దుబాయ్‌లో థరూర్, తరార్.. ఏమిటీ తకరార్?
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ వివాహేతర సంబంధాల గురించి ఆయన భార్య సునంద్ పుష్కర్ తీవ్రంగా కలత చెందేవారని ప్రముఖ జర్నలిస్టు నళినీ సింగ్ చెప్పారు. సునంద మరణించేముందు... శశి థరూర్, పాకిస్థాన్ జర్నలిస్టు మెహ్ర్ తరార్‌ల మధ్య సంబంధాల గురించి ఆందోళన చెందారని నళిని తెలిపారు. 2013 జూన్‌లో థరూర్, తరార్ కలసి దుబాయ్‌లో మూడు రాత్రులు ఉన్నారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని సునంద చెప్పారని నళిని వెల్లడించారు. శశి థరూర్ విడాకులు ఇస్తారని సునంద భయపడ్డారని నళిని చెప్పారు.
గతేడాది జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఓ హోటల్లో సునంద మరణించారు. సునంద స్నేహితురాలైన నళిని మూడు రోజుల తర్వాత ఈ విషయాలను బయటపెట్టారు. సునంద చనిపోవడానికి ముందు రోజు తనకు ఫోన్ చేసిందని.. థరూర్, తరార్ పరస్పరం రొమాంటిక్ మెసేజ్‌లు పెట్టడం సునంద గుర్తించారని నళిని చెప్పారు. ఐపీఎల్లో థరూర్ అక్రమాల గురించి కూడా సునంద తనకు చెప్పినట్టు తెలిపారు. సునంద బ్లాక్‌బెర్రి మొబైల్ ఫోన్ నుంచి బీబీఎం మెసేజ్‌లను థరూర్ తొలగించారని, వాటిని మళ్లీ పొందేందుకు సాయం చేయాల్సిందిగా తనను కోరిందని వెల్లడించారు. శశి థరూర్‌కు అంతకుముందు మరో మహిళతో కూడా సంబంధం ఉన్నట్టు సునంద తెలిపారని నళిని చెప్పారు. శశి థరూర్ వివాహేతర సంబంధాలు, ఐపీఎల్ అక్రమాల్లో ఆయన పాత్ర ఉన్నట్టు ఆరోపణలు రావడం.. ఈ నేపథ్యంలో సునంద హత్యకు గురికావడం అనేక సందేహాలకు తావిస్తోంది. వాస్తవం ఏమిటన్నది పోలీసుల విచారణలో వెల్లడికావాల్సివుంది. ఆదివారం శశి థరూర్ కేరళ నుంచి ఢిల్లీ వచ్చారు. సునంద హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఆయనను ఎప్పుడు విచారిస్తారన్న విషయం తెలియరాలేదు. కాగా నళిని ఆరోపణలను తరార్ ఖండించారు. సునంద హత్య కేసులో పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు.