junior students
-
నోట్స్ రాయలేదని
మేడ్చల్: నోట్స్ రాయలేదనే కారణంగా జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ మండలం గౌడవెళ్లి గ్రామ పరిధిలోని హితం ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ఈ ఘటన జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నగరానికి చెందిన ఓ విద్యార్థి హితం ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్ఈ మొదటి సంవత్సరం చదవుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం కొంతమంది సీనియర్ విద్యార్థులు తమ నోట్స్ రాసిపెట్టాలని జూనియర్‌కు హుకుం జారీ చేశారు. పరీక్షలు దగ్గరపడుతున్నందున తాను చదుకోవాలని, ఎవరి నోట్స్‌ను తాను రాయనని జూనియర్ సమాధానమిచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన సీనియర్ విద్యార్థులు జూనియర్‌ను కళాశాల క్యాంటీన్‌కు రప్పించి వెకిలి చేష్టలతో ర్యాగింగ్ చేశారు. జూనియర్ ఎదురుతిరగడంతో అతనిపై దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం ఇద్దరినీ పిలిచి మందలించి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిసింది. గురువారం కొంతమంది మీడియాకు ఈ ఘటనపై సమాచారం ఇచ్చారు. ర్యాగింగ్ కాదు.. చిన్న గొడవ తమ కళాశాలలో ఎలాంటి ర్యాగింగ్ ఘటనా జరగలేదని, ర్యాగింగ్ నిరోధానికి తాము గట్టి చర్యలు తీసుకున్నామని హితం కళాశాల ప్రతినిధి మిజాబ్ తెలిపారు. బుధవారం కళాశాల క్యాంటీన్లో జూనియర్ విద్యార్థికీ, సీనియర్ విద్యార్థులకూ మధ్య చిన్న గొడవ జరిగిందని, ఇద్దరితో మాట్లాడి విషయాన్ని సెటిల్ చేశామని తెలిపారు. కాగా, హితం కళాశాలలో ర్యాగింగ్ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ఎస్వీఆర్ట్స్ కళాశాలలో ర్యాగింగ్
తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై మొదటి సంవత్సర విద్యార్థులు క్యాంపస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రెండో సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి... ఆర్ట్స్ కళాశాలలోని శ్రీ వాస్తవ వసతి గృహంలో ఉంటున్న జూనియర్ విద్యార్థులు మెస్‌కు షార్ట్‌లు వేసుకొని వెళ్తున్నారు. దీంతో సీనియర్లు జోక్యం చేసుకొని మెస్‌కు షార్ట్ వేసుకొని రావొద్దని హెచ్చరించారు. అయినా జూనియర్లలో మార్పు రాకపోవడంతో బుధవారం గట్టిగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీనియర్, జూనియర్ల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్బంలో సీనియర్లు, జూనియర్లపై చేయి చేసుకున్నారు. దీంతో మనస్థాపానికి గురైన ఇద్దరు విద్యార్థులు క్యాంపస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. -
అమ్మో.. ర్యాగింగ్ భూతం!
నెల్లూరు(అర్బన్): నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. ర్యాగింగ్ పేరిట జూనియర్లను సీనియర్లు హింసిస్తున్నారు. పవిత్రమైన వైద్య విద్యను అభ్యసించాల్సిన చోట ర్యాగింగ్ పేరిట రెండు గ్రూపులుగా మారారు. ర్యాగింగ్ గొడవ గత పదిహేనురోజులుగా జరుగుతున్నప్పటికీ అధికారులు నిలువరించలేకపోయారని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జూనియర్లు, వారి తల్లిదండ్రులు సోమవారం నేరుగా ప్రిన్సిపాల్‌తో గొడవకు దిగారు. ఐదుగురు విద్యార్థులపై కేసునమోదు చేయాలని ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఇద్దరు మహిళా మెడికో విద్యార్థులపై ఫిర్యాదు చేస్తూ వారిని మందలించాలని కోరారు. దీంతో నిషేధంలో ఉన్న ర్యాగింగ్ విషయం రాష్ట్రంలో మరోసారి సంచలనమైంది. మాట వినకపోతే కొడుతున్నారు గత పదిహేనురోజులుగా సీనియర్లు జూనియర్లను బెదిరిస్తూ పనులు చేయించుకుంటున్నారు. అంగడికి పోయిరమ్మనడం, దుస్తులు ఉతకమనడం, రన్నింగ్ చేయమని చెప్పడం లాంటివి చేస్తున్నారు. తినే భోజనాన్ని లాగేయడం , బోర్డులపై బొమ్మలేయమనడం చేశారు. మాట వినకపోతే గదిలో ఉంచి కొడుతున్నట్టు ఫిర్యాదులందాయి. సీనియర్ మహిళా విద్యార్థులు కూడా తమ జూనియర్లను ఇబ్బందులు పెట్టారు. దీంతో బాధలు భరించలేని జూనియర్స్ తిరగబడ్డారు. ఈనెల 22న పెద్దఎత్తున గొడవ జరిగింది. సీనియర్లు, జూనియర్లు నెట్టుకున్నారు. ఆరోజే జూనియర్లు ప్రిన్సిపాల్ కృష్ణమూర్తిశాస్త్రీకి సీనియర్లపై ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ విచారించి మందలించారు. ఆరోజే సస్పెండ్ చేస్తామని హెచ్చరించడంతో సీనియర్లు ప్రిన్సిపాల్‌ను బతిమాలుకుని ఇక మీదట తప్పు చేయమని లెంపలేసుకున్నారు. దీంతో వదిలేశారు. చంపేస్తామంటూ బెదిరింపులు ఆదివారం రాత్రి మరోమారు హాస్టల్లో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కొందరు జూనియర్లు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఒక మెడికో తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సీనియర్లు తాగొచ్చి తనను చంపేస్తామంటున్నారని వాపోయాడు. దీంతో విద్యార్థి తండ్రి 200 కిలోమీటర్ల నుంచి రాత్రికిరాత్రే బయలుదేరి నెల్లూరు వచ్చారు. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పాడు. ఇలా పలువురు జూనియర్ల తల్లిదండ్రులు సోమవారం కళాశాలకు వచ్చి ప్రిన్సిపాల్‌తో గొడవకు దిగారు. ప్రిన్సిపాల్ తాను చేపట్టిన చర్యలు గురించి వారికి వివరించి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఈలోపు ఘర్షణ పెద్దదైంది. పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసుస్టేషన్‌కు విద్యార్థుల తరలింపు ర్యాగింగ్‌కి ప్రధాన కారకులంటూ తల్లిదండ్రులు సందీప్‌సాగర్, యాహియా, ఉదయభాస్కర్, సాయికిశోర్, సాయితేజ అనే సీనియర్లపై ఫిర్యాదుచేశారు. వారిని అరెస్టుచేయాలని డిమాండ్ చేశారు. మరో ఇద్దరు అమ్మాయిలు నోయిల్, ప్రసన్నతేజలకు వార్నింగ్ ఇవ్వాలని కోరారు. దీంతో పోలీసులు ఆ ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేసి సాయంత్రం వరకు ఐదో నగర పోలీసుస్టేషన్లో ఉంచారు. ఈలోపు ఇరువర్గాల తల్లిదండ్రులతో ప్రిన్సిపాల్ చర్చలు జరిపారు. విద్యార్థుల భవిష్యతు దెబ్బతింటుందని నచ్చజెప్పారు. ఐదుగురిని రెండు నెలల పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తున్నామంటూ ప్రిన్సిపాల్ ప్రకటించారు. దీంతో శాంతించిన జూనియర్ల తల్లిదండ్రులు కేసు ఉపసంహరించుకున్నారు. సీనియర్ల తల్లిదండ్రుల చేత ఇక భవిష్యత్‌లో ఎలాంటి తప్పులు చేయబోమని లెటర్లు రాయించుకుంటామని ప్రిన్సిపాల్ ప్రకటించారు. -
పాలిటెక్నిక్ హాస్టల్లో ర్యాగింగ్
హైదరాబాద్: ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా ర్యాగింగ్‌కు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా సీనియర్ విద్యార్థుల వికృత చేష్టలకు రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లోని జూనియర్ విద్యార్థులు బలయ్యారు. తమ గదికి రావాలంటూ వేధించిన సీనియర్ విద్యార్థులు అందుకు నిరాకరించిన వారిపై దాడికి దిగారు. కర్రలతో చితకబాదారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్, ఎలక్ట్రికల్ మెకానికల్ బ్రాంచ్‌కు చెందిన విద్యార్థులు క్రాంతికుమార్, హరిచరణ్, అనిల్, వెంకటస్వామి, జ్యోతి కిరణ్, సందీప్‌లను అదే కళాశాలలో ఫైనల్ ఇయర్ మెటలర్జీ కెమికల్స్ చదువుతున్న సీని యర్ విద్యార్థులు చందు, జానకిరామ్, రాకేశ్, అశోక్, సాగర్, నాగరాజు, సాయి ప్రసన్న, రంజిత్‌లు కొంత కాలంగా వేధిస్తున్నారు. రాత్రివేళ తమ గదికి రావాలంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. దీంతో బాధిత విద్యార్థులు ఈ విషయాన్ని ప్రిన్సిపాల్‌కు, హాస్టల్ వార్డెన్‌ను తెలియజేశారు. అయినా వారు పట్టించుకోలేదు. శుక్రవారం సాయంత్రం సీనియర్ విద్యార్థులు హాస్టల్ మొదటి అంతస్తులో ఉన్న జూనియర్ల వద్దకు వచ్చి తమ గదికి రావాలని బెదిరించారు. అందుకు నిరాకరించిన వారిని కర్రలతో చావబాదారు. ఈ సంఘటనలో జూనియర్ విద్యార్థి క్రాంతికుమార్ స్పృహ కోల్పో యాడు. మరికొంత మంది జూనియర్ విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని సహచర విద్యార్థులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు ర్యాగింగ్‌పై విచారణ చేపట్టారు. -
తిరుపతి ఎస్జిఎస్ కాలేజిలో ర్యాగింగ్ కలకలం
టీటీడీకి అనుబంధంగా ఉండే శ్రీ గోవిందస్వామి (ఎస్జిఎస్) ఆర్ట్స్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. కొంతమంది సీనియర్ విద్యార్థులు కలిసి ఓ జూనియర్ విద్యార్థిని వేధిస్తూ చిత్రహింసలకు గురి చేశారు. అయితే ఈ ర్యాగింగ్ ఘటనను కప్పిపుచ్చేందుకు కాలేజి యాజమాన్యం ప్రయత్నించింది. తమను సీనియర్లు ర్యాగింగ్‌తో చిత్ర హింసలు పెడుతున్నారని జూనియర్ విద్యార్థులు వాపోయారు. అయితే, వారిని మీడియా ముందుకు రానీయకుండా కాలేజి యాజమాన్యం అడ్డుకుంటోంది. దాంతో విషయాలు పూర్తిగా బయటకు రాలేదు. గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఆర్కిటెక్చర్ కాలేజిలో ర్యాగింగ్ కారణంగా రిషితేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇంకా చల్లారకముందే పవిత్ర తిరుపతి క్షేత్రంలో ఇలా జరగడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.