రాజ్యసభకు ‘డిస్కో డాన్సర్’
* బెంగాల్ నుంచి ఎన్నికైన మిథున్ చక్రవర్తి
* ముగిసిన రాజ్యసభ ఎన్నికలు
* 55 సీట్లకుగాను 18 చోట్ల ఎన్నికలు
* క్రాస్‌ఓటింగ్‌తో తృణమూల్‌కు అదనపు సీటు
* ఒడిశాలో బీజేడీకి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. 16 రాష్ట్రాల్లోని 55 స్థానాలకు గానూ.. 12 రాష్ట్రాల్లోని 37 స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందారు. మిగిలిన 18 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. అనంతరం ఫలితాలు ప్రకటించారు.
రాష్ట్రాలవారీగా ఫలితాలు..
పశ్చిమబెంగాల్: మొత్తం 5 స్థానాలకు గానూ.. తృణమూల్ కాంగ్రెస్ అధికారిక అభ్యర్థులైన బాలీవుడ్ నటుడు ‘డిస్కో డ్యాన్సర్’ మిథున్ చక్రవర్తి, జోగెన్ చౌధురి, కేడీ సింగ్‌లు విజయం సాధించారు. లెఫ్ట్ ఫ్రంట్ అధికారిక అభ్యర్థి, ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి రితబ్రత బెనర్జీ కూడా గెలుపొందారు. వారితో పాటు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన పాత్రికేయుడు అహ్మద్ హసన్ కూడా గెలిచారు. ఆయనకు తృణమూల్ మద్దతిచ్చింది. కాం గ్రెస్, వామపక్షాలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ జరిపి హసన్‌కు ఓటేయడంతో ఆయన విజయం సులభమయింది. హసన్‌కు ఓటేసిన ఎమ్మెల్యేలు సుశీల్ రాయ్, ఎమాని బిశ్వాస్‌లను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది.
ఒడిశా
మొత్తం 4 స్థానాలకు గానూ.. అధికార బిజూ జనతాదళ్(బీజేడీ) పార్టీ తమ ముగ్గురు అధికారిక అభ్యర్థులైన ఏయూ సింగ్‌దేవ్, కల్పతరు దాస్, సరోజిని హేంబ్రాంలను గెలిపించుకుంది. వారితో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ నేత, ఐపీఎల్ చైర్మన్ రంజిబ్ బిశ్వాల్ గెలుపొందారు. బీజేడీ తమ అదనపు ఎమ్మెల్యేల ఓట్ల ను తాము మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థికి వేయించలేకపోవడంతో బిశ్వాల్ విజయం సాధించగలిగారు.
అస్సాం
మొత్తం 3 స్థానాలకు గానూ.. అస్సాం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న ఉత్తరప్రదేశ్ ఎంపీ సంజయ్ సింగ్, అస్సాం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భువనేశ్వర్ కాలితలు విజయం సాధించారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన బోడో పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థి బిశ్వజిత్ దైమారి కూడా గెలుపొందారు. ప్రతిపక్షాలు ఒక్కటై మద్దతిచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ హైదర్ హుస్సేన్ ఓటమి పాలయ్యారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల సంఖ్య
మహారాష్ట్ర - 7 ( కాంగ్రెస్ 2, ఎన్సీపీ 2, శివసేన 1, ఆర్పీఐ 1, స్వతంత్ర 1)
తమిళనాడు-6 (ఏఐఏడీఎంకే 4, డీఎంకే 1, సీపీఎం 1)
బీహార్ - 5 (జేడీయూ 3, బీజేపీ 2)
గుజరాత్ - 4 ( బీజేపీ 3, కాంగ్రెస్ 1)
మధ్యప్రదేశ్ -3 ( బీజేపీ 2, కాంగ్రెస్ 1)
రాజస్థాన్ - 3 (బీజేపీ 3)
హర్యానా - 2 (కాంగ్రెస్ 1, ఐఎన్ఎల్డీ 1)
ఛత్తీస్‌గఢ్ - 2 ( కాంగ్రెస్ 1, బీజేపీ 1)
జార్ఖండ్ - 2 (ఆర్జేడీ 1, స్వతంత్ర 1)
హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ - 1 చొప్పున (మూడూ కాంగ్రెస్‌కే)