సాక్షి, అమరావతి/ భవానీపురం (విజయవాడ): రాష్ట్రంలో ఇసుక రీచ్‌లను సబ్ లీజుకు ఇస్తామని బురిడీ కొట్టిస్తూ రాష్ట్రంలో భారీ దందాకు పన్నాగం పన్నిన ముఠా గుట్టురట్టైంది. ఇప్పటికే ఆ ముఠా పలు జిల్లాల్లో ఇసుక రీచ్‌లు సబ్ లీజుకు ఇస్తామని చెప్పి ఏడుగురి నుంచి రూ.3.50 కోట్లు కొల్లగొట్టిందని వెలుగు చూసింది. ఈ ముఠాకు చెందిన ఆరుగురిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో ఇసుక రీచ్‌ల తవ్వకాల కోసం నిర్వహించిన టెండర్లను ఢిల్లీకి చెందిన జయప్రకాశ్ (జేపీ) గ్రూప్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా జేపీ గ్రూప్ నుంచి ఇసుక రీచ్‌ల సబ్ లీజు కాంట్రాక్టు తాము పొందామని సుధాకర ఇన్‌ఫ్రా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఓ ముఠా ఘరానా మోసానికి తెరతీసింది. హైదరాబాద్ చిరునామాతో ఆ కంపెనీని ఏర్పాటు చేసినట్టు చెబుతూ విజయవాడ గొల్లపూడిలోని ఓ ఇంటి నుంచి దందా మొదలుపెట్టింది. ఇందుకోసం రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సంతకాన్ని సైతం ఫోర్జరీ చేసి మరీ డాక్యుమెంట్లు సృష్టించింది.
ఇసుక రీచ్‌లు కావాలంటే రూ.40 కోట్లు చెల్లించాలంటూ..
సుధాకర ఇన్‌ఫ్రా టెక్ కంపెనీకి సబ్ లీజుకు కోట్ల రూపాయలు చెల్లించిన కొందరు తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక రీచ్‌లలో తవ్వకాలకు ప్రయత్నించగా జేపీ గ్రూప్ సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో తాము సుధాకర ఇన్‌ఫ్రా టెక్ కంపెనీ నుంచి సబ్ లీజుకు తీసుకున్నామని చెప్పడంతో జేపీ గ్రూప్ సిబ్బంది నివ్వెరపోయారు. ఈ విషయాన్ని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్‌ఈబీ అధికారులు, జేపీ గ్రూప్ ప్రతినిధులు కలిసి ఈ ఇసుక సబ్ లీజుల అక్రమ బాగోతాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు. జేపీ గ్రూప్ మేనేజర్ విశ్వనాథన్ సతీష్ విజయవాడ భవానీపురంలోని సుధాకర ఇన్‌ఫ్రా టెక్ కంపెనీ ప్రతినిధులు ఉన్న ఇంటికి వెళ్లి ఇసుక రీచ్‌ల సబ్‌లీజు కోసం వచ్చానని చెప్పారు.
ఈ క్రమంలో కొప్పురావూరి ప్రవీణ్ కుమార్, మల్లంపాటి శ్రీనివాసరావు, ముక్కోలు నాగమల్లేశ్వరరావు తమను తాము సుధాకర ఇన్‌ఫ్రా టెక్ కంపెనీ ప్రతినిధులుగా పరిచయం చేసుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో మూడేళ్లపాటు ఇసుక రీచ్‌లు సబ్ లీజుకు ఇచ్చేందుకు రూ.40 కోట్లు చెల్లించాలని చెప్పారు. తమ కంపెనీ జేపీ గ్రూప్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్‌లను సబ్ లీజుకు తీసుకున్నట్టు సృష్టించిన ఫోర్జరీ పత్రాలు చూపించారు. సుధాకర ఇన్‌ఫ్రా టెక్ కంపెనీ ప్రతినిధి కె.సురేంద్రనాథ్ తమ కంపెనీ తరఫున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇసుక రీచ్‌లను సబ్ లీజుకు ఇచ్చే అధికారాన్ని నీలాపు తిరుమలరెడ్డి (విశాఖపట్నం), వెలంపల్లి రఘు నరసింహరాజు (హైదరాబాద్)లకు అప్పగించినట్టు మరో ఫోర్జరీ పత్రాలను చూపారు. వారిని నమ్ముతున్నట్టుగానే వ్యవహరించిన జేపీ గ్రూప్ ప్రతినిధి సతీష్ అక్కడ నుంచి వచ్చేశారు. అనంతరం తమ కంపెనీ పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్న ఆరుగురిపై భవానీపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణలోనూ ఫోర్జరీ పత్రాలతో మోసం
పోలీసులు ఘరానా మోసానికి పాల్పడుతున్న కొప్పురావూరి ప్రవీణ్ కుమార్, మల్లంపాటి శ్రీనివాసరావు, ముక్కోలు నాగ మల్లేశ్వరరావు, సురేంద్రనాథ్, నీలాపు తిరుమలరెడ్డి, వెలంపల్లి రఘు నరసింహరాజు, తదితరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంపై కూపీ లాగగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా ఇప్పటికే వివిధ జిల్లాల్లో ఇసుక రీచ్‌లను సబ్‌లీజుకు ఇస్తామని చెప్పి రూ.3.50 కోట్లు వసూలు చేసినట్టు వెల్లడైంది. ఆ కంపెనీ బ్యాంకు ఖాతాల్లో రూ.2 కోట్లు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ ముఠా గతంలో తెలంగాణలో కూడా ఫోర్జరీ పత్రాలతో మోసానికి పాల్పడటంతో సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. విజయవాడ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇసుక రీచ్‌ల సబ్ లీజుల పేరిట భారీ మోసం
Published Fri, Jun 11 2021 4:02 AM | Last Updated on Fri, Jun 11 2021 4:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment