న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి అర్హత పరీక్ష(సెట్)ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ శనివారం వెల్లడించారు. ఈ పరీక్షను నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఏ) నిర్వహిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకొనే యువతకు మంచి అవకాశమన్నారు. గ్రూప్–బి, గ్రూప్–సి(నాన్ టెక్నికల్) ఉద్యోగాల భర్తీకి ‘సెట్’ను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్షా కేంద్రం ఉంటుందన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువతకు ఇది ఉపయోగకరమని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, దివ్యాంగులు పరీక్ష కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదని తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢ సంకల్పంతోనే ఈ ఏడాది నుంచి ‘సెట్’ అమల్లోకి వస్తోందని పేర్కొన్నారు. ఇదొక గొప్ప సంస్కరణ అని అభివర్ణించారు. ‘సెట్’ ఉన్నప్పటికీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్‌ఆర్‌బీ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) వంటి సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీలు కొనసాగుతాయని జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment