టీఎస్‌పీఎస్సీ ‘తొలి పరీక్ష’ సక్సెస్
931 ఏఈఈ పోస్టులకు ఆన్‌లైన్ పరీక్ష
* దేశంలోనే తొలిసారి విజయవంతంగా నిర్వహణ
* 24,383 మంది హాజరు.. ప్రశాంతంగా ముగిసిన పరీక్ష
* నేడు సమాధాన పత్రాలు, ప్రాథమిక కీ.. 24న తుది కీ
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి: దేశంలోనే తొలిసారిగా ఆన్‌లైన్‌లో ఉద్యోగ నియామక పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవంతంగా నిర్వహించింది.
931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఆదివారం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లలోని 99 పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష (సీబీఆర్‌టీ) ప్రశాంతంగా ముగిసింది. ఈ విధానంలో మొదటి ప్రయత్నంలోనే వేలాది అభ్యర్థులకు విజయవంతంగా ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించడం ద్వారా టీఎస్‌పీఎస్సీ చరిత్ర సృష్టిం చింది. రాష్ట్రవ్యాప్తంగా 30,796 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 24,383 మంది పరీక్ష రాశారు.
యూపీఎస్సీతో పాటు దేశంలోని ఇతర ఏ రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్లూ ఇం త భారీ సంఖ్యలో అభ్యర్థులకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించిన దాఖలా లు లేవు! రంగారెడ్డి జిల్లాలో ఒక పరీక్ష కేం ద్రంలో స్వల్ప సాంకేతిక సమస్య మినహా అంతా సజావుగా జరిగినట్టు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతీ సుబ్రమణ్యం ఓ ప్రకటనలో తెలిపారు. అక్కడ 136 మందిని ఇతర కేంద్రాలకు తరలించి, అదనపు సమయం ఇచ్చారు.
టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాం డ్ సెంటర్ ద్వారా టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు, అధికారులు పరీక్ష నిర్వహణను ఎప్పటికప్పుడు సమీక్షించారు. 1,600 మంది ఇన్విజిలేటర్లు, 1,050 మంది సహాయక సిబ్బంది, 250 మంది కమిషన్ పరిశీలకులు పరీక్షల విధుల్లో పాలుపంచుకున్నారు. పరీక్షా కేంద్రాలపై నిఘా కోసం 29 ప్రత్యేక బృందాలను కూడా టీఎస్‌పీఎస్సీ నియమించింది.
మూడంచెల పాస్‌వర్డ్‌లు: ఆన్‌లైన్ పరీక్ష నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ మూడంచెల పాస్‌వర్డ్‌ల విధానాన్ని అవలంబించింది. ఉదయం 7.30 గంటలకు తొలి పాస్‌వర్డ్ (బండిల్ పాస్‌వర్డ్), 9 గంటలకు రెండో పాస్‌వర్డ్ (డ్రైవ్ పాస్‌వర్డ్), 9.50 గంటలకు మూడో పాస్‌వర్డ్ (క్యాండిడేట్ పాస్‌వర్డ్)లను పరీక్ష కేంద్రాలకు విడుదల చేసింది. ఉదయం పదింటి నుంచి మధ్యాహ్నం 2.30 వరకు పరీక్ష జరిగింది.
నేడు సమాధాన పత్రాలు, ప్రాథమిక కీ
ఇప్పటికే చాలా పరీక్ష కేంద్రాల నుంచి టీఎస్‌పీఎస్సీకి అభ్యర్థుల సమాధాన పత్రాలు, ఆడిట్ ట్రయల్స్ చేరుకున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత అభ్యర్థులకు వారి సమాధాన పత్రాలతో పాటు ప్రాథమిక కీని టీఎస్‌పీఎస్సీ పంపించనుంది. ప్రాథమిక కీపై అభ్యంతరాలను అభ్యర్థులు రెండు రోజుల్లో తెలపవచ్చు. 24న తుది కీ విడుదలవుతుంది.
మొరాయించిన కంప్యూటర్లు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్లు మొరాయించడంతో 136 మంది అభ్యర్థులను అనుమతించలేదు. 2 గంటలు గేటు బయటే ఉండాల్సి రావడంతో వారు ఆందోళనకు దిగారు. వారిని ఇతర కేంద్రాలకు తరలించారు. దీనిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీరభ ద్రయ్య నేతృత్వంలో విచారణకు ఆదేశించినట్టు టీఎస్‌పీఎస్సీ సభ్యుడు విఠల్ తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు, పరీక్షలో పలుమార్లు సిస్టమ్ లాకవడంతో అభ్యర్థులు ఇబ్బందిపడ్డారు. మౌస్‌ను నాన్‌స్టాప్‌గా కదిలించాల్సి వచ్చిందని, లేదంటే సిస్టం లాకయిందని అభ్యర్థులు వాపోయారు.