ట్రంప్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ!
వాషింగ్టన్: ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎద్దురు దెబ్బతగిలింది. ఏడు దేశాల ముస్లిం ప్రజలపై అధ్యక్షుడు విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ సియాటిల్ కోర్టు ఆదేశాలిచ్చింది. అమెరికా జిల్లాకోర్టు న్యాయమూర్తి జేమ్స్ ఎల్ రాబర్ట్ శుక్రవారం ఈ ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేశారు. వాషింగ్టన్ రాష్ట్ర అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గూసన్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించి జడ్జి ఈ ఆదేశాలిచ్చారు. దేశవ్యాప్తంగా ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
ఈ ఆదేశాలపై స్పందించిన అటర్నీ జనరల్ ఫెర్గూసన్ రాజ్యాంగం నేడు విజయం సాధించిందనీ, ప్రెసిడెంట్ తో సహా అందరూ చట్టానికి అతీతులు కారని వ్యాఖ్యానించారు. ప్రజలపై మతపరమైన వివక్షను ప్రదర్శించడం, నిషేధం విధించడం రాజ్యాంగ విరుద్ధమని ఫెర్గూసన్ తెలిపారు. ట్రంప్ నిషేధం పై దావా వాషింగ్టన్ రాష్ట్రం దాఖలు చేయగగా, ఆ తరువాత మిన్నెసోటా కూడా జత కలిసింది.
కాగా ఏడు ముస్లిం దేశాలకు చెందిన వారు అమెరికా రాకుండా ట్రంప్ విధంచిన ఆంక్షల ఆదేశాలపై అమెరికా పౌర హక్కుల నేతల పిటిషన్‌ను విచారించిన డిస్ట్రిక్ట్ కోర్టు ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అటు ట్రంప్ వివాదాస్పద నిర్ణయంపై వ్యతిరేకంగా అమెరికా టెక్ దిగ్గజాలుకూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ట్రావెల్ బ్యాన్ ఆదేశాలపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికాలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే.