ఐసిస్ లో 261 మంది పౌరుల చేరిక?
ఢాకా: దాదాపు 261 మంది బంగ్లా జాతీయులు ఐసిస్ లేదా బంగ్లా మిలిటెంట్ల దళంలో చేరినట్లు ఆ దేశం అనుమానిస్తోంది. ఈ మేరకు బంగ్లాదేశ్ నిఘా సంస్థ 'రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్ఏబీ)' బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బుధవారం తెల్లవారుజామున ఫేస్ బుక్ లో వీరి జాబితాను పోస్టు చేసిన ఆర్ఏబీ వీరి ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని కోరింది.
ఆర్ఏబీ అధికార ప్రతినిధి ముఫ్తీ మహముద్ ఖాన్ మాట్లాడుతూ.. జాబితాలో పేర్కొన్నవారంతా గత కొద్ది నెలలుగా ఆచూకీ లేకుండా పోయారని, ఈ ఏడాది జరిగిన రెండు ఉగ్రదాడులకు సంబంధించి వీరికి సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయని తెలిపారు. కాగా, వీరందరూ ఉగ్రసంస్థల్లో చేరిన ఉగ్రవాదులా అని మీడియా ప్రతినిధులు అడగగా.. ఆయన సమాధానం ఇవ్వలేదు.
ఢాకా కేఫ్, ఈద్ ప్రార్ధనా స్థలాలే లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగిన విషయం తెలిసిందే. దాడులు చేసింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించగా, బంగ్లాదేశ్ దాన్ని తోసిపుచ్చింది. నిఘాసంస్థ ప్రకటించిన జాబితాలో ఎవరి పిల్లల పేర్లయినా ఉంటే కచ్చితంగా తెలియజేయాలని, న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సొస్తోందని భయపడొద్దని ఆర్ఏబీ చీఫ్ బెనర్జీర్ అహ్మద్ కోరారు. కుటుంబీకులు ఇచ్చిన సమాచారంతో వారితో పాటు మిగిలిన పౌరులను కూడా కాపాడుకోవచ్చని చెప్పారు. కాగా, డజన్ల సంఖ్యలో డాక్టర్లు, ఇంజనీర్లు, విద్యార్థులు ఐసిస్ లో చేరేందుకు బంగ్లాదేశ్ నుంచి మిడిల్ ఈస్ట్ కు వెళ్లినట్లు ఆ దేశ పత్రికలు పేర్కొన్నాయి.