డోనాల్డ్ ట్రంప్ వీసా ఆంక్షలు ఎత్తివేత!
వాషింగ్టన్: అమెరికాకు ఏడు ముస్లిం దేశాల నుంచి వలసలపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధాన్ని అధికారులు తాత్కాలికంగా రద్దుచేశారు. అధ్యక్షుడు ట్రంప్ విధించిననిషేధంపై ఇటీవల సియాటిల్ కోర్టు స్పందిస్తూ.. నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. అయితే నేటి నుంచి పూర్తిస్థాయిలో కోర్టు ఉత్తర్వులను పాటించనున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. వీసా ఉన్న వారిని పూర్తి స్థాయిలో అమెరికాకు అనుమతిస్తున్నామని, వారిపై ఎలాంటి నియంత్రణ ఉండబోదని స్పష్టం చేశారు.
వీసా ఆంక్షలను ఎత్తివేయడంతో అమెరికా, ఇతర దేశాల దేశాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ నిషేధిత దేశాల ప్రయాణికులను ఖతర్ ఎయిర్ వేస్ విమానాల్లోకి అనుమతిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ట్రంప్ మాత్రం తనమీద అంతర్జాతీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా తన మాటకే కట్టుబడ్డారు. మధ్యలో ఒక్కసారి మాత్రం గ్రీన్ కార్డులు ఉన్నవారికి మినహాయింపు ఇచ్చినా, నిషేధం యథాతథంగా ఉంటుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశం నుంచి శాంతిభద్రతలను తరిమివేస్తున్నారని ఆరోపించిన ట్రంప్.. ఒక జడ్జి తన నిర్ణయాన్ని తప్పుబట్టడంపై కూడా మండిపడ్డారు.