jp group
-
ఇసుక రీచ్‌ల సబ్ లీజుల దందాలో మోసగాడి అరెస్ట్
భవానీపురం (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో ఇసుక రీచ్‌లను సబ్ లీజుకు ఇప్పిస్తానంటూ పలువురిని మోసగించి కోట్ల రూపాయలను దండుకున్న నిందితుడు రామకృష్ణ చంద్రశేఖర్‌ని విజయవాడ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి ల్యాప్‌టాప్, ఫోర్జరీకి ఉపయోగించిన స్టాంప్ లు, రూ.40 వేల నగదు, సెల్‌ఫోన్, ఫోర్జరీ డాక్యుమెంట్స్, మూడు బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.1.95 లక్షల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ కేసు వివరాలను డీసీపీ–2 విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలను ప్రభుత్వం న్యూఢిల్లీకి చెందిన జేపీ గ్రూప్‌కు అప్పగించిన సంగతి తెలి సిందే. అయితే ఆ సంస్థ నుంచి తాము సబ్ కాం ట్రాక్ట్ పొందినట్లు కొందరు వ్యక్తులు తప్పుడు కాంట్రాక్ట్ కాపీలను చూపుతూ కృష్ణా జిల్లాలోని వివిధ రీచ్‌ల వద్ద హల్చల్ చేస్తున్నట్లు జేపీ గ్రూప్ కు తెలిసింది. దీనిపై ఆరా తీసేందుకు జేపీ గ్రూప్ ఫైనాన్స్ మేనేజర్ విశ్వనాథన్ సతీష్ రంగంలోకి దిగారు. విజయవాడ రూరల్ గొల్లపూడి మైలు రాయి సెంటర్ సమీపంలోని పంట కాలువ రోడ్లో ఒక ఇంట్లో ఉంటున్న కొప్పురావూరి ప్రవీణ్‌కుమార్, మల్లంపాటి శ్రీనివాసరావు, ముక్కొల్లు నాగమల్లేశ్వరరావును కలిశారు. తాము హైదరాబాద్‌కు చెందిన సుధాకర ఇన్ఫ్రా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులమని విశ్వనాథన్ సతీష్‌తో ముగ్గురు పరిచయం చేసుకున్నారు. ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలకు జేపీ గ్రూప్ నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న ట్లు రెండు జిరాక్స్ కాపీలను ఆయనకు చూపించారు. వాటిని పరిశీలించిన విశ్వనాథన్ సతీష్ అవి నకిలీ పత్రాలుగా గుర్తించి ఈ నెల 3న విజయవాడ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు 420, 465, 467, 471 రెడ్ విత్ 120(బి) ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఈ క్రమంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు ఆదేశాల మేరకు డీసీపీ–2 విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో పశ్చిమ మండల ఏసీపీ కె.హనుమంతరావు, భవానీపురం ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ డీకేఎన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభమైంది. దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గాలింపు చర్యలు చేపట్టి తూర్పుగోదావరి జిల్లా కరప మండలం నడకుదురుకు చెందిన కనుకుర్తి రామకృష్ణ చంద్రశేఖర్ (29)ని అరెస్ట్ చేశారు. నిందితుడు 2016 నుంచి 18 వరకు హైదరాబాద్‌లో ఒక ఫార్మాసూ్యటికల్ కంపెనీలో పనిచేశాడు. ఆ సమయంలో కంపెనీకి రావాల్సిన సొమ్మును తెలం గాణ ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి స్వాహా చేశాడు. ఈ కేసులో జైలుకు కూడా వెళ్లాడు. రామకృష్ణ చంద్రశేఖర్ మరికొన్ని మోసాలు.. హైదరాబాద్‌కు చెందిన కె.సురేంద్రనాథ్, వెలంపల్లి రఘు నరసింహరాజు ఇసుక రీచ్‌ల కాంట్రాక్టులు తీసుకోవాలని భావించి తమ మిత్రుడు తిరుమలరెడ్డిని సంప్రదించారు. తిరుమలరెడ్డి తన స్నేహితుడు లోకాభిరాముడుకు విషయం చెప్పారు. దీంతో లోకాభిరాముడు.. రామకృష్ణ చంద్రశేఖర్ ఈ పనిచేయించగలడని తెలిపారు. ఈ పరిస్థితిని సావకాశంగా తీసుకున్న చంద్రశేఖర్ వారందర్నీ బురిడీ కొట్టిం చాడు. సురేంద్రనాథ్, నరసింహరాజుల నుంచి రూ.5.40 కోట్లు వసూలు చేశాడు. తెలంగాణలో ఈఎస్ఐ ఆస్పత్రులకు మందుల సరఫరా కాంట్రా క్టు ఇప్పిస్తానని చెప్పి ఫార్మా కంపెనీలను నమ్మించి రూ.12 లక్షలు కొల్లగొట్టాడు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి లోకాభిరాముడి కుమారుడికి భారత్‌మాల ప్రాజెక్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.10 లక్షలు దండుకున్నాడు. లోకాభిరాముడికి ప్రభుత్వ భూములను లీజుకు ఇప్పిస్తానని చెప్పి రూ.45 లక్షలు వసూలు చేశాడు. -
ఇసుక రీచ్‌ల సబ్ లీజుల పేరిట భారీ మోసం
సాక్షి, అమరావతి/ భవానీపురం (విజయవాడ): రాష్ట్రంలో ఇసుక రీచ్‌లను సబ్ లీజుకు ఇస్తామని బురిడీ కొట్టిస్తూ రాష్ట్రంలో భారీ దందాకు పన్నాగం పన్నిన ముఠా గుట్టురట్టైంది. ఇప్పటికే ఆ ముఠా పలు జిల్లాల్లో ఇసుక రీచ్‌లు సబ్ లీజుకు ఇస్తామని చెప్పి ఏడుగురి నుంచి రూ.3.50 కోట్లు కొల్లగొట్టిందని వెలుగు చూసింది. ఈ ముఠాకు చెందిన ఆరుగురిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో ఇసుక రీచ్‌ల తవ్వకాల కోసం నిర్వహించిన టెండర్లను ఢిల్లీకి చెందిన జయప్రకాశ్ (జేపీ) గ్రూప్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా జేపీ గ్రూప్ నుంచి ఇసుక రీచ్‌ల సబ్ లీజు కాంట్రాక్టు తాము పొందామని సుధాకర ఇన్ఫ్రా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఓ ముఠా ఘరానా మోసానికి తెరతీసింది. హైదరాబాద్ చిరునామాతో ఆ కంపెనీని ఏర్పాటు చేసినట్టు చెబుతూ విజయవాడ గొల్లపూడిలోని ఓ ఇంటి నుంచి దందా మొదలుపెట్టింది. ఇందుకోసం రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సంతకాన్ని సైతం ఫోర్జరీ చేసి మరీ డాక్యుమెంట్లు సృష్టించింది. ఇసుక రీచ్‌లు కావాలంటే రూ.40 కోట్లు చెల్లించాలంటూ.. సుధాకర ఇన్ఫ్రా టెక్ కంపెనీకి సబ్ లీజుకు కోట్ల రూపాయలు చెల్లించిన కొందరు తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక రీచ్‌లలో తవ్వకాలకు ప్రయత్నించగా జేపీ గ్రూప్ సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో తాము సుధాకర ఇన్ఫ్రా టెక్ కంపెనీ నుంచి సబ్ లీజుకు తీసుకున్నామని చెప్పడంతో జేపీ గ్రూప్ సిబ్బంది నివ్వెరపోయారు. ఈ విషయాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్ఈబీ అధికారులు, జేపీ గ్రూప్ ప్రతినిధులు కలిసి ఈ ఇసుక సబ్ లీజుల అక్రమ బాగోతాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు. జేపీ గ్రూప్ మేనేజర్ విశ్వనాథన్ సతీష్ విజయవాడ భవానీపురంలోని సుధాకర ఇన్ఫ్రా టెక్ కంపెనీ ప్రతినిధులు ఉన్న ఇంటికి వెళ్లి ఇసుక రీచ్‌ల సబ్‌లీజు కోసం వచ్చానని చెప్పారు. ఈ క్రమంలో కొప్పురావూరి ప్రవీణ్ కుమార్, మల్లంపాటి శ్రీనివాసరావు, ముక్కోలు నాగమల్లేశ్వరరావు తమను తాము సుధాకర ఇన్ఫ్రా టెక్ కంపెనీ ప్రతినిధులుగా పరిచయం చేసుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో మూడేళ్లపాటు ఇసుక రీచ్‌లు సబ్ లీజుకు ఇచ్చేందుకు రూ.40 కోట్లు చెల్లించాలని చెప్పారు. తమ కంపెనీ జేపీ గ్రూప్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్‌లను సబ్ లీజుకు తీసుకున్నట్టు సృష్టించిన ఫోర్జరీ పత్రాలు చూపించారు. సుధాకర ఇన్ఫ్రా టెక్ కంపెనీ ప్రతినిధి కె.సురేంద్రనాథ్ తమ కంపెనీ తరఫున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇసుక రీచ్‌లను సబ్ లీజుకు ఇచ్చే అధికారాన్ని నీలాపు తిరుమలరెడ్డి (విశాఖపట్నం), వెలంపల్లి రఘు నరసింహరాజు (హైదరాబాద్)లకు అప్పగించినట్టు మరో ఫోర్జరీ పత్రాలను చూపారు. వారిని నమ్ముతున్నట్టుగానే వ్యవహరించిన జేపీ గ్రూప్ ప్రతినిధి సతీష్ అక్కడ నుంచి వచ్చేశారు. అనంతరం తమ కంపెనీ పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్న ఆరుగురిపై భవానీపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణలోనూ ఫోర్జరీ పత్రాలతో మోసం పోలీసులు ఘరానా మోసానికి పాల్పడుతున్న కొప్పురావూరి ప్రవీణ్ కుమార్, మల్లంపాటి శ్రీనివాసరావు, ముక్కోలు నాగ మల్లేశ్వరరావు, సురేంద్రనాథ్, నీలాపు తిరుమలరెడ్డి, వెలంపల్లి రఘు నరసింహరాజు, తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంపై కూపీ లాగగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా ఇప్పటికే వివిధ జిల్లాల్లో ఇసుక రీచ్‌లను సబ్లీజుకు ఇస్తామని చెప్పి రూ.3.50 కోట్లు వసూలు చేసినట్టు వెల్లడైంది. ఆ కంపెనీ బ్యాంకు ఖాతాల్లో రూ.2 కోట్లు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ ముఠా గతంలో తెలంగాణలో కూడా ఫోర్జరీ పత్రాలతో మోసానికి పాల్పడటంతో సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. విజయవాడ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. -
సుప్రీం వార్నింగ్ : తిహార్ జైలు ఎంతో దూరంలో లేదు
న్యూఢిల్లీ : కొనుగోలుదారులకు సరియైన సమయంలో ఫ్లాట్లను అందజేయకుండా చేతులెత్తేసిన జేపీ అసోసియేట్స్‌కు మరోసారి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. తాము అంతకముందు ఆదేశించిన రూ.125 కోట్లను డిపాజిట్ చేయాలని, లేదా కోర్టు ధిక్కార కేసు కింద తిహార్ జైలుకి పంపించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. తిహార్ జైలు ఎంతో దూరంలో లేదంటూ కూడా వ్యాఖ్యానించింది. జేపీ ఇన్ఫ్రాటెక్ ఇళ్లు కొనుగోలుదారులు తమ నగదును రీఫండ్ కోరడంతో, రూ.2000కోట్లను జేపీ అసోసియేట్స్ తమ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఆ రూ.2000 కోట్లలో భాగమే రూ.125 కోట్లు. జనవరి 25 వరకు ఈ రూ.125 కోట్లను డిపాజిట్ చేయాలని జేపీ అసోసియేట్స్‌కు తెలిపింది. ఈ గ్రూప్ నిర్మిస్తున్న అన్ని హౌజింగ్ ప్రాజెక్ట్‌ల జాబితాతో జేపీ అసోసియేట్స్ అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా టాప్ కోర్టు బెంచ్ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచుద్ ఆదేశించారు. దివాలా చట్టం కింద జేపీ అసోసియేట్స్‌పై చర్యలు తీసుకోవడానికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ఆమోదాన్ని కోరుతోది. కానీ దివాలా చట్టం ప్రయోగిస్తే కొనుగోలుదారులు నష్టపోవాల్సి వస్తుందని తెలిసింది. -
నిర్ణయం జేపీ గ్రూప్‌దే!
ఇండియన్ గ్రాండ్‌ప్రిపై ఎకెల్‌స్టోన్ వ్యాఖ్య న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఇండియన్ గ్రాండ్ ప్రి జరగడం రేస్ ప్రమోటర్ జేపీ గ్రూప్‌పైనే ఆధారపడి ఉందని ఎఫ్-1 చీఫ్ బెర్నీ ఎకెల్‌స్టోన్ అన్నారు. ఈ విషయం తేల్చుకోవడానికి వాళ్లకు చాలా తక్కువ సమయం ఉందని స్పష్టం చేశారు. ఓవరాల్‌గా జేపీ గ్రూప్ స్పందన కోసం తాము వేచి చూస్తున్నామని చెప్పిన ఆయన భారత్‌లో రేసు జరిగితే బాగుంటుందన్నారు. ‘దాదాపు ఆరు నెలల తర్వాత జేపీఎస్ఐ చీఫ్ సమీర్ గౌర్తో జరిగిన చర్చలు ఫలవంతంగా ముగిశాయి. 2016లో రేసు నిర్వహణ కోసం కసరత్తులు చేస్తున్నారు. రష్యా గ్రాండ్ ప్రి సందర్భంగా జరిగిన చర్చల్లో కూడా సానుకూలాంశాలే కనిపించాయి. కాబట్టి ఇండియన్ గ్రాండ్ ప్రి జరుగుతుందని నమ్ముతున్నా’ అని ఎకెల్‌స్టోన్ పేర్కొన్నారు. -
హైడ్రో పవర్లో హైఓల్టేజీ డీల్స్!
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్: జేపీ గ్రూప్‌నకు చెందిన హైడ్రో పవర్ ప్రాజెక్టులను రూ. 12,300 కోట్లకు అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ పవర్ కొనుగోలు చేయడంతో స్థానిక పారిశ్రామిక వేత్తల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రూ. లక్ష కోట్ల రుణ భారంతో తల్లడిల్లుతున్న జీఎంఆర్, ల్యాంకో, జీవీకే లాంటి సంస్థలకు ఈ పరిణామాలు ఎంతో ఆసక్తిని రేకిత్తిస్తున్నాయి. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించ తలపెట్టిన పలు విద్యుదుత్పాదన సంస్థలు తమ వాటాల విక్రయానికి సుముఖుత చూపుతున్నాయని పవర్ ప్రాజెక్టుల కన్సల్టెంట్ పీపీ రావు తెలిపారు. తెలంగాణా, ఏపీ రాష్ట్రాలకు చెందిన కేఎస్కే ఎనర్జీ, సాయి కృష్ణోదయా , కోస్టల్ ప్రాజెక్ట్స్, జీఎంఆర్, ఎథీనా ఎనర్జీ వెంచర్స్, నవయుగ ఇంజీనీరింగ్, సోమ ఎంటర్‌ప్రెజైస్ లాంటి సంస్థలు బ్రహ్మపుత్ర నదిపై జలవిద్యుత్కేంద్రాలను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించుకున్నాయి. ప్రాజెక్టు ప్రారంభించేందుకు కావాల్సిన అన్ని అనుమతులు పొందాయి. అయితే అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రాజెక్టులు నిర్వహించేందుక అవసరమైన వనరులు సకాలంలో సమీకరించలేకపోవడంతో పలు కంపెనీలు మధ్యలో నే ఆపేశాయి. హైదరాబాద్‌కు చెందిన సర్వోమ్యాక్స్ సంస్థ అరుణాచల్ ప్రదేశ్‌లో చేపట్టిన మినీ హైడల్ పవర్ప్రాజెక్టు నిర్మాణంలో బాలారిష్టాలు దాటి పురోగతి సాధించిన స్థానిక సమస్యల కారణంగా ఇటీవలే ప్రాజెక్టు కార్యాలయాన్ని మూసేసింది. జీవీకే పవర్ సంస్థకు జమ్ము కాశ్మీర్లో రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు (850 మెగావాట్ల), ఉత్తరాఖండ్‌లో శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (330 మెగావాట్లు), బోగుడియార్ శ్రీకార్ భోల్ (146 మెగావాట్లు), మాపాంగ్ బోగుడియార్ (200 మెగావాట్ల) హౌడ్రో పవర్ ప్రాజెక్టులున్నాయి. జీఎంఆర్ సంస్థకు నేపాల్‌లో అప్పర్ కునాలి (900 మెగావాట్ల) ప్రాజెక్టు, హిమతాల్ (600 మెగావాట్ల) ప్రాజెక్టు, అరుణాచల్ ప్రదేశ్‌లో తెలాంగ్లో జీఎంఆర్ ఎనర్జీ (225 మెగావాట్లు) జలవిద్యుత్‌కు సంబంధించిన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. జీఎంఆర్ ఎనర్జీకి ఉత్తరాఖండ్లోనిఅలకనందాలో 300 మెగావాట్ల ప్రాజెక్టు కూడా ఉంది. ల్యాంకో గ్రూప్‌నకు ఉత్తరాఖండ్‌లో ఫటా బీయుంగ్ (76 మెగావాట్లు), రంబారా (76 మెగాయూనిట్లు), ల్యాంకో మందాకినీ హైడ్రో పవర్ ( 76 మెగావాట్లు), సిక్కిం రాష్ట్రంలో ల్యాంకో తీస్తా హైడ్రో పవర్ (500 మెగావాట్లు), హిమాచల్ ప్రదేశ్‌లోని బుడిల్ ప్రాజెక్టు (70 మెగావాట్లు)లు ఉన్నాయి. అరుణాచల్ ప్రాజెక్టుల ఆకర్షణ ఇదీ... జమ్ము కాశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో జలవిద్యుత్ వనరులను అభివృద్ధి చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం 2008లో హైడ్రో పవర్ అభివృద్ధి విధానాన్ని ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థలతో దీటుగా ప్రైవేట్ సంస్థలకూ పలు రాయితీలను ప్రకటించారు. అందులో ప్రధానంగా కాస్ట్ ప్లస్ టారిఫ్ విధానం. దీని ప్రకారం విద్యుత్కేంద్రంపై వెచ్చించిన వ్యయాలను డెవలపర్ రాబట్టుకునేందకు వీలుగా సేలబుల్ ఎన ర్జీలో 40 శాతం మర్చంట్ విక్రయాల రాయితీని ప్రకటించారు. మరో ఆకర్షణ మెగా పవర్ ప్రాజెక్టు పాలసీ. సాధారణంగా మెగా పవర్ ప్రాజెక్టు స్థాయి పొందాలంటే కనీసం వెయ్యి మెగావాట్ల సామర్థ్యం ఉండాలి. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సామర్థ్యాన్ని 350 మెగా వాట్లకే కుదించారు. మెగాపవర్ ప్రాజెక్టులకు క్యారేజీ టారిఫ్‌లో పది శాతం పన్ను రాయితీ ఉంటుంది. జీఎంఆర్ జల విద్యుత్కేంద్రాలను గుజరాత్‌కు చెందిన అదానీ పవర్ కొనుగోలు చేయనుందన్న మార్కెట్ వర్గాల సమాచారంపై జీఎంఆర్ అధికార ప్రతినిధి స్పందిస్తూ ప్రస్తుతం తాము ఆ దిశగా ఆలోచించడం లేదన్నారు. మార్కెట్ వర్గాల అంచనాలకు అధికార వివరణ ఇవ్వలేమని సాక్షి ప్రతినిధికి తెలిపారు. అలాగే ల్యాంకో పవర్‌కు చెందిన సంస్థలను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు వస్తున్న వార్తలపై ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నరశింహన్ స్పందిస్తూ ఇది పూర్తిగా నిరాధారమూ, ఊహా జనితమైన మార్కెట్ కల్పన అని అన్నారు. అయితే జేపీ-రిలయన్స్ పవర్ డీల్ నేపథ్యంలో స్థానిక కంపెనీలు కూడా వాటి విద్యుత్ ప్రాజెక్టులను విక్రయించవచ్చనే మార్కెట్ వర్గాలు గట్టిగా విశ్వసిస్తున్నాయి. జేపీ డీల్‌ను మిస్సయిన ఆదాని గ్రూప్ వీటిలో కొన్ని హైడ్రో ప్రాజెక్టుల కొనుగోలుకు ముందుకు రావచ్చన్నది ఆ వర్గాల సమాచారం.