బోనాల జాతరలో పరిచయం.. జోగిని శ్యామలపై పాతబస్తీ మౌనిక వేధింపులు
సాక్షి, సిటీబ్యూరో: జోగిని శ్యామలగా ప్రాచుర్యం పొందిన శ్యామలా దేవికి సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. తనకు భక్తురాలిగా పరిచయమైన పాతబస్తీకి చెందిన మౌనిక యాదవ్ ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ సందేశాలతో వేధింపులకు గురి చేస్తున్నట్లు సోమవారం శ్యామల సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం ప్రకారం... బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన శ్యామల నగరంలో బోనాల సందర్భంలో ఎక్కువగా వార్తల్లో కనిపిస్తుంటారు.
బోనాలు సమర్పించే సమయంలో అనేక మంది భక్తులు ఆమె వెంట ఉంటారు. పాతబస్తీకి చెందిన మౌనిక యాదవ్ సైతం ఇలానే శ్యామలకు పరిచయమయ్యింది. కొన్నాళ్ల క్రితం ఓ అంశానికి సంబంధించి ఇద్దరి మధ్యా స్పర్థలు వచ్చాయి. తనను వేధించిన వ్యక్తికి శ్యామల మద్దతు ఇస్తున్నారనేది మౌనిక ఆరోపణ. దీంతో కక్షకట్టిన ఆమె ఓ సందర్భంలో శ్యామల ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగింది.
అయితే కొన్నాళ్లుగా శ్యామల ఫోన్‌కు ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ సందేశాలను మౌనిక పంపిస్తున్నారు. వాటిలో శ్యామలతో పాటు ఆమె కుటుంబాన్నీ కించపరిచే, అవమానించేలా అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్యామల సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనివాసరావు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు.
(చదవండి: ఎంతటి విషాదం.. భార్య మరణవార్త తెలియకుండానే భర్త కూడా..)