jubilee hills building issue
-
జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీకి హైకోర్టు షాక్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. కొత్త సభ్యత్వాలను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మంచిరేవులలోని జూబ్లీహిల్స్-4 ప్లాట్ల అమ్మకంపై కూడా ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టొద్దని ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.కాగా, కొందరు వ్యక్తులు స్వలాభాపేక్షతో సొసైటీని ఆర్థిక వనరుగా మార్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వారు కొన్నేళ్లుగా సొసైటీని తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండగా, ఈ క్రమంలో పాతవారికి స్థలాలు మంజూరు కాకుండానే కొత్తగా సభ్యులను చేర్చుకునే అక్రమానికి తెరలేపారనే విమర్శలు ఉన్నాయి.సహకార హౌసింగ్ సొసైటీలు ఏవైనా.. సొసైటీలో ఇల్లు లేని వారికి తక్కువ ధరతో స్థలం అందేలా చూడటం, సభ్యులు చెల్లించే సొమ్మును, వారి ప్రయోజనాలను పరిరక్షించడం వాటి విధి. కానీ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అందుకు పూర్తి విరుద్ధంగా తయారైంది. 1962లో ఎంతో మంచి ఉద్దేశంతో ఏర్పాటైన ఈ సొసైటీ.. కొన్నేళ్ల నుంచి రూట్ మార్చుకుంది. చట్టాన్ని పట్టించుకునేది లేదు.. నిబంధనలను అమలు చేసేది లేదు.. పాలక వర్గానికి తోచిందే చట్టం, వారు పెట్టిందే నిబంధన అన్నట్టు మారింది.ఇదీ చదవండి: ‘జూబ్లీహిల్స్’.. అక్రమాలు ఫుల్! -
బెదిరించి.. 2 గంటల పాటు గదిలో బంధించి.. ఆపై
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ తనను బెదిరింపులకు గురిచేయడంతో పాటు రెండుగంటల పాటు గదిలో బంధించారంటూ కార్యదర్శి మురళీ ముకుంద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం జరిగిన పాలకమండలి సమావేశంలో అధ్యక్షుడు రవీంద్రనాథ్‌తో పాటు కొంతమంది సభ్యులు రికార్డు గది తాళాలను చేజిక్కించుకునేందుకు ప్రయత్నించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ► మార్చిలో జరిగిన పాలకమండలి ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో అధ్యక్షుడిగా రవీంద్రనాథ్, కార్యదర్శిగా మురళీ ముకుంద్తో పాటు పాలకమండలి ఏర్పాటైంది. కొన్నిరోజులుగా పాలకమండలిలోని సభ్యుల మధ్య విభేదాలు నడుస్తున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్‌నెం–78లోని స్థలం కేటాయింపు వ్యవహారంలో అధ్యక్షుడు రవీంద్రనాథ్‌తో పాటు కోశాధికారిపై ఆరోపణలు రావడంతోపాటు కేసు నమోదైంది. ► సొసైటీలో గతంలో చేసిన అవకతవకలకు వ్యతిరేకంగా గెలిచిన కొత్త ప్యానెల్‌పై కూడా అవినీతి మరకపడటంతో పాలకమండలి సభ్యుల్లో కొంతమంది మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాలకమండలి సమావేశంలో రసాభాసా చోటు చేసుకుంది. సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌కు, కార్యదర్శి మురళీముకుంద్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ► సొసైటీలో జరిగిన వ్యవహారాలపై సాక్ష్యాలుగా ఉండే కొన్ని ఫైళ్లు మాయమైనట్లు ఆరోపణలు రావడంతో ఈ విషయంపై జోరుగా చర్చ నడిచినట్లు తెలుస్తోంది. కాగా సొసైటీ రికార్డు రూమ్ తాళాలను తనకు ఇవ్వాలంటూ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌తో పాటు కొంతమంది సభ్యులు తనను విపరీతమైన ఒత్తిడికి గురిచేశారని, తనను సుమారు 2గంటల పాటు గదిలో బంధించారంటూ గురువారం సాయంత్రం సొసైటీ కార్యదర్శి మురళీ ముకుంద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ► సొసైటీ బైలాస్ ప్రకారం లాకర్ రూమ్‌లోని ఫైళ్లను కాపాడడం తన బాధ్యత అని, తాళాలను లాక్కోవడం కోసం ప్రయతి్నంచడంతోపాటు తనను బెదిరింపులకు గురిచేసిన సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ తదితరులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ► పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రికార్డు గదిని సీజ్ చేశారు. సొసైటీలో గందరగోళ పరిస్థితి నెలకొందని, వెంటనే ప్రత్యేక అధికారిని నియమించి ఫైళ్లను రక్షించాలంటూ కార్యదర్శి మురళీముకుంద్ సహకారశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా మురళీ ముకుంద్ ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. -
నాకు సంబంధం ఉందని నిరూపించు!
జూబ్లీహిల్స్‌లో భవనంపై బాబుకు పి.రవీంద్రనాథ్‌రెడ్డి సవాల్ ఆరోపణలు చేస్తున్న నీరజారావుకు త్వరలో టీడీపీ టికెట్! కడప, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 2లో జీహెచ్ఎంసీ కూల్చిన భవనానికి, తనకు ఎటువంటి సంబంధం లేదని కడప మాజీ మేయర్, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తనకు సంబంధముందని మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ విసిరారు. దీనిపై ఏ వేదికపై అయినా సరే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. తనది తప్పయితే చంద్రబాబు కాళ్లు పట్టుకుంటానని, లేదంటే ఆయన తన కాళ్లు పట్టుకోవాలని సవాల్ విసిరారు. మంగళవారం వైఎస్ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనంతపురం రైలు ప్రమాదంలో 26 మంది చనిపోయి అనేకమంది గాయాల పాలైతే పరామర్శించడానికి సమయం లేని చంద్రబాబుకు 420 గజాల స్థల వివాదంపై పరిశీలనకు వెళ్లడానికి మాత్రం టైమ్ ఉందా అంటూ ఎద్దేవా చేశారు. అందుకే నీరజారావు ఆరోపణలు.. కొన్ని పత్రికలు, చానెళ్లతో కుమ్మక్కై చంద్రబాబు డ్రామా ఆడిస్తున్నారని రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. భూమి విషయంలో తమపై ఆరోపణలు చేస్తున్న నీరజారావు ఎవరా అని విచారిస్తే ఆమె టీవీ9 చానల్లో మహారాష్ట్ర వింగ్ చూస్తున్నారని, గతంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా పనిచేశారని తెలిసిందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఆమెకు టీడీపీ టికెట్ ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురదచల్లడానికి తనను పావుగా వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తన హయాంలో జరిగిన కుంభకోణాలు, ఆయన ఆస్తుల వివరాలను బయట పెట్టాలన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో 1600 ఎకరాలు ఎక్సెస్ ల్యాండ్ అని ట్రిబ్యునల్ తీర్పునిస్తే చంద్రబాబుకు అది ఎందుకు కనిపించదని ప్రశ్నించారు.