హనీమూన్‌కో తోడు కావాలి
‘‘కాబోయే ఆలి కాను పొమ్మంది... తేనెచంద్రుడి లీల తోడు రమ్మంది’’ అంటూ ఆహ్వానిస్తున్న అతగాడిని చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. యుకెలోని లీసెస్టర్‌షైర్ వాసి జాన్ వైబ్రెడ్ (32)కి హనీమూన్ వెళ్లడానికి తోడు కావాలిట. ముక్కూ ముఖం తెలీనోడితో ఎవరైనా అలా వెళతారా? అని విస్తుపోకండి. తన ముక్కూ ముఖం చూపే ఫొటోతో పాటు తనెంత సరదా మనిషో ఎంత బాగా కంపెనీ ఇస్తాడో ఇ-బేలో ప్రత్యక్షంగా ప్రకటించుకుంటున్నాడు మన జాన్. ఇంతకీ కధ ఏమిటంటే... జాన్‌కి రెండేళ్ల నుంచి ప్రేమిస్తున్న గాళ్‌ఫ్రెండ్‌తో పెళ్లి సెటిలైంది. మనోడు ఝామ్మని ఊహల్లో తేలిపోతూ... డొమినికన్ రిపబ్లిక్కి హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశాడు. విలాసవంతమైన బస, ప్రయాణాలకు గాను తనకు, తన ఫియాన్సీకి చెరో 1050డాలర్లు చెల్లించుకున్నాడు.
ఇంతలో ఏమైందో ఏమోగానీ... గత క్రిస్మస్ ముందు ... ‘సరిజోడు కాదు నువ్వు... ఇక చాలు మన లవ్వు’ అంటూ సదరు కాబోయే సతి కాస్తా టాటా చెప్పేసింది. హతవిధీ అనుకున్న జాన్... తేరుకుని హనీమూన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుందామంటే అప్పటికే సమయం మించి పోయింది. ట్రావెల్స్వారు క్యాన్సిల్ గీన్సిల్ జాన్తానై ఫుల్ మనీ రిటర్న్ చేయం భాయ్ అనేశారు. ఏమి చేయాలో పాలుపోని జాన్... గాళ్‌ఫ్రెండ్ టిక్కెట్ వేస్ట్ కాకూడదని ‘‘నేనొక 5 అ. 9 అం. ఎత్తులో స్లిమ్‌గా ఉండే, నల్లని వత్తయిన జుత్తు కలిగిన, హాస్యాన్ని పండించే అడ్వంచరస్ పర్సన్‌ని, క్రిమినల్ రికార్డూ లేదు. హనీమూన్ ట్రిప్‌కి నాతో తోడవుతారా?’’ అంటూ. ఇ-బేలో తన గాళ్‌ఫ్రెండ్ టిక్కెట్‌ని వేలానికి పెట్టాడు. దీనికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ టిక్కెట్ అనూహ్యంగా 8వేల డాలర్లకు అమ్ముడైంది. తమ ఖర్చులకు పోను మిగిలిన మొత్తాన్ని కాన్సర్ వ్యాధి నివారణకు విరాళంగా ఇస్తానంటున్నాడీ సూపర్ లవర్. ఈ వెరైటీ హనీమూన్ ఫ్లయిట్ ఫిబ్రవరి 16న టేకాఫ్ తీసుకోనుంది.