పాలిటెక్నిక్ హాస్టల్‌లో ర్యాగింగ్
హైదరాబాద్: ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా ర్యాగింగ్‌కు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా సీనియర్ విద్యార్థుల వికృత చేష్టలకు రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్‌లోని జూనియర్ విద్యార్థులు బలయ్యారు. తమ గదికి రావాలంటూ వేధించిన సీనియర్ విద్యార్థులు అందుకు నిరాకరించిన వారిపై దాడికి దిగారు. కర్రలతో చితకబాదారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్, ఎలక్ట్రికల్ మెకానికల్ బ్రాంచ్‌కు చెందిన విద్యార్థులు క్రాంతికుమార్, హరిచరణ్, అనిల్, వెంకటస్వామి, జ్యోతి కిరణ్, సందీప్‌లను అదే కళాశాలలో ఫైనల్ ఇయర్ మెటలర్జీ కెమికల్స్ చదువుతున్న సీని యర్ విద్యార్థులు చందు, జానకిరామ్, రాకేశ్, అశోక్, సాగర్, నాగరాజు, సాయి ప్రసన్న, రంజిత్‌లు కొంత కాలంగా వేధిస్తున్నారు.
రాత్రివేళ తమ గదికి రావాలంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. దీంతో బాధిత విద్యార్థులు ఈ విషయాన్ని ప్రిన్సిపాల్‌కు, హాస్టల్ వార్డెన్‌ను తెలియజేశారు. అయినా వారు పట్టించుకోలేదు. శుక్రవారం సాయంత్రం సీనియర్ విద్యార్థులు హాస్టల్ మొదటి అంతస్తులో ఉన్న జూనియర్‌ల వద్దకు వచ్చి తమ గదికి రావాలని బెదిరించారు. అందుకు నిరాకరించిన వారిని కర్రలతో చావబాదారు.
ఈ సంఘటనలో జూనియర్ విద్యార్థి క్రాంతికుమార్ స్పృహ కోల్పో యాడు. మరికొంత మంది జూనియర్ విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని సహచర విద్యార్థులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు ర్యాగింగ్‌పై విచారణ చేపట్టారు.