిస్తుండటం, నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై రోజు రోజుకీ వ్యతిరేకత పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద తక్కువ పోస్టులతో కూడిన నోటిఫికేషన్లను ఒకటి అరా ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఎదో విధంగా నియామక పరీక్షలు జనవరి నెలలో నిర్వహించి మమ అనిపించేయాలన్న ఉద్దేశంతో ఒక ప్రణాళిక లేకుండా ఎడాపెడా తేదీలను ప్రకటించి అభ్యర్థులను సందిగ్ధంలోకి నెడుతోంది. అసలే నియామకాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలా ఒకే రోజు అన్ని పరీక్షలు నిర్వహించడం ఏమిటని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఒకే రోజు ఏపీ, తెలంగాణలో పరీక్షలు.. జనవరి 6న నాకు హైదరాబాద్‌లో ఆర్పీఎఫ్ ఎగ్జామ్, అదే రోజు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఉన్నాయి. ఒకే రోజు ఏపీ, తెలంగాణలో ఎలా పరీక్ష రాయాలో అర్థం కావటం లేదు. ప్రభుత్వం కనీస అవగాహన లేకుండా పరీక్ష తేదీలను ప్రకటించడం తప్పు. రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ పరీక్షను వాయిదా వేయాలి. – చిప్పల వెంకటేశ్వరరావు, అభ్యర్థి, జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా రెండు వారాలు వాయిదా వేయాలి.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కానిస్టేబుల్ పరీక్షను రెండు వారాల పాట వాయిదా వేయాలి, అదే విధంగా జనవరి 6న డీఎస్సీ పీఈటీ దేహదారుఢ్య పరీక్షకు ఒక్క రోజు మినహాయింపు ఇవ్వాలి. ప్రభుత్వం ఎన్నికల కోణంలో కాకుండా నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. – సమయం హేమంత్ కుమార్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు -
టీఎస్పీఎస్సీ ‘తొలి పరీక్ష’ సక్సెస్
931 ఏఈఈ పోస్టులకు ఆన్లైన్ పరీక్ష * దేశంలోనే తొలిసారి విజయవంతంగా నిర్వహణ * 24,383 మంది హాజరు.. ప్రశాంతంగా ముగిసిన పరీక్ష * నేడు సమాధాన పత్రాలు, ప్రాథమిక కీ.. 24న తుది కీ సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి: దేశంలోనే తొలిసారిగా ఆన్లైన్లో ఉద్యోగ నియామక పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవంతంగా నిర్వహించింది. 931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఆదివారం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్లలోని 99 పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష (సీబీఆర్టీ) ప్రశాంతంగా ముగిసింది. ఈ విధానంలో మొదటి ప్రయత్నంలోనే వేలాది అభ్యర్థులకు విజయవంతంగా ఆన్లైన్ పరీక్ష నిర్వహించడం ద్వారా టీఎస్పీఎస్సీ చరిత్ర సృష్టిం చింది. రాష్ట్రవ్యాప్తంగా 30,796 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 24,383 మంది పరీక్ష రాశారు. యూపీఎస్సీతో పాటు దేశంలోని ఇతర ఏ రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్లూ ఇం త భారీ సంఖ్యలో అభ్యర్థులకు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించిన దాఖలా లు లేవు! రంగారెడ్డి జిల్లాలో ఒక పరీక్ష కేం ద్రంలో స్వల్ప సాంకేతిక సమస్య మినహా అంతా సజావుగా జరిగినట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతీ సుబ్రమణ్యం ఓ ప్రకటనలో తెలిపారు. అక్కడ 136 మందిని ఇతర కేంద్రాలకు తరలించి, అదనపు సమయం ఇచ్చారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాం డ్ సెంటర్ ద్వారా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు, అధికారులు పరీక్ష నిర్వహణను ఎప్పటికప్పుడు సమీక్షించారు. 1,600 మంది ఇన్విజిలేటర్లు, 1,050 మంది సహాయక సిబ్బంది, 250 మంది కమిషన్ పరిశీలకులు పరీక్షల విధుల్లో పాలుపంచుకున్నారు. పరీక్షా కేంద్రాలపై నిఘా కోసం 29 ప్రత్యేక బృందాలను కూడా టీఎస్పీఎస్సీ నియమించింది. మూడంచెల పాస్వర్డ్లు: ఆన్లైన్ పరీక్ష నేపథ్యంలో టీఎస్పీఎస్సీ మూడంచెల పాస్‌వర్డ్‌ల విధానాన్ని అవలంబించింది. ఉదయం 7.30 గంటలకు తొలి పాస్వర్డ్ (బండిల్ పాస్వర్డ్), 9 గంటలకు రెండో పాస్వర్డ్ (డ్రైవ్ పాస్వర్డ్), 9.50 గంటలకు మూడో పాస్వర్డ్ (క్యాండిడేట్ పాస్వర్డ్)లను పరీక్ష కేంద్రాలకు విడుదల చేసింది. ఉదయం పదింటి నుంచి మధ్యాహ్నం 2.30 వరకు పరీక్ష జరిగింది. నేడు సమాధాన పత్రాలు, ప్రాథమిక కీ ఇప్పటికే చాలా పరీక్ష కేంద్రాల నుంచి టీఎస్పీఎస్సీకి అభ్యర్థుల సమాధాన పత్రాలు, ఆడిట్ ట్రయల్స్ చేరుకున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత అభ్యర్థులకు వారి సమాధాన పత్రాలతో పాటు ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ పంపించనుంది. ప్రాథమిక కీపై అభ్యంతరాలను అభ్యర్థులు రెండు రోజుల్లో తెలపవచ్చు. 24న తుది కీ విడుదలవుతుంది. మొరాయించిన కంప్యూటర్లు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్లు మొరాయించడంతో 136 మంది అభ్యర్థులను అనుమతించలేదు. 2 గంటలు గేటు బయటే ఉండాల్సి రావడంతో వారు ఆందోళనకు దిగారు. వారిని ఇతర కేంద్రాలకు తరలించారు. దీనిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీరభ ద్రయ్య నేతృత్వంలో విచారణకు ఆదేశించినట్టు టీఎస్పీఎస్సీ సభ్యుడు విఠల్ తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు, పరీక్షలో పలుమార్లు సిస్టమ్ లాకవడంతో అభ్యర్థులు ఇబ్బందిపడ్డారు. మౌస్‌ను నాన్‌స్టాప్‌గా కదిలించాల్సి వచ్చిందని, లేదంటే సిస్టం లాకయిందని అభ్యర్థులు వాపోయారు.